breaking news
Equal compensation
-
అసైన్డ్ భూములకూ సమానంగా పరిహారం
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో పట్టా భూములతోపాటు అసైన్డ్ భూములకూ సమానంగా పరిహారమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్లో మెరిట్ లేదంటూ కొట్టివేసింది. ఒకే పరిహారం కోరుతూ.. ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న పట్టాభూములకు, అసైన్డ్ భూములకు ఒకే పరిహారం ఇవ్వాలంటూ కిన్నెర శ్యామ్‌తోపాటు మరో 26 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఒకేలా పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ 2022 మార్చి 10న తీర్పు ఇచ్చారు. ఆ విచారణ సందర్భంగా భూసేకరణ అధికారి వర్సెస్ మేకల పాండు కేసులో గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా ప్రత్యేక కలెక్టర్, మరికొందరు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున పి.భావనారావు, ప్రతివాదుల తరఫున శ్రీనివాస్‌రావు, కీర్తి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని, సమానంగా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం పూర్తిగా పరిహారం చెల్లించకుండానే భూమిని సేకరించడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించింది. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిహారంలో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పానగల్ వద్ద ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1998 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణ పరిహారాన్ని నిర్ణయిస్తూ అదే ఏడాది జూలైలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. పట్టాభూములకు ఎకరానికి రూ.31,500 పరిహారం నిర్ణయించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు ఎకరానికి ఇంత అని కాకుండా, కొంతమొత్తం పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పరిహారంపై సంతృప్తి చెందని పట్టాదారులు పలుమార్లు కోర్టును ఆశ్రయించగా పరిహారం ఎకరానికి రూ.1,10,000కు పెరిగింది. ఈ క్రమంలో తమకు కూడా పరిహారాన్ని పెంచాలంటూ 2011 నుంచి 2015 వరకు అసైన్్డదారులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. -
సమాన పరిహారం ఇస్తేనే..
గన్నవరం : కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం అందరికీ సమాన పరిహారం ఇస్తేనే తమ భూములు విమానాశ్రయ విస్తరణకు ఇస్తామని రైతులు తేల్చిచెప్పారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి గ్రామాలకు చెందిన రైతులతో నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ కావాలో, పరిహారం కావాలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు రైతులకు అంగీకార పత్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ ధర ప్రకారం తమ గ్రామాల్లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పరిహారం అందజేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని రైతులు చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ చేయనున్న గ్రామాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్ ధర కలిగిన కేసరపల్లి భూములకు ఇచ్చే ఎకరానికి రూ.79 లక్షల వరకు పరిహారాన్ని మిగిలిన గ్రామాల రైతులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన కొంతమంది రైతులు మాత్రం తమకు తుళ్లూరులోని జరీబు రైతులకు ఇస్తున్న ప్యాకేజీని వర్తింపజేస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఈ విషయాలను ఇటీవల హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబునాయుడును కూడా కలిసి విన్నవించామని తెలిపారు. తమ డిమాండ్ల మేరకు న్యాయమైన పరిహారం ఇస్తే భూసేకరణకు సహకరిస్తామని, లేనిపక్షంలో న్యాయమైన పరిహారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. విస్తరణ కారణంగా ఇళ్లు పోతున్న దళితులకు ఆర్టీసీ అకాడమీలోని ఖాళీ స్థలాన్ని గాని, వెటర్నరీ భూములు గాని కేటాయించాలని కోరారు. తహశీల్దార్ ఎం.మాధురి, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, నిర్వాసిత రైతు సంఘ నాయకులు చింతపల్లి సీతారామయ్య, ముక్కామల ఉమామహేశ్వరరావు, వై.నరసింహారావు, గూడవల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.