breaking news
DSC - 14
-
విలీన కష్టాలు
ఏలూరు సిటీ :‘రాష్ట్ర విభజనతో ఎవరికేం ఒరిగిందో తెలియదు కానీ.. మా జీవితాలు మాత్రం నాశనమయ్యే దుస్థితి నెలకొంది. బాగా చదువుకున్నా ఉద్యోగాలకు దరఖాస్తులు చేయలేని దీనస్థితిలో బతుకుతున్నాం. మాకు అన్యాయం చేయకండి’ అంటూ పోలవరం పాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడు, కుకునూరు డీఎస్సీ-14 అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన 200 మందికి పైగా అభ్యర్థులు డీఎస్సీ-14లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానికత లేదంటూ అందులో 100కు పైగా దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొందుతున్నామని అభ్యర్థులు తెలి పారు. తమ దరఖాస్తులను తిరస్కరించినట్టు అధికారులు సమాచారం ఇవ్వడంతో తీవ్ర మానసిక వేదనకు గరవుతున్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో డీఈవో డి.మధుసూదనరావు లిఖతపూర్వక సమాధానం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయండి మా తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి చదివిం చింది. బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ-14లో టీచర్ ఉద్యోగం వస్తుందని భావించాను. మా తల్లిని బాగా చూసుకోవచ్చని ఆశపడ్డాను. కానీ.. రాష్ట్ర విభజన మాకు శాపంగా మారుతుందని హించలేదు. ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేం బలైపోతున్నాం. న్యాయం చేయండి. - ఎం.రమణయ్య, కుకునూరు రెక్కాడితేగాని డొక్కాడదు కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం మాది. పనులు చేసుకుంటూనే చదువుకున్నాను. డీఎస్సీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. సమాధానం చెప్పే నాథుడే లేడు. రెక్కాడితే గాని డొక్కాడని మాకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం కావాలి. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. - కారం నాగేశ్వరరావు, వేలేరుపాడు శిక్షణకు రూ.15 వేలు కట్టా డీఎస్సీ-14కు దరఖాస్తు చేసుకున్నాను. పరీక్ష కోసం ఆవనిగడ్డలోని కోచింగ్ సెంటర్కు రూ.15 వేలు చెల్లించా ను. అక్కడే ఉండి చదువుకునేందుకు మరో రూ.5 వేలు ఖర్చయ్యాయి. ఇప్పుడు దరఖాస్తు తిరస్కరిస్తే నా పరిస్థితి ఏం కావాలి. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. మాకు ఇలాంటి కష్టాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు. - కుంజా నాగమణి, వేలేరుపాడు -
డీఎడ్లతో కబడ్డీ
డీఎస్సీ - 14 పేరుతో ప్రభుత్వం డీఎడ్ అభ్యర్థులతో కబడ్డీ ఆడుతోంది. పరీక్షలు ఇంకా పూర్తికానందున వారు డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అనర్హులని తేల్చేసింది. అక్టోబర్లో నిర్వహించాల్సిన పరీక్షలను ఇప్పటి వరకూ జర పకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన సర్కారు ఆ తప్పును అభ్యర్థులపై రుద్దేస్తోంది. ఎలాగూ మే 9 వరకూ డీఎస్సీ జరగదు కనుక తమ దరఖాస్తులను అనుమతించాలని అభ్యర్థులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏలూరు సిటీ :ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం తెరతీస్తే నిరుద్యోగుల కళ్లలో ఆనందం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఎంత కష్టమైనా భరించి ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తారు. తీరా నిబంధనలు బంధనాలుగా మారితే...వారి ఆశలపై ప్రభుత్వమే నీళ్ల చల్లితే... డీఎస్సీ-14 నియామకాల పరిస్థితి కూడా ఇదేస్థాయిలో ఉంది. డీఎస్సీ-14తో నిరుద్యోగ అభ్యర్థుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి డీఎడ్ అభ్యర్థులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు 11రోజులే మిగిలి ఉండడంతో డీఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డీఎడ్ అభ్యర్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవటంతో జిల్లావ్యాప్తంగా సుమారు 2వేల మంది వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హత లేక వేదనకు గురవుతున్నారు. ఒకటి రెండు సబ్జెక్టులు మిగిలిన కొందరు అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీనిపై అధికారులు స్పందించి సత్వరమే చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు. బాధ్యులెవరు వాస్తవానికి డీఎడ్ అభ్యర్థులకు అక్టోబర్, నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ పరీక్షలు నిర్వహించనే లేదు. ఇక డిసెంబర్ 29 నుంచి 2015 జనవరి 2వరకు పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించిన అధికారులు ఎందుకు పరీక్షలు నిర్వహించలేదో వారికే తెలియాల్సి ఉంది. కావాలనే పరీక్షలు నిర్వహించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డీఎస్సీలో అభ్యర్థుల సంఖ్యను తగ్గించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎడ్ కాలేజీల్లో చోటుచేసుకున్న అవకతవకల కారణంగానే పరీక్షలు వాయిదా వేసినట్టు ప్రభుత్వం చెబుతుండగా, కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు తమను బాధ్యులను చేయటం ఎంతవరకు న్యాయమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రభుత్వ డీఎడ్ కాలేజీ దూబచర్లలో ఉండగా మరో 17 డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. మరో ఐదు కాలేజీలకు కొత్తగా అనుమతులు వచ్చినట్టు చెబుతున్నారు. వీటి నుంచి1 ప్రతి ఏడాది సుమారు 2500 మంది వరకూ అభ్యర్థులు డీఎడ్ కోర్సు పూర్తిచేసి బయటకు వస్తున్నట్టు అంచనా. ఎలాగూ ప్రభుత్వమే తప్పులు చేసింది కాబట్టి దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని, సర్టిఫికెట్లు పరీక్ష నాటికి సమర్పిస్తామని అభ్యర్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేయనివ్వండి పరీక్షలు ఆలస్యం కావటంతో ఇప్పుడు డీఎస్సీకి దరఖాస్తు చేయలేని స్థితిలో ఉన్నాం. రెండవ సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. కానీ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. అక్టోబర్లో పరీక్ష నిర్వహించి ఉంటే ఇప్పుడు ధీమాగా దరఖాస్తు చేసేవాడిని. పేద కుటుంబం నుంచి వచ్చాను. మరో డీఎస్సీ అసలు పెడతారో లేదో తెలీదు. మళ్లీ అవకాశం ఉంటుందో లేదో. డీఎస్సీ పరీక్ష మే9న నిర్వహిస్తారు. ప్రస్తుతానికి మాకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది. అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. - తోటకూరి రాటాలు, డీఎడ్ అభ్యర్థి ప్రభుత్వానికి నివేదిస్తాం డీఎడ్ అభ్యర్థులకు పరీక్షలు ఆలస్యం అయ్యాయి. ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ కావాల్సి ఉంది. అయితే జిల్లాలోని అభ్యర్థులు ఒక వినతిపత్రం సమర్పిస్తే దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాను. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవకాశం ఇస్తుందేమో చూడాలి. - డి.మధుసూదనరావు, డీఈవో