భారీ బందోబస్తు
♦ గోదావరి పుష్కరాలపై పటిష్ట నిఘా
♦ భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
♦ 2550 మంది పోలీసు సిబ్బంది నియమాకం
♦ స్నాన ఘట్టాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
♦ రేంజ్ ఇన్చార్జీ డీఐజీ గంగాధర్ వెల్లడి
నిజామాబాద్ క్రైం : ఈ నెల 14 నుంచి 24 వరకు జరిగే గోదావరి ఫుష్కరాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీఐజీ వై గంగాధర్ వెల్లడించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పుష్కారాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. పుష్కరఘాట్లకు వెళ్లే మార్గాలలో బందోబస్తు, ట్రాఫిక్, సెక్యూరిటీ, సీసీ కెమెరాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రాంతాలలో భక్తులు పవిత్ర స్నానాలు చేసే 18 ఘాట్ల వద్ద 2,550 మంది సిబ్బందిని నియమించామన్నారు. కందకుర్తి, శ్రీరాంసాగర్ వద్ద 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎలాంటి నేరాలు జరుగకుండా పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం పోలీస్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. గత పు ష్కరాల సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి భక్తులకు అసౌకర్యం కలుగకుండా, ట్రాఫీక్ జామ్ కాకుండా వన్‌వేలను గుర్తించామన్నారు.
కరపత్రాల విడుదల
వివిధ జిల్లాల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం తగిన వివరాలతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను, బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఏ విధంగా విధులు నిర్వహించాలో తెలిపే పుస్తకాన్ని డీఐజీ, ఎస్పీ విడుదల చేశారు. కరపత్రాలను ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద భక్తులకు పంపీణీ చేస్తామన్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. వారికి ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా పోలీస్‌శాఖ అన్ని చర్యలు చే పట్టిందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గ్రామస్తులు సహకరించాలని కోరారు.
స్వచ్ఛ భారత్ గుర్తుంచుకొండి
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల న్నారు. లక్షలాది మంది వస్తారని, ఘాట్ల వద్ద పూజ అ నంతరం పూజ సామాగ్రీ, తమ వెంట తెచ్చుకున్న పదార్ధాలు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ వేయకూదన్నారు. దీనితో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. నదిలో చెత్త చెదారం పారవేయరాదని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ ఆఫీసర్లుగా యువకులు
పుష్కర మార్గాలలో ఆయా గ్రామాలకు చెందిన యువకులను పోలీస్ ఆఫీసర్లుగా నియమించామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దాదాపు 300 మంది యువకులకు రూట్ బందోబస్తు విధులు అప్పగించామన్నారు.
సిబ్బంది వివరాలు
డీఎస్పీలు 9 మంది, సీఐలు 29, ఎస్ఐలు 149, ఏఎస్ఐ 75, హెడ్ కానిస్టేబుళ్లు 280, కానిస్టేబుళ్లు 1,185, మహిళా కానిస్టేబుళ్లు 100, హోంగార్డులు 400, స్పెషల్ పార్టీ పోలీసులు 300 మందిని నియమించామని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, డీఎస్పీలు ఆనంద్‌కుమార్, రాంకుమార్, భాస్కర్, ఆకుల రాంరెడ్డి, భైంసా డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
మార్గాలు ఇలా
హైదరాబాద్ వైపు నుంచి కందకుర్తి, బాసరకు వెళ్లేవారు నిజామాబాద్ బైపాస్ మార్గంలో అర్సపల్లి మీదుగా జాన్కంపేట్‌కు చేరుకుని అక్కడి నుంచి కందకుర్తికి వెళ్లే వారు వయా నవీపేట్, దూపల్లి గ్రామాల మీదుగా నీలకు చేరుకుని నీలాలో వాహనాలు పార్కింగ్ చేయవలసి ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో సాటాపూర్, పగడపల్లి గ్రామాల మీదుగా బోధన్‌కు, అక్కడి నుంచి అమ్దాపూర్, మోస్రా గ్రామం నుంచి నిజామాబాద్‌కు చేరుకుని హైదరాబా ద్‌కు వెళ్లవలసి ఉంటుంది.
బాసరకు వెళ్లేవారు జాన్కంపేట్ నుంచి నవీపేట్ ఫకీరాబాద్, యంచ మీదుగా వెళ్లాలి. తిరుగు ప్రయాణంలో బాసర నుంచి ముధోల్, భైంసా, నిర్మల్‌కు చేరుకుని అ క్కడి నుంచి జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు వెళ్లవలసి ఉంటుంది.
కందకుర్తి, బాసరలో పుణ్యస్నానాలు ఆచరించేవారు మొదట కందకుర్తికి వెళ్లి అక్కడి నుంచి తాడ్‌బిలోలి, కోస్లీ, ఫకీరాబాద్ మీదుగా బాసరకు చేరుకోవాలి.
ధర్మాబాద్ వద్ద ఉన్న వంతెనను మూసివేసినందున బాసర నుంచి వయా ధర్మాబాద్ మీదుగా బోధన్‌కు చేరుకునేవారు ఆ మార్గంలో వెళ్లకూడదు.
రాంసాగర్‌కు వచ్చేవారు డిచ్పల్లికి చేరుకుని అక్కడి నుంచి ఆర్మూర్ బైపాస్ మీదుగా శ్రీరాంసాగర్‌కు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో అదేమార్గంలో హైదరాబాద్‌కు వెళ్లాలి.