Electronic Manufacturing Clusters
-
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్‌కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్‌తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్‌పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
చిత్తూరు జిల్లాలో మరో ఈఎంసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్లను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)ను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లాలో మరో ఈఎంసీ వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 500 ఎకరాల్లో అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈఎంసీ–1, ఈఎంసీ–2, శ్రీసిటీ ఈఎంసీలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈఎంసీ–2 స్కీంలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో రూ.730 కోట్ల పెట్టుబడి అంచనాతో 530 ఎకరాల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, రెండోది పాదిరేడు అరణ్యం వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఈఎంసీల సంఖ్య 5కి చేరనుంది. పీఎల్ఐ స్కీంలో మెజార్టీ కంపెనీల ఆకర్షణే లక్ష్యం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిని తగ్గించి దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్పత్తి ఆధారిత రాయితీలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్–పీఎల్ఐ) పథకం కింద కేంద్రం భారీ రాయితీలను ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 23 కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేయగా వారం రోజుల క్రితం తొలి దశలో 16 కంపెనీలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో మెజార్టీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల(ఈఎంసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 8 క్లస్టర్లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి పోత్సాహం అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మంగళవారమిక్కడ రాష్ట్రాల ఐటీ మంత్రులు, కార్యదర్శులతో డిజిటల్ ఇండియాపై తొలి సమావేశం సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే తమ ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా విజన్ ఉద్దేశమన్నారు. కాగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ(డైట్‌వై) తుది ఆమోదం పొందిన రెండు క్టస్లర్లు కూడా మధ్య ప్రదేశ్‌లోనే ఏర్పాటు కానున్నాయని... సూత్రప్రాయ ఆమోదం పొందిన వాటిలో రెండు తెలంగాణలో.. తమిళనాడు, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌లో చెరొకటి చొప్పున ఉన్నట్లు ప్రసాద్ వెల్లడించారు. కర్ణాటకలోని బ్రౌన్‌ఫీల్డ్ ఈఎంసీ(ఇప్పటికే ఉన్నదాని విస్తరణ) కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరోపక్క, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో చెరొక ఈఎంసీ ఏర్పాటుకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదం కోసం డైట్‌వై సిఫార్సు చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కాగా, సవరించిన ప్రత్యేక ప్యాకేజీ పథకం(ఎం-సిప్స్) అమలు చేసేందుకు 51 ఈఎంసీలను డైట్‌వై గుర్తించి.. నోటిఫై చేసింది. ఈ నోటిఫైడ్ క్లస్టర్లలోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్(ఈఎస్డీఎం) యూనిట్లకు ఎం-సిప్స్ కింద లభించే ప్రయోజనాలు లభిస్తాయి. నోటిఫై చేసిన ఈఎంసీల్లో హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ఏడు చొప్పున; రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఆరు చొప్పున; ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కేరళ, మధ్య ప్రదేశ్లలో మూడేసి; కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెండేసి; పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, తమిళనాడుల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.


