breaking news
eastren naval command
-
విశ్వ విఖ్యాత విశాఖ..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం అంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర తూర్పు నౌకా దళానిది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబరులో సాగర తీరంలో నేవీ డే నిర్వహిస్తారు. పలు యుద్ధనౌకల విన్యాసాలతో విశాఖ తీరం పులకిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో రెండు భారీ నౌకా దళ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ విన్యాసాలతో అంతర్జాతీయంగా నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాయని తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక నగరంగా వృద్ధి చెందుతున్న విశాఖపట్నం తీరంలో తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్, రాష్ట్రపతి నౌకాదళ పరిశీలన), అదే నెల 25 తర్వాత 45 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, నౌకా దళాధికారులు, సిబ్బందితో మిలన్ విన్యాసాలు జరుగుతాయని చెప్పారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ టీజర్‌ని ఆవిష్కరించారు. పీఎఫ్ఆర్లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఇండియన్ మర్చంటైన్ మెరైన్‌కి చెందిన 50 యుద్ధ నౌకలు, 50 యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ విన్యాసాల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆ తర్వాత వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక వాతావరణం, పరస్పర సహకారంతో సత్సంబంధాలు బలోపేతం చేస్తూ మిలన్ విన్యాసాలు జరుగుతాయన్నారు. ఈ విన్యాసాలకు శత్రు దేశాలుగా భావించే పాకిస్తాన్, చైనాలకు మాత్రం ఆహ్వానం పంపలేదని, దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కోవిడ్ కారణంగా ఈసారి నేవీ డే, వార్ మెమోరియల్ వద్ద లేయింగ్ సెరమనీ రద్దు చేశామని ప్రకటించారు. దేశ రక్షణలో కీలకమైన విశాఖ జిల్లా రాంబిల్లిలోని నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బేస్‌లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇండియన్ నేవీ కీలకం భారత అభివృద్ధిలో ఇండియన్ నేవీ కీలకంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలంటే జల రవాణా ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. అందుకే నౌకాయాన వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించడానికి నౌకాదళం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీ నేవల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కమాండర్ ఎం గోవర్థన్ రాజు, ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి, నేవల్ డాక్‌యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ రియర్ అడ్మిరల్ ఐబీ ఉత్తయ్య, సబ్‌మెరైన్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ స్వప్న్‌శ్రీ గుప్త తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ బేస్, సీ ట్రయల్స్ పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా పని చేస్తుందని చెప్పారు. చొరబాట్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న 4 వేల మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చామని, వారిలో ఏ ఒక్కరికీ కోవిడ్ సోకకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్పారు. వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ కూడా తెచ్చామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా యుద్ధ నౌకల పరికరాల్ని స్థానిక పారిశ్రామికవేత్తల నుంచి కొనుగోలు చేస్తున్నామని బిస్వజిత్ తెలిపారు. -
కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..
సాక్షి,కాకినాడ రూరల్: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. పనులపై వైస్ అడ్మిరల్ సంతృప్తి మ్యూజియం పనులపై కలెక్టర్ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైస్ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు. వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్ బార్, ఇంటర్‌ప్రెటేన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్ ఎన్క్లేవ్ వద్దకు వెళ్లిన వైస్ అడ్మిరల్ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. -
త్వరలో అత్యాధునిక ఆయుధ సంపత్తి: తూర్పు నౌకాదళం
రాబోయే రెండు సంవత్సరాలలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నట్లు తూర్పు నౌకా దళం ప్రధాన అధికారి అనిల్ చోప్రా తెలిపారు. జనవరి నుంచి విశాఖపట్నంలో రోజుకు 24 గంటల పాటు విమానాల రాకపోకలకు అనుమతులు వస్తాయని, అలాగే రానున్న రెండేళ్లలో కొత్తగా నాలుగు ఎయిర్‌వే స్టేషన్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలతో మరింత భాగస్వామ్యం కోసం నౌకాదళం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చోప్రా తెలిపారు. విశాఖలో మారిటైమ్ యూనివర్సిటీ వస్తే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు.