డయల్ 100 సర్వీసుపై న్యాయమూర్తి ఫిర్యాదు
న్యూఢిల్లీ: అత్యవసర ఫోన్ నెంబర్ డయల్ 100 కి ఫోన్ చేయగా ఎంతసేపటికీ రెస్పాన్స్ రాక పోవడంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సింఘీ బిత్తరపోయారు. తన ఫోన్ కాల్ ను సమాధానం చెప్పకుండా హొల్డ్ లో ఉంచారని దీనిపై ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి లేఖ రాశారు. దీనిని పిల్ గా స్వీకరించిన కోర్టు సుమోటాగా విచారించనుంది. ఈ లేఖలో ఆయన రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ వర్మని ప్రతివాదిగా చేర్చారు.
ఏప్రిల్ నెల 29న ఒక ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా వసంత్ కుంజ్ చౌరస్తాలో రాత్రి 10 గంటల ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయింది. న్యాయమూర్తి దాదాపు 40 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అందుబాటులో ట్రాఫిక్ పోలీసు కూడా లేకపోవడంతో ఆయన డయల్ 100కి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ను వారు హొల్డ్ లో ఉంచి ఎంతసేపయినా సమాధానం చెప్పలేదని ఆయన వాపోయారు.