అతనితో కేట్ అనుబంధంపై పుకార్ల షికార్లు!
లండన్: కుటుంబంలో.. సందర్భాన్ని బట్టి చలోక్తులు విసురుతూ, అందరినీ నవ్వించేవారంటే ఎవరికైనా ఇష్టం ఏర్పడటం సహజం. అలాంటి వాళ్లను గుర్తుచేసుకుంటూ 'ఈ టైమ్ లో వాడుంటే ఎంత బాగుండు!' అని చాలాసార్లు అనుకుంటాం. ప్రతి కుటుంబంలో అలాంటి 'ఇష్టుడైన' వ్యక్తి ఒకరు తప్పక ఉంటారు. బ్రిటన్ రాచకుటుంబంలో ఆ స్థానం ప్రిన్స్ హ్యారీది. ప్రిన్స్ చార్లెస్- డయానాల చిన్నకొడుకుగా తండ్రిలోని రాచఠీవి, తల్లిలోని ఆకర్షణను పుణికిపుచ్చుకున్న హ్యారీ.. అన్నయ్య ప్రిన్స్ విలియంతో పోల్చుకుంటే డిఫరెంట్. అయితే అతని ప్రత్యేక స్వభావమే కొన్ని వికృత వ్యాఖ్యలకు తావిస్తోంది.
విలియం- కేట్ మిడిల్టన్ ల పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఆ జంట పాల్గొన్న దాదాపు అన్ని కార్యక్రమాలకు హ్యారీ కూడా హాజరయ్యేవాడు. అలాంటి చోట్ల వదిన కేట్ మిడిల్టన్ తో హ్యారీ దగ్గరితనాన్ని ప్రదర్శించడం, ఆమెకు మాత్రమే వినపడేలా జోకులు పేల్చడం, దానికి ఆమె పగలబడి నవ్వడం, మధ్యన కూర్చున్న విలియం మాత్రం వీళ్లిద్దరి గుసగుసలతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం జరుగుతుండేది. సెలబ్రిటీల బంధాలపై చెలరేగినట్లే కేట్- హ్యారీల అనుబంధంపైనా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమెతో అతను సరసాలాడుతున్నాడంటూ కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బ్రిటన్ మీడియా కూడా వారి బంధంపై ఫొటోలతో కూడిన కథనాలను రచిస్తోంది.
మహిళలపై.. అదికూడా ఉన్నత స్థానంలో ఉన్న కేట్ లాంటి అందగత్తెలపై ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం సహజమేనని, కేట్- హ్యారీలది సోదరబంధమని రాయల్ కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి. తాత ప్రిన్స్ ఫిలిప్ మాదిరి హ్యారీ కూడా హాస్యచతురుడని, అందుకే ప్రతిఒక్కరు అతణ్ని ఇష్టపడతారని రాచకుటుంబ ప్రతినిధులు అంటున్నారు. అదీగాక హ్యారీ.. 'కేట్ తన పెద్దక్కలాంటిది' అని పబ్లిక్ మీటింగ్స్ లో పలు మార్లు చెప్పారు. కొన్నిసార్లైతే 'ఆమె(కేట్)ను అమ్మ(డయానా)ను మరిపించే వ్యక్తిగా భావిస్తున్నట్లు' పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా, నిష్కల్మషంగా కొనసాగుతున్న అనుబంధంపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం నెటిజన్లకు తగునా? అని రాయల్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.