కేంద్ర పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకివ్వాలి
14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు బదలాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లో ఉంటాయి. కేంద్ర నుంచి నిధులు రావడంలో ఆర్థిక సంఘం చేసే సిఫారసులే కీలకపాత్ర పోషిస్తాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్థికసంఘం చర్చలు జరిపింది.
రాష్ట్ర విభజన జరగడంతో ఆ చర్చలు నిష్ఫలమయ్యాయి. దీంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి, ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా సిఫారసులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఏపీలో ఆర్థిక సంఘం పర్యటిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వం ఇచ్చిన మెమోరాండంలోని అంశాలపై ముఖాముఖి చర్చిస్తుంది. 13న విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించి.. పారిశ్రామికవర్గాలు, రాజకీయ నేతల వినతిపత్రాలను కూడా స్వీకరిస్తుంది. వచ్చే నెలాఖరుకల్లా సిఫారసులతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.