breaking news
depend
-
అప్పు చేసి ‘ఈఎంఐ’ కూడు!
ఐఫోన్ 17ను మొదటి రోజే సొంతం చేసుకునేందుకు యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరిన యువత.. కొన్ని చోట్ల తోపులాట. ప్రీమియం ఫోన్‌ను తొలిరోజే ‘ఎక్స్‌పీరియెన్స్’ చేయాలన్న ఆరాటం. రూ.1–2 లక్షల ఖరీదైన ఫోన్‌ను 6 సమాన వాయిదాల్లో (నో కాస్ట్ ఈఎంఐ) చెల్లించొచ్చంటూ యాపిల్ ప్రకటిస్తే.. కొన్ని రిటైల్ సంస్థలు 24 నెలల నో కాస్ట్ ఈఎంఐతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ల వల విసిరాయి. దీంతో స్పందన అదిరిపోయింది. ధర ఎంతైనా సరే గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు, ప్రీమియం వాహనాలను ఈఎంఐపై సొంతం చేసుకునేందుకు నేటి తరం చూపిస్తున్న ఆసక్తికి ఇదొక నిదర్శనం. రుణంపై కొనుగోలు చేసే ఈ సంస్కృతికి అలవాటు పడిపోతే.. ఆరి్థక పరిస్థితులు తీవ్రంగా దిగజారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతన జీవులు తమ నెలవారీ ఆదాయంలో 33 శాతాన్ని రుణ ఈఎంఐల కోసం వెచి్చస్తున్నారు. టెక్నాలజీపై అవగాహన కలిగిన వారు తమ సంపాదనలో 29 శాతం విచక్షణారహిత (అవసరం కానివి) కొనుగోళ్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఆరంభ శ్రేణి ఉద్యోగుల వేతనంలో 34 శాతం నెలవారీ ఈఎంఐలకు వెళుతుంటే, అధిక ఆర్జనా పరులకు ఈ మొత్తం 46 శాతం ఉన్నట్టు ‘పెర్ఫియోస్’ అనే సాస్ ఫిన్‌టెక్ కంపెనీ, పీడబ్ల్యూసీ ఇండియాతో కలిసి చేసిన విస్తృత అధ్యయనంలో తెలిసింది. మన దేశంలో ఐఫోన్ యూజర్లలో 70 శాతం మంది ఈఎంఐపైనే కొంటున్నారు. మరొక అధ్యయనం ప్రకారం.. నెలవారీ రూ.50,000లోపు సంపాదించే వారిలో 93 శాతం మంది రోజువారీ అవసరాలను క్రెడిట్ కార్డులతో నెట్టుకొస్తున్నారు. ఏ అవసరానికైనా ఈఎంఐ మార్గంలో వెళుతుండడం నిజంగా ప్రమాదకరం. ఏటా దసరా, దీపావళి పండుగల సమయంలో ఈ–కామర్స్ సంస్థలే కాకుండా ఆఫ్లైన్లోనూ భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఊదరగొడుతుంటాయి. ఈ తరుణంలో ఈఎంఐపై చేసే కొనుగోళ్ల విషయంలో విచక్షణ తప్పనిసరి. సంపద వినాశకారి.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐపై కొనుగోలు చేయడాన్ని మంచి ఆఫర్‌గా చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఈఎంఐపై కొంటున్నామంటే.. భవిష్యత్ ఆదాయాన్ని ఇప్పుడు తనఖా పెడుతున్నట్టుగా భావించాలి. కొన్న తర్వాత నుంచి నిర్ణీత కాలం వరకు క్రమం తప్పకుండా ప్రతి నెలా బకాయి చెల్లింపులకు హామీ ఇచి్చనట్టు. ఇలాంటి ఈఎంఐలు ఒకటికి మించితే.. నెలసరి ఆదాయంలో ఇవన్నీ కలసి 40–50 శాతం చేరితే. అప్పుడు నెలకు రూ.లక్ష సంపాదించినా నికర మిగులు రూ.50 వేలు మించదు. నేటి జీవనశైలి ఖర్చుల మధ్య ఇక పొదుపు, మదుపునకు మిగులు ఎక్కడ? భవిష్యత్తు అవసరాలైన పిల్లల ఉన్నత విద్య, వివాహం, రిటైర్మెంట్, సొంతిల్లు వంటి లక్ష్యాలు ఏం కావాలి? వాటి కోసం కావాల్సిన నిధులను ఎలా సమకూర్చుకుంటారు? జీవితాంతం రుణగ్రస్థులై బతకడమేనా..? తమ చుట్టూ ఉన్నవారి మధ్య గొప్ప తనం కోసం అప్పు చేసి పప్పు కూడు అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. రుణ భారం పెరిగిపోతే అప్పుడు మానసిక ఒత్తిడి అధికమవుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇదొక చైన్‌గా మారి అందులోంచి బయటకు వచ్చే మార్గం కనిపించదు. అప్పుల భారం పెరిగిపోవడంతో చేస్తున్న పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ఫలితంగా ఉత్పాదకత నష్టానికి, కెరీర్ పురోగతికి అడ్డుగా మారుతుంది. చార్జీల భారం.. వడ్డీ లేకుండా సులభ చెల్లింపుల్లో అయినా సరే అసలు చార్జీలే ఉండవని కాదు. ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకున్నందుకు క్రెడిట్ కార్డు కంపెనీ ప్రాసెసింగ్ చార్జీ విధిస్తుంది. ఈ మొత్తం రూ.200–500 వరకు ఉంటుంది. దీనిపై 18 శాతం జీఎస్టీ కూడా పడుతుంది. ఇక ప్రతి నెలా ఈఎంఐలో వడ్డీ భాగం కూడా ఉంటుంది. ఈ వడ్డీ భాగంపైనా 18 శాతం జీఎస్టీ పడుతుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కింద కేవలం వడ్డీ వరకే డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వడ్డీని ఉత్పత్తిని విక్రయించిన సంస్థ లేదా కంపెనీ లేదా ఇద్దరూ పంచుకుంటారు. ఆ వడ్డీపై జీఎస్టీ చెల్లించాల్సిన భారం వినియోగదారుడిపైనే పడుతుంది. ఇలా ఒకే సమయంలో ఒకటికి మించిన రుణాలు యాక్టివ్‌గా ఉండడం క్రెడిట్ స్కోరు పరంగా అనుకూలం కాదు. రుణాలు ఆదాయ పరిమితుల్లోనే ఉండాలి. ఒకటి రెండు ఈఎంఐలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చెల్లించలేకపోతే.. ఐఫోన్ కోసం ఒకేసారి రూ.80,000 –1,00,000 చెల్లించక్కర్లేకుండా నెలకు రూ.6,000 చెల్లించడం ఎంతో మందికి సులభంగా అనిపించొచ్చు. కానీ, చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే? క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ నెలకు రూ.3 పైమాటే. ఏటా 45 శాతం వరకు వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. రూ.50,000 బకాయిని తీర్చకుండా అలాగే కొనసాగిస్తే రెండేళ్లలో అది రూ.లక్షగా మారుతుంది. ప్రతి నలుగురు రుణ గ్రహీతల్లో ఒకరు తిరిగి చెల్లించలేకపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు రుణ ఈఎంఐ అన్నది ఇంటి కొనుగోలుకే పరిమితం. తర్వాత వాహన కొనుగోళ్లకు విస్తరించింది. ఇప్పుడు ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వ్రస్తాలు, విహార యాత్రల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఖరీదైన కొనుగోలుకు క్రెడిట్ కార్డు ఈఎంఐ అలవాటుగా మారిపోయింది. చివరికి పెళ్లి వేడుక ఘనంగా చేసుకునేందుకు కూడా రుణం తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు డిజిటల్‌గా ఇన్స్టంట్ రుణాలను ఇస్తుండటం ఈ ధోరణిని పెంచుతోంది. ఒకటికి మించి కార్డులు తీసుకుని, రుణంపై నెట్టుకొస్తున్న మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. రుణాలు ఆదాయంలో సగానికి చేరాక.. ఉన్నట్టుండి ఉద్యోగానికి/ఉపాధికి దూరమైతే అప్పుడు తీర్చేదెలా? ‘సంపాదిస్తున్న దానికి మించి ఖర్చు చేస్తుంటే నువ్వు ఎప్పటికీ సంపన్నుడివి కాలేవు’ అన్న వారెన్ బఫెట్ సూక్తిని ఇక్కడ చెవికెక్కించుకోవాలి. ఒకప్పుడు అవసరమైన కొనుగోళ్లకే పరిమితమ య్యే వారు. ఇప్పుడంతా డిజిటల్ కావడంతో.. అవసరం లేనివీ కొనుగోలు చేస్తున్న ధోరణి నెలకొంది.ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు.‘ముందు పొదుపు చేసి, మిగిలినదే ఖర్చు చేయి’ అన్న ఆరి్థక నిపుణుల సూచనను ఆదర్శంగా తీసుకోవాలి. ఆదాయం ఎంతున్నా ఖర్చులపై నియంత్రణ లేకపోతే మిగులు ఏమీ ఉండదు. అందుకే వస్తున్న ఆదాయం నుంచే పొదుపు, పెట్టుబడులకు నిపుణుల సూచన మేరకు కేటాయింపులు చేయాలి. ప్రతి నెల ఆదాయం చేతికి అందిన వెంటనే ఆ మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అప్పుడు మిగులు నిధుల నుంచి ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటే వ్యయాలపై నియంత్రణ ఏర్పడుతుంది. అత్యవసరాలు తప్పించి జీవన అవసరాల కోసం ఉద్దేశించిన ఏ వస్తువు అయినా సరే ఈఎంఐ కొనుగోలు చేయడం మానుకోవాలి. కొనుగోలు ఏది అయినా, పెట్టుబడులు పోను మిగులు నిధుల నుంచే ఉండాలి. ఈ ఒక్క నియమానికి కట్టుబడితే చాలు.. ఆర్థిక పరిస్థితులు వాటంతట అవే మెరుగుపడతాయి. భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టడం అస్సలు సూచనీయం కాదు. అవసరాల కోసమే.. క్రెడిట్ కార్డు అన్నది సౌకర్యం, కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం. క్రమశిక్షణతో వినియోగిస్తే కార్డుపై ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. చేసిన ఖర్చులను ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 45 రోజుల వరకు వ్యవధి ఉంటుంది. 1–5 శాతం మేర రివార్డులు లభిస్తాయి. కార్డుపై చేసే వ్యయాలు తదుపరి నెల ఆదాయం నుంచి చెల్లించే స్థాయిలోనే ఉండాలి. దీనివల్ల క్రెడిట్ స్కోరు బలపడుతుంది. అత్యవసర నిధి లేనప్పుడు.. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఒకరి వద్ద చేయి చాచకుండా, అప్పటికప్పుడు చెల్లింపులకు క్రెడిట్ కార్డు ఆధారంగా నిలుస్తుంది. బిల్లు చెల్లించేందుకు గడువు ఉంటుంది కనుక, ఆలోపు వ్యక్తిగత రుణం లేదంటే బంగారంపై రుణం తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించేయొచ్చు. క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్ ఆఫర్లను వినియోగించుకుంటే అదనపు ప్రయోజనం పొందొచ్చు. కాంపౌండింగ్ ప్రయోజనం కోల్పోయినట్టే.. నెలకు రూ.5,000 చొప్పున మంచి పనితీరు చూపించే ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి, 30 ఏళ్లపాటు కొనసాగించారని అనుకుందాం. 12 శాతం వార్షిక రాబడి ఆధారంగా రూ.1.54 కోట్లు సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.18 లక్షలే. రూ.1.36 కోట్లు రాబడి. 30 ఏళ్లకు బదులు 20 ఏళ్లే ఇలా ఇన్వెస్ట్ చేశారనుకుంటే అప్పుడు సమకూరే మొత్తం అసలు, వడ్డీ కలిపి రూ.46 లక్షలే. 20 ఏళ్లలో రూ.46 లక్షలు సమకూరితే, అక్కడి నుంచి పదేళ్లలో రూ.కోటికి పైగా అదనంగా సమకూరింది. ఇది కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ) కారణంగా ఏర్పడిందే. అందుకే సంపాదన మొదలైన నాటి నుంచే భవిష్యత్తు లక్ష్యాల కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. దీనికి బదులు తొలి నాళ్లలో ఖరీదైన కొనుగోళ్లకు, విలాసాలకు ఈఎంఐపై ఖర్చు చేస్తూ.. పొదుపు పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ వెళితే సంపద సృష్టి కలగానే మిగిలిపోతుంది. ఆరి్థక స్వేచ్ఛకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిందే.. → పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. ఇతరుల ప్రభావంతో గొప్పకుపోయి అ వసరం లేని ఖరీదైన కొనుగోళ్లు చే యడంలో ప్రయోజనం ఉండదు. → ఖరీదైన వస్తువు ఈఎంఐ కారణంగా చౌకగా మారుతోంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమో ఒకసారి ఆలోచించాలి. → అన్ని రుణాల్లోకి గృహ రుణం ఒక్కటే ప్రయోజనం. తక్కువ వడ్డీ రేటుతో, రుణం తీర్చే సమయానికి దాని విలువ ఎంతో కొంత పెరుగుతుంది. వినియోగ వస్తువులను ఈఎంఐపై కొంటే రుణం తీరే నాటికి వాటి విలువ సున్నా కావొచ్చు. మళ్లీ వాటి కొనుగోలుకు రుణాన్ని ఆశ్రయిస్తే రుణ ఊబిలోకి వెళుతున్నట్టే. → నిపుణుల సూచన ప్రకారం ఒకరి ఆదాయంలో ఈఎంఐలు 40 శాతం మించకూడదు. మించితే ఆరి్థక పరిస్థితులు అదుపు తప్పినట్టు అవుతుంది. ఈ 40 శాతం ఈఎంఐలు అన్నవి వినియోగ రుణాల కోసం ఉద్దేశించిన సూత్రం కాదు. ముఖ్యమైన రుణాల కోసం ఉద్దేశించినది. అంటే గృహ, విద్యా రుణాలకే పరిమితం కావాలి. తప్పనిసరి అయితే ఏకకాలంలో ఒక వ్యక్తిగత రుణానికి పరిమితం కావాలి. లేదంటే జీవిత కాలం పాటు రుణానికి చెల్లింపులు చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో రిటైర్మెంట్ తర్వాతి అవసరాలకు కావాల్సిన ఫండ్ ఏర్పడదు. → రుణ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీనివల్ల భవిష్యత్తు రుణాలు మరింత ఖరీదుగా (అధిక వడ్డీ రేటుపై) మారతాయి. → క్రెడిట్ కార్డులను కేవలం రివార్డుల కోసమే ఉపయోగించుకోవాలి. ఒకటి, రెండు మించి కార్డులు ఉండడం అనుకూలం కాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
400 మంది కూలీలు ఏమయ్యారో?
గుమ్మఘట్ట: ఉపాధి కోసం విశాఖపట్టణంకు వలస వెళ్లిన గుమ్మఘట్ట మండలంలోని గోనబావి, పూలకుంట గ్రామాలకు చెందిన వందలాది మంది వలస కూలీల ఆచూకీ తెలియక ఇక్కడి వారి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని నెల క్రితమే సుమారు నాలుగు వందల మందికి పైగా కూలీలు విశాఖపట్టణంలో కెబుల్ వైర్ ట్రెంచింగ్ పనుల కోసం తరలివెళ్లారు. ఇటీవల తుఫాను వారిజీవితాల్లో కలకలం లేపడంతో కలసి పనిచేస్తున్న వారంతా తలదాచుకునేందుకు తలోదిక్కుకువెళ్లిపోయారు. పిల్లపాపలు సైతం విడిపోయి ఎవరెక్కడున్నారో తెలియక, ఏ క్షణం ఎలాంటి విషాదం వినాల్సివస్తోందోనని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మేస్త్రీలకు ఫోన్ చేస్తుంటే సరైన సమాధానం రావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. రవాణ, సమాచార వ్యవస్థ దెబ్బ తినడంతో ఐదు రోజులుగా తమ వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదని దిగాలు పడుతున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్, గాజువాక, ఆటోనగర్, కైలాసగిరి కొండ తదితర ప్రాంతాల్లో ట్రెంచింగ్ పనులు చేస్తున్నట్లు అక్కడ కూలీలు గత వారం క్రితమే తెలిపారని గ్రామస్తులు గంగమ్మ, గోవిందమ్మ వివరించారు. అక్కడ పని చేస్తున్న మేస్త్రీ మానేకొట వెంకటశులకు చెందిన ఫోన్ బుధవారం లైన్ కలవడంతో కొంత సమాచారం చేరవేశారు. గుడారాలే కాక తిండి వస్తువులు, బట్టలు, వెంట తీసుకెళ్లిన పనిముట్లు కూడా తుఫాను బీభత్సానికి కొట్టుకుపోయాయని వివరించారు. నాలుగైదు రోజులుగా నిద్రాహారాలు మాని అష్టకష్టాల్లో ఉన్నట్లు మేస్త్రీ చెప్పినట్లు బాధితుల బంధువులు వివరించారు. గోనబావి, పూలకుంట గ్రామాల్లో పెద్ద మొత్తంలో విశాఖకు వలసెళ్లడంతో ఎటుచూసిన ఇళ్లకు తాళాలు, నిర్మానుష్య వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తక్షణం స్పందించి తుఫానులో చిక్కుకున్న తమ బంధువులను గ్రామాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలా ఉన్నారో.. - గంగమ్మ, గోనబావి గ్రామస్థురాలు తుఫానులో చిక్కుకుని నిరాశ్రయులైన తమ నలుగురు కుమారులు, కోడళ్లు, పిల్లలు ఎలా ఉన్నారో ఐదు రోజులుగా ఆచూకి తెలియడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన మా పిల్లలు అక్కడ ఉప వాసం ఉంటుంటే ఇక్కడ మాకు ముద్ద దిగడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మా ఊరోళ్లందరినీ క్షేమంగా ఇంటికి చేర్చాలి. ప్రభుత్వమే రవాణ సదుపాయం కల్పించాలి- గోవిందమ్మ, గోనబావి గ్రామస్థురాలు తుఫానులో చిక్కుకున్న మా వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇక్కడకు తీసుకురావాలి. తిండితిప్పలు లేక అక్కడ అల్లాడుతున్నట్లు మాకు తెలిసింది. కొంత మంది పిల్లలు తప్పిపోయినారంట. వాళ్లక్కడ ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఫోన్లు కలవడం లేదు. మాకు భయం వేస్తోంది. అధికారులు వెంటనే స్పందించి వాళ్లను ఇక్కడకు తీసుకురావాలి.