
మాతోనే సుస్థిర పాలన
రెండురాష్ట్రాల్లో సుస్థిరపాలన కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టాలని ఆపార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
- మహానేత పథకాలే మా విజయానికి నాంది
- రోడ్‌షోలో దినేశ్‌రెడ్డి వెల్లడి
ఎల్‌బీనగర్/హస్తినాపురం/వనస్థలిపురం,న్యూస్‌లైన్: రెండురాష్ట్రాల్లో సుస్థిరపాలన కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టాలని ఆపార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మహానేత అమలుచేసిన సంక్షేమ పథకాల కొనసాగింపు ఒక్క జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పార్టీ ఎల్‌బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డితో కలిసి హస్తినాపురం నుంచి వనస్థలిపురం రైతుబజార్ వరకు రోడ్‌షో నిర్వహించారు.
బీఎన్‌రెడ్డి చౌరస్తా, వైదేహినగర్, ఎన్జీవోస్‌కాలనీ, గణేష్‌టెంపుల్, రైతుబజార్ వరకు వేలాది ద్విచక్ర వాహనాలతో భారీర్యాలీ నిర్వహించగా..ప్రధానకూడళ్ల వద్ద వందలాది మంది కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు నీరాజనం పలికారు. ఈసందర్భంగా దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ నుంచి తనను గెలిపిస్తే ప్రత్యేక గుర్తింపుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తానని హామీఇచ్చారు.
పుత్తా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ వల్ల పదవులు, డబ్బులు సంపాదించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కనీసం ఆయన విగ్రహం పెట్టలేని కృతజ్ఞుడని విమర్శించారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధి పేరుతో నిధులు మింగేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లపు రాము, బీరం శ్రీధర్, వెంకటకృష్ణ, రాఘవనాయుడు, పి.రాజశేఖర్‌రెడ్డి, సూరజ్‌యజ్ధాని, రమణ తదితరులు పాల్గొన్నారు.
అంజన్ ఏనాడైనా గళమెత్తారా..? : సయ్యద్ సాజిద్‌అలీ
సనత్‌నగర్,బంజారాహిల్స్ : రెండుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా అంజన్‌కుమార్‌ను గెలిపిస్తే ఏనాడైనా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారా..అని వైఎస్సార్‌సీపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి సయ్యద్ సాజిద్ అలీ ప్రశ్నించారు. బీహార్, ఒడిషాలకు చెందిన ఎంపీలు కూడా తమ ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తే..అంజన్ మాత్రం ఒక్కసారి కూడా సమస్యను ప్రశ్నించిన దాఖలాల్లేవన్నారు. శనివారం అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంతోపాటు ఖైరతాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సాజిద్‌అలీ వేర్వేరుగా మాట్లాడారు.
సంక్షేమ పథకాలతో ఇంటింటా సౌభాగ్యాన్ని అందించిన మహానేత అడుగుజాడల్లో పనిచేస్తున్న తమను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రధానపోటీ బీజేపీయేనని, ముస్లింలు, క్రిస్టియన్లు తమకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సనత్‌నగర్ అభ్యర్థి వెల్లాల రామ్మోహన్, రాజేందర్‌కుమార్, కమల్‌రాజ్, జెస్సీ, మహేశ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.