breaking news
Famous painter
-
నాకు నేను మెరుగులు దిద్దుకుంటూనే ఉంటాను...
ప్రముఖ చిత్రకారుడు బాపు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు బాలి. లక్షల చిత్రాలు గీసిన చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన ‘చిత్ర’ యానాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో పనిచేసి, ఇప్పుడు సొంతగడ్డ విశాఖలో స్థిరపడ్డ బాలి జీవన ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. మా తండ్రి లక్ష్మణరావు బ్రిటిష్ వారి పాలనలో ఆర్మీలో సుబేదార్ ఆయనకు చిత్రకళపై ఆసక్తి ఉండేది. వీలు చిక్కినప్పుడల్లా బొమ్మలు వేసేవారు. అమ్మ అన్నపూర్ణ అందమైన ముగ్గులు వేసేవారు. అలా వారిద్దరి నుంచి నాకు చిత్రకళ అబ్బింది. ఆరేళ్ల వయసు నుంచే ఏకాంతంగా కూర్చుని ఏవేవో బొమ్మలు గీసేవాడ్ని. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా పీడబ్ల్యుడీలో చేరాను. అందులో ఉండగా నాకిష్టమైన బొమ్మలు వేసుకునే తీరికుండేది కాదు. దీంతో ‘బొమ్మలేసుకుని బతకలేనా?’ అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకొచ్చేశాను. నేను గీసిన ‘ఉబుసుపోక’ అనే రేఖాచిత్రం 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికలో తొలిసారిగా అచ్చయింది. ఆ తర్వాత కొన్ని తెలుగు దినపత్రికల్లో కార్టూనిస్టుగా, స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశాను. అలా పనిచేస్తూనే నవలలకు కవర్ డిజైన్లు, బ్రోచర్ డిజైన్లు గీస్తూనే అందమైన బొమ్మలు వేసేవాడ్ని. మల్లాది, యండమూరి, లత, రంగనాయకమ్మ, అడవి బాపిరాజు, కొడవటిగంటి సహా దాదాపు ప్రముఖ రచయితలందరి నవలలకు కవర్ పేజీ డిజైన్లు వేశాను. కథలు రాశాను. కార్టూన్లపై ఎనిమిది పుస్తకాలు, జోక్స్పై రెండు సంకలనాలు తెచ్చాను. రెండు చిన్నపిల్లల నవలలు, ‘చిన్నారులు బొమ్మలు వేయడం ఎలా’? అనే పుస్తకం కూడా ముద్రించాను. బాలి ఇలా.. నేను పత్రికల్లో పనిచేసేటప్పుడు శంకర్ పేరు మీద ఆర్టులు, కార్టూన్లు వేసేవాడ్ని. అప్పటికే శంకర్ పేరుతో పలువురు ఆర్టిస్టులున్నారు. దీంతో అప్పటి పత్రికా సంపాదకుడు పురాణం గారు నన్ను ‘బాలి’గా మార్చారు. పురస్కారాలు.. నాకెన్నో పురస్కారాలొచ్చాయి. న్యూజిలాండ్ బైబిల్ సొసైటీకి బొమ్మలు గీసినందుకు, పర్యావరణ పరిరక్షణపై జర్మనీ నిర్వహించిన పోటీలో ప్రతిభ చూపినందుకు ప్రశంసలందుకున్నాను. చిన్నపిట్టల పెద్దమనసు అనే పిల్లల నవలకు ఎన్‌సిఇఆర్‌టి బహుమతినిచ్చింది. ఇంకా చిత్రకళా సమ్రాట్, హంస వంటి పలు అవార్డులు దక్కాయి. నేను వేసిన పెయింటింగ్‌లను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మచిలీపట్నం డిప్యూటీ కలెక్టర్ ఆఫీసుల్లో అలంకరించారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చికాగో (అమెరికా)ల్లో నేను వేసిన బొమ్మలను ప్రదర్శించారు. సాగరతీరంలో కాలక్షేపం.. నా సతీమణి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో కన్నుమూసింది. రెండేళ్ల క్రితం విశాఖలోని సొంతింటికి వచ్చేశాను. పిల్లలు అమెరికాలో సెటిలవ్వడంతో ఒక్కడినే ఉంటున్నాను. నా వంట నేనే చేసుకుంటాను. టిఫిన్‌కు బదులు పెరుగన్నం తినడమే నా ఆరోగ్య రహస్యం. పగలంతా ప్రశాంతంగా కూర్చుని బొమ్మలు వేసుకుంటాను. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని బీచ్‌కి నడిచి వెళ్తాను. నాకు టీవీ అంటే ఇష్టం ఉండదు. సినిమా చూసి 30 ఏళ్లవుతోంది. బొమ్మలపై ఉన్న ఇష్టంతో ఒక్కడినే ఉన్నా నాకు బోర్ అనిపించదు. రాత్రివేళ కథల పుస్తకాలు చదువుతాను. స్వయంకృషితోనే చిత్రకళను అభ్యసించాను. ఆర్టిస్టు ఎప్పుడూ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. బొమ్మల్లో మార్పులతో కొత్తదనం తెచ్చుకోవాలి. బొమ్మలెప్పుడూ మూసలా ఉండకూడదు. నేను రాసిన 30 కథలను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. జీవితాంతం బొమ్మలు గీస్తూనే ఉంటాను. ...::: బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: శ్రీనివాస్ ఆకుల -
కోనసీమలో బాపు కళావేదిక
►బాపు చిత్రాలతో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు ►చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు ‘కొరసాల’ అమలాపురం టౌన్ : ప్రసిద్ధ చిత్రకారుడు బాపు గీసిన అపురూప చిత్రాలను చిరస్మరణీయంగా నిలిపేందుకు కోనసీమ చిత్ర కళాపరిషత్ సన్నాహాలు చేపట్టింది. చిత్ర కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి పాతికేళ్లుగా అమలాపురంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పదివేల వినాయక చిత్రాలను విభిన్న రూపాల్లో గీసిన ప్రముఖ చిత్రకారుడు సీతారామస్వామికి బొమ్మల బ్రహ్మ బాపుతో 45 ఏళ్ల అనుబంధం ఉంది. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా జనవరిలో నిర్వహించే జాతీయ ఉత్సవాలకు వచ్చే జనవరితో 25 ఏళ్లు నిండుతున్నాయి. 2015 జనవరి మూడో వారంలో చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి చిత్రలేఖనంలో తన గురుతుల్యుడైన బాపును సీతారామస్వామి ముఖ్యఅతిథిగా ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకారం కూడా తెలిపారు. అయితే ఇంతలో బాపు అంతిమశ్వాస విడవడంతో రజతోత్సవాల నిర్వహణకు తీరని లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాపుతో తనకున్న అనుబంధం సాక్షిగా ఆయన గీసిన పలు కళాఖండాలను కోనసీమలో సజీవంగా పదిలపరచాలని సీతారామస్వామి నిర్ణయించారు. అమలాపురంలో తన నివాసం లోని సృష్టి కళానిలయంలో గురువారం జరిగిన బాపు సంతాప సభలో సీతారామస్వామి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బాపు పేరిట శాశ్వత గురుతులు సీతారామస్వామి ఇంటి ఆవరణలో సంతాపసభ నిర్వహించిన స్థలంలోనే బాపు కళా వేదిక ఏర్పాటు చేయనున్నారు. అలాగే తన ఆర్ట్ గ్యాలరీలోని ఓ గదిలో బాపు చిత్రాలతో ప్రదర్శనశాల కూడా నెలకొల్పుతున్నారు. 2015 జనవరిలో అమలాపురం చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు జరిగే వేదికకు బాపు కళాపీఠం అని పేరుపెడుతున్నట్టు ప్రకటించారు. అలాగే బాపు పేరిట ఓ ప్రముఖ చిత్రకారుడికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో కోనసీమలో 25 వేల మంది విద్యార్థులకు 25 చోట్ల బాపు పేరిట చిత్రలేఖన పోటీలు జరుగుతాయన్నారు. వీరిలో 100 మంది ఉత్తమ చిత్రకారులకు బాపు స్మారక అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. పోటీలు నిర్వహించే 25 కేంద్రాల్లో కూడా బాపు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తామన్నారు. సీతారామస్వామి తొలి గురువు బాపు: కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల తన తొలిగురువుగా బాపును పేర్కొంటారు. వారిద్దరికీ 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో సీతారామస్వామి చిత్రకళా ప్రదర్శనలను బాపు తిలకించిన సందర్భాలూ ఉన్నాయి. బాపుపై తన ఎనలేని అభిమానానికి గుర్తుగా 43 ఏళ్ల కిందటే తన కుమారుడికి సీతారామస్వామి బాపు అని పేరుపెట్టారు. అంతేకాదు.. తన మనుమడికి సైతం ధృవబాపు అని పేరు పెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సీతారామస్వామి కుమారుడు బాపు గతంలో హైదరాబాద్‌లో నివసించేవారు. అప్పట్లో వారింటికి బాపు అనేకసార్లు వచ్చేవారని, ఎన్నో ఆత్మీయ సందర్భాలు తమ మధ్య ఉన్నాయని సీతారామస్వామి ‘సాక్షి’కి వివరించారు.