breaking news
Dindi Lift Irrigation
-
‘నార్లాపూర్’ అంచనాలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ సవరణ అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్యాకేజీ–2 కింద రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించగా గతంలో రూ. 1,448 కోట్లకు అంచనాలు పెంచారు. తాజాగా రూ. 1,784 కోట్లకు అంచనాలను సవరించాలనే ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించినట్లు తెలియవచ్చింది. రాఘవ కన్స్ట్రక్షన్స్–కేఎన్ఆర్ జాయింట్ వెంచర్ ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. ఏదుల–డిండి అలైన్మెంట్ పనులకు పచ్చజెండాపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించడానికి రూ. 1,788.89 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన అలైన్మెంట్ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీ.ల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపట్టనున్నారు. పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ వద్ద రబ్బర్ డ్యామ్‌ను సైతం నిర్మించనున్నారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటి తరలింపు ప్యాకేజీ–3 అంచనా వ్యయాన్ని రూ. 416 కోట్ల నుంచి రూ. 780 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది. సరైన రీతిలో ప్రతిపాదనలను తమ ముందుంచాలని ఉంచాలని సూచించినట్లు సమాచారం. ‘పీఆర్’లో 588 కారుణ్య నియామకాలకు ఓకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్యనియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలపై ఆర్థిక శాఖ, సీఎంను ఒప్పించి కారుణ్య నియామకాలకు మంత్రి సీతక్క అడ్డంకులు లేకుండా చేశారు. ఈ సందర్భంగా కారుణ్య నియామకాల్లో చేరబోతున్న అభ్యర్థులు మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. 201 కొత్త గ్రామ పంచాయితీలు, 11 కొత్త మండలాలు, మరో 11 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్ పేరు!
జలసౌధలో కాంస్య విగ్రహం... ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్‌రావు విశేష సేవలందించారు. ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్‌రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం.