breaking news
District public
-
జలం.. కలవరం
కడప ఎడ్యుకేషన్ : భానుడి ప్రతాపానికి జిల్లా జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు భూరగ్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షం కొంతమేర ఉపశమనం ఇచ్చినా మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. జిల్లా వ్యాప్తంగా రోజూ ట్యాంకర్ల ద్వారా 765 గ్రామాలకు 1,116 ట్రిప్పులను గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. బోర్లను అద్దెకు తీసుకుని 183 గ్రామాలకు నీరందిస్తున్నారు. రోజురోజుకూ నీటి ఎద్దడి గ్రామాలు పెరగుతున్నాయి. దీంతో జిల్లా జనం కలవర పడుతున్నారు. ఫిబ్రవరిలో 327 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి ఉండగా మార్చి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 463 గ్రామాలకు చేరింది. ఏప్రిల్ మూడవ వారం వచ్చేసరికి 765 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 647 మీల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 324 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 49.9 శాతం తక్కువ వర్షం కురిసింది. జిల్లా వాప్తంగా రోజుకు మంచి నీటి కోసం ప్రభుత్వం రూ.3.20 లక్షలు ఖర్చు చేస్తోంది. కరువు తాండవం జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో కరువు విలయతాండవం చేస్తోంది. గుక్కెడు మంచి నీటి కోసం జనం భగీరథ యత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులకు తినేందుకు మేతలేక రైతులు విలవిలలాడుతున్నారు. గ్రామాల్లో బిందెడు నీటి కోసం జనం రాత్రిళ్లు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే జనం వలస వెళ్లక తప్పకపోవచ్చు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 21 గ్రామాల్లో, కమలాపురం నియోజకవర్గంలో 36 గ్రామాలు, కోడూరు నియోజకవర్గంలో 35 గ్రామాలు, పులివెందుల నియోజకవర్గంలో 26 గ్రామాలు, రాజంపేట నియోజకవర్గంలో 153 గ్రామాలు, రాయచోటి నియోజకవర్గంలో 235 గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో భూగర్భ జలమట్టం 30 మీటర్ల లోతుకు పడిపోయింది. గాలివీడు, ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి, కాశినాయన ,బద్వేల్, పుల్లంపేట, ఒంటిమిట్ట, ఆట్లూరు, చిట్వేలి, లింగాల, పెనగలూరు. పోరుమామిళ్ల, రామాపురం, కోడూరు మండలాల్లో జలం పాతాళానికి పడిపోయింది. ఎవరైనా డబ్బు వృధా చేస్తుంటే నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారంటాం. అలాంటిది నీళ్ల కోసమే పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. నగరం, పట్టణాల్లో సైతం నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో నీటి వ్యాపారం మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ధనిక వర్గాల వారు మాత్రమే మినరల్, ప్యాకేజ్డ్ నీటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడికి తోడు.. చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తోంది. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారు సైతం తాగడానికి క్యాన్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో ఒక్కో కుటుంబం సగటున నెలకు రూ.600 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని లక్షలాది మధ్యతరగతి, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు ఖర్చు చేస్తున్న మొత్తం ఎంతో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. -
జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు రూ.280 కోట్లు
జోగిపేట/పుల్కల్: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.280 కోట్ల వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పుల్కల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగూర్ ప్రాజెక్ట్ లోపల కుడి, ఎడమ వైపులా నిర్మించ తలపెట్టిన ఇన్‌టెక్‌వెల్ (వాటర్ గ్రిడ్ పంపింగ్) నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్‌కుమార్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకున్నారు. ఎడమ వైపు నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి అందోల్, మెదక్, రామాయంపేట, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లోని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తామని, ఇన్‌టెక్ వెల్ నుంచి ప్రాజెక్ట్ లోపలి భాగం వరకు సుమారు కిలోమీటరున్నర పొడవున ఫీడర్ చానల్ కాలువ ద్వారా నీటిని తరలించడం జరుగుతుందని ఎస్ఈ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వేసవి సమీపిస్తున్నందున ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ కుడి వైపున మునిపల్లి, బుసారెడ్డిపల్లి గ్రామాల శివారులోని మంజీర నదిలో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ నుంచి సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇక్కడ భూ సేకరణ సమస్య లేనందున గ్రిడ్ పనులను వేగవంతంగా చేయాలన్నారు. సింగూర్ ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్ బెడ్ల పనులను వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్‌తోపాటు, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో మంజీర నీటి పథకాన్ని విలీనం చేసి, నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బుస్సారెడ్డిపల్లిలో స్థలపరిశీలన మునిపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివారులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్స్ స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని బుదేరా గ్రామ శివారులో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా తదితరులున్నారు.