Dinesreddi
-
ఎన్నికల అధికారుల హంగామా
ఉలిక్కిపడిన మాజీ డీజీపీ సెక్యూరిటీ సిబ్బంది సోదాల పేరిట హల్చల్.. అధికారుల తీరుపై దినేశ్‌రెడ్డి సీరియస్ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో అనుచరుల ఫిర్యాదు కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఎన్నికల అధికారులు తనిఖీల పేరిట హంగామా సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడమే గాక అనుచితంగా ప్రవర్తించి ఆనక ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి శుక్రవారం కంటోన్మెంట్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో ప్రచారానికి కాస్త విరామం ఇచ్చి బాలంరాయిలో పార్టీ కంటోన్మెంట్ వార్డు-3 కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత శోభానాగిరెడ్డికి నివాళులు అర్పించి, తదుపరి ప్రచార సరళిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇంతలోనే ఓ అధికారిణి తలుపు నెట్టుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. లోపలికి వస్తూనే దినేశ్‌రెడ్డి సెక్యూరిటీ, అనుచరులను టార్గెట్‌గా చేసుకుని.. వెంటనే తలుపులు వేసి ఎవరూ బయటికి వెళ్లొద్దంటూ గద్దించారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న దినేశ్ రెడ్డి గన్‌మెన్ వచ్చిన వారిని నక్సలైట్లుగా భావించి ఎదురుదాడికి సమాయత్తం అయినప్పటికీ దినేశ్‌రెడ్డి సూచనతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో తాను కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి లక్ష్మిని అంటూ ఆమె దినేశ్‌రెడ్డికి పరిచయం చేసుకున్నారు. ఇక్కడ డబ్బులు పంచుతున్నట్లు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు తనిఖీలు చేసేందుకు వచ్చామని చెబుతూ.. ఇల్లంతా సోదా చేశారు. వస్తువులన్నీ చిందరవందర చేశారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ సందర్భంగా అనవసరంగా తమ సమయాన్ని వృథా చేయడంతో పాటు, తన భద్రతకు విఘాతం కలిగే రీతిలో ప్రవర్తించడం సబబు కాదని దినేశ్‌రెడ్డి ఆమెను సుతిమెత్తగా హెచ్చరించారు. ముందుగా విషయం చెబితే తనిఖీలకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రత్యర్థి పార్టీల వాళ్లు చెప్పగానే అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు. ఈ విషయమై దినేశ్‌రెడ్డి ఆర్వో సుజాత గుప్తాకు ఫోన్ చేసి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బంది అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు రసూల్‌పురా ః ఎన్నికల సిబ్బంది అనుచిత ప్రవర్తనపై వైఎస్సార్సీపీ కంటోన్మెంట్ 3వ వార్డు కన్వీనర్ కె. చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలంరాయిలో విలేకర్లతో మాట్లాడుతూ.. దినేష్ రెడ్డి రోడ్‌షోలో భాగంగా బాలంరాయిలో తమ ఇంటికి భోజనానికి రాగా.. తప్పుడు సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి లక్ష్మి నేతృత్వం లో సిబ్బంది హంగామా సృష్టించారన్నారు. ఇంట్లోకి వచ్చి బీరువాలోని వస్తువులు, బట్టలు కింద చిందరవంద రగా పడేసి, తమ ఆడవారిపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వారిపై బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విచారణకు ఆదేశించిన చంపాలాల్ వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కంటోన్మెంట్ ఏరియా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మిపై విచారణకు ఆదేశించామని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంపాలాల్ తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకర ్గం పరిధిలో ఉన్నందున, విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుజాత గుప్తను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికను పరిశీంచిన అనంతరం తగిన చర్యలు చేపడతామన్నారు. -
మాతోనే సుస్థిర పాలన
మహానేత పథకాలే మా విజయానికి నాంది రోడ్‌షోలో దినేశ్‌రెడ్డి వెల్లడి ఎల్బీనగర్/హస్తినాపురం/వనస్థలిపురం,న్యూస్‌లైన్: రెండురాష్ట్రాల్లో సుస్థిరపాలన కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టాలని ఆపార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మహానేత అమలుచేసిన సంక్షేమ పథకాల కొనసాగింపు ఒక్క జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డితో కలిసి హస్తినాపురం నుంచి వనస్థలిపురం రైతుబజార్ వరకు రోడ్‌షో నిర్వహించారు. బీఎన్‌రెడ్డి చౌరస్తా, వైదేహినగర్, ఎన్జీవోస్కాలనీ, గణేష్టెంపుల్, రైతుబజార్ వరకు వేలాది ద్విచక్ర వాహనాలతో భారీర్యాలీ నిర్వహించగా..ప్రధానకూడళ్ల వద్ద వందలాది మంది కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు నీరాజనం పలికారు. ఈసందర్భంగా దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ నుంచి తనను గెలిపిస్తే ప్రత్యేక గుర్తింపుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తానని హామీఇచ్చారు. పుత్తా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ వల్ల పదవులు, డబ్బులు సంపాదించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కనీసం ఆయన విగ్రహం పెట్టలేని కృతజ్ఞుడని విమర్శించారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధి పేరుతో నిధులు మింగేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లపు రాము, బీరం శ్రీధర్, వెంకటకృష్ణ, రాఘవనాయుడు, పి.రాజశేఖర్‌రెడ్డి, సూరజ్యజ్ధాని, రమణ తదితరులు పాల్గొన్నారు. అంజన్ ఏనాడైనా గళమెత్తారా..? : సయ్యద్ సాజిద్‌అలీ సనత్‌నగర్,బంజారాహిల్స్ : రెండుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా అంజన్‌కుమార్‌ను గెలిపిస్తే ఏనాడైనా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారా..అని వైఎస్సార్సీపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్ అలీ ప్రశ్నించారు. బీహార్, ఒడిషాలకు చెందిన ఎంపీలు కూడా తమ ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తే..అంజన్ మాత్రం ఒక్కసారి కూడా సమస్యను ప్రశ్నించిన దాఖలాల్లేవన్నారు. శనివారం అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంతోపాటు ఖైరతాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సాజిద్‌అలీ వేర్వేరుగా మాట్లాడారు. సంక్షేమ పథకాలతో ఇంటింటా సౌభాగ్యాన్ని అందించిన మహానేత అడుగుజాడల్లో పనిచేస్తున్న తమను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రధానపోటీ బీజేపీయేనని, ముస్లింలు, క్రిస్టియన్లు తమకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సనత్‌నగర్ అభ్యర్థి వెల్లాల రామ్మోహన్, రాజేందర్‌కుమార్, కమల్‌రాజ్, జెస్సీ, మహేశ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
దినేశ్.. ప్రచారం జోష్
విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ పోలీస్ బాస్ అన్నివర్గాలను కలుపుకపోతున్న లోక్‌సభ అభ్యర్థి ర్యాలీలు,పార్టీలో చేరికలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం నాచారం,మౌలాలి,న్యూస్‌లైన్: మొన్నటివరకు డీజీపీగా పనిచేసి..ప్రస్తుతం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న దినేశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకుసాగుతున్నారు. ఇందులోభాగంగా గురువారం నాచారంలో జరిగిన భారీర్యాలీలో దినేశ్‌రెడ్డి పాల్గొనగా.. నాచారానికి చెందిన వీఎస్ ప్రకాష్‌రెడ్డి పార్టీలో చేరారు. నాచారం సావర్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేర్వేరు కార్యక్రమాల్లో దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ..దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవైశపెట్టిన సంక్షేమపథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఉప్పల్ చిలుకానగర్‌లో అనసూయారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ముస్లింలకు అండగా ఉంటాం..: ముస్లింలకు తమ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. మౌలాలిలో జరిగిన ప్రచారంలో తొలుత మౌలాలి హజ్రత్‌అలి గుట్టకు చేరుకుని చిల్లావద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బస్తీలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. అనంతరం ఆయన స్థానిక ముస్లిం నేతలను కలిసి మద్దతివ్వాలని కోరారు.