breaking news
district prajaparisat
-
జెడ్పీ పాలనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం
హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ పనితీరు, వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉద్యోగుల సేవలు తదితర వివరాలు సేకరించేందుకు కేంద్ర బృందం సోమవారం వరంగల్ జిల్లా పరిషత్‌కు వచ్చింది. తెలంగాణలో ఉత్తమ జిల్లా పరిషత్గా వరంగల్ ఎంపిక కావడంతో పనులను పరిశీలించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వివరాలు సేకరించింది. దేశంలోని అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లు ఈ ఫార్మాట్లో వివరాలు పొందుపరిచాయి. అరుుతే తెలంగాణలో వరంగల్ జెడ్పీ అత్యధిక పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జెడ్పీలలో ఆన్లైన్లో పొందుపర్చిన మేరకు పనులు జరిగాయా? లేదా అని తెలుసుకునేందుకు కేరళ, మణిపూర్లకు చెందిన ఐఏఎస్ అధికారులు రాంనాయర్, కె.కె.ఠక్కర్తో కూడిన కేంద్ర బృందం జిల్లా పర్యటనకు వచ్చింది. అందుబాటులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులతో బృందం అధికారులు సమావేశమై వారి నుంచి పలు సమాధానాలు రాబట్టారు. అధికారాల బదలాయింపు, సమావేశాల నిర్వహణ తీరు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జెడ్పీటీసీ సభ్యులు తమ సమస్యలను వివరించారు. జెడ్పీలకు నిధులు నిలిచిపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని చెప్పారు. కాగా, ఈ బృందం మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, నిధుల వినియోగంపై తెలుసుకోనున్నారు. కేంద్ర బృందాలు అన్ని రాష్ట్రాలలో పర్యటించి పనితీరును పరిశీలించిన తర్వాత జాతీయ స్థాయిలో అధిక పాయింట్లు సాధించిన జిల్లాకు ప్రత్యేక నిధులు కేటారుుస్తారని జెడ్పీ సీఈవో అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజాపరిషత్‌గా ఎంపికైతే కేంద్రం నుంచి పారితోషికం కింద రూ.40 లక్షలు వస్తాయన్నారు. బృందం వెంట జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ తదితరులు ఉన్నారు. -
మొక్కుబడిగా..
కర్నూలు(జిల్లా పరిషత్) : మొదటిసారిగా నిర్వహించిన కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఏదైనా ప్రభుత్వ సమావేశమంటే ముందుగా అందుకు సంబంధించి అజెండా కాపీని సంబంధిత సభ్యులకు పంపిస్తారు. కానీ జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశానికి సంబంధించి అజెండా కాపీని అధికారులు కేవలం జెడ్పీ చైర్మన్‌కు మాత్రమే పంపించారు. సమావేశాలు జరుగుతాయన్న సమాచారం మాత్రమే ఆయా కమిటీలకు చేరవేశారు. దీంతో సమావేశానికి హాజరైనా ఏం మాట్లాడాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం గాక సభ్యులు నోర్లెళ్లబెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. మొత్తంగా అన్ని స్థాయీ సంఘాల సమావేశాలను జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నీ తానై నడిపించారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ ఉన్నందున తీర్మానాలు చేయకుండానే సమావేశాలు ముగించారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వర్క్స్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల అభివృద్ధి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సందర్భంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. సొంత భవనాలు గాకుండా అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోందని చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకిచ్చే పౌష్టికాహారం పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, పాణ్యం నియోజకవర్గంలో కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి 15 శాతం నిధులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు వెళ్తున్నాయని, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని చెప్పారు. దుర్గాబాయి మహిళా ప్రాంగణం మేనేజర్ మాట్లాడుతూ మహిళా ప్రాంగణం భవనం పాతబడిపోయిందని, దీనికి మరమ్మతులు చేయించాలని కోరారు. డాక్టర్స్ కాలనీలో ప్రాంగణం కోసం ఐదెకరాల స్థలం కూడా ఉందని, కర్నూలు జిల్లాకు మాత్రమే ప్రాంగణం నిర్మాణం కోసం నిధులు మంజూరు కాలేదని చెప్పారు.