breaking news
cotton business
-
పత్తిపై కామన్ ఫండ్..!
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ (ఏ), ఆదిలాబాద్(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, బోథ్, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, కడెం, కొండపల్లి, కుభీర్, లక్షెట్టిపేట్, నేరడిగొండ, నిర్మల్, పొచ్చర, సారంగాపూర్, సొనాల, వాంకిడి, ఇందారం ప్రాంతాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ ఈ ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకొని అక్కడ బయ్యర్లు అంటే సంస్థకు చెందిన అధికారులు పత్తి కొనుగోలు అధికారి (సీపీఓ) లను నియమించి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటీవలే జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో సీసీఐ అధికారులు దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుని త్వరలో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దూది శాతం.. లోగుట్టు ప్రతియేడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తిని నిల్వ చేసి జిన్నింగ్ ద్వారా దాని నుంచి దూది, గింజలను వేరు చేసి ప్రెస్సింగ్ ద్వారా దూదిని బేళ్లుగా తయారు చేసేందుకు సీసీఐ జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటుంది. ఇందుకోసం ఈయేడాది ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకొని ఒక బేల్ తయారీకి రూ.1195 చెల్లించే విధంగా టెండర్ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ జిన్నింగ్ వ్యాపారికి బేల్ తయారీ ద్వారా వచ్చే లాభం అదే. సీసీఐ లక్షల బేళ్లను తయారు చేయిస్తుంది. ఇక్కడివరకు అంతా ఓకే.. ఇక టెండర్ నిబంధనలో కిటుకులు సీసీఐ అక్రమ సంపాదనకు మార్గంగా మలుచుకున్నాయి. అద్దెకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసేది సంస్థ అధికారులే. ఆ తర్వాత పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడంలో మిల్లుదే భాగస్వామ్యం. ఇక్కడే అవినీతికి తెర లేస్తుంది. అది ఏవిధంగా అంటే.. ఒక క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు తీయాలని సీసీఐలో నిబంధన ఉంది. అయితే ఇటీవల దూది ఔట్టన్ (ఓటీ)ని అక్టోబర్‌లో 31 శాతంగా నిర్ధారించారు. నవంబర్‌లో 31.10, డిసెంబర్లో 31.60, జనవరిలో 32.40, ఫిబ్రవరిలో 33.00, మార్చిలో 33.40 శాతం సీసీఐ వ్యాపారులకు నిర్దేషించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు పత్తి సీజన్ కొనసాగుతుంది. ఆ తర్వాత జనవరి నుంచి దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా దాదాపుగా దిగుబడి వచ్చే సీజన్లో 31 శాతంలో నిర్ధారించి సీజన్ అయిపోయే దశలో 33 శాతం వరకు పొడిగించారు. ఇక్కడే కిటుకు దాగివుంది. కామన్ ఫండ్.. కొన్ని శాఖల్లో అక్రమ సంపాదనకు ఒక్కో పేరు ఉంటుంది. సీసీఐలో ఈ సంపాదనకు ముద్దుపేరే కామన్ ఫండ్.. పత్తి నుంచి దూది తీసే శాతం 31కి తగ్గించడం ద్వారా సీసీఐ అధికారులు అక్రమాలకు తెర లేపారు. క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు వస్తుందనేది ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఇక్కడ శాతం తగ్గించడంలో స్వార్థ ప్రయోజనాలు దాగివున్నాయి. 31 శాతానికి పైబడి వచ్చే దూదిని అక్రమంగా విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటారు. ఈ వ్యవహారంలో వ్యాపారులు అధికారులకు వంత పాడుతారు. పత్తి సంస్థ ఉమ్మడి జిల్లాలో లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేస్తుంది. ఈ అక్రమ దూది విక్రయం ద్వారా వచ్చే సంపాదన వ్యవహారంలో సీసీఐలో పైనుంచి కిందిస్థాయి వరకు నిర్దేశిత వాటాలు లోగుట్టుగా జరిగిపోతాయి. దీన్ని సీసీఐ పరిభాషలో కామన్ ఫండ్‌గా పిలుస్తారనే నానుడి ఉంది. అయితే సీజన్లో ఈ అధికారులు ఉత్సాహంగా పనిచేసేందుకు కామన్ ఫండ్ దోహద పడుతుందన్న అభిప్రాయం ఉంది. దీంతోనే సంస్థ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శలు లేకపోలేదు. స్పందన కరువు.. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ వివరణ తీసుకునేందుకు సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ కార్యాలయానికి సోమవారం వెళ్లగా ఆ సమయంలో జీఎం చాంబర్లోనే ఉన్నారు. అక్కడ ఎదురుపడ్డ జీఎం పీఏ అపాయింట్మెంట్ లేనిది జీఎం గారిని కలవలేరని చెప్పారు. దీంతో అపాయింట్మెంట్ అడగగా తర్వాత ఫోన్ చేస్తే చెబుతానని పేర్కొన్నారు. దీంతో ‘సాక్షి’ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేయగా జీఎంను అడిగి చెబుతానని చెప్పిన పీఏ సాయంత్రం వరకు స్పందించలేదు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో జీఎం నంబర్‌కే నేరుగా ఫోన్ చేయగా ఆయన ఫోన్లో కూడా స్పందించలేదు. సీసీఐలో వ్యవహారాలన్నీ దాగుడుమూతలే. గతంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రాగా సీబీసీఐడీ బృందం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేయగా ఆ సమయంలోనూ సీసీఐ అధికారులు స్పందించేందుకు ముందుకు రాలేదు. ఇలా ప్రతి వ్యవహారంలోనూ గోప్యత పాటించడంలో వెనక ఇలాంటి అక్రమ వ్యవహారాలే కారణమన్న విమర్శలు లేకపోలేదు. -
అక్టోబర్ 1 నాటికే సిద్ధం చేయండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను గతేడాదిలానే కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని, అక్టోబర్ 1 నాటికి వాటిని సిద్ధంగా ఉంచాలని అధికారులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పా రు. పత్తి మద్దతు ధరను కేంద్రం రూ.5,450గా ప్రకటించిన దృష్ట్యా బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదిలానే జిల్లా కలెక్టర్లు ప్రకటిం చిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర రూ.5,450గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మడానికి ఇష్టపడతారని చెప్పారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ లీజు విషయంలో ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి మిల్లుల అభ్యర్థనను లోతుగా పరిశీలించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మార్కెటింగ్ శాఖ తరçఫున ఎంఎస్పీ ఆపరేషన్‌కు అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి పాల్గొన్నారు. -
సీబీఐ మెరుపు దాడులు
గుంటూరు : పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు గురైన బయ్యర్లు, మార్కెట్‌యార్డు సూపర్ వైజర్ల నివాసాలపై సీబీఐ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారంతో సీబీఐ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దాడులు చేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముగ్గురు బయ్యర్లు, ఇద్దరు మార్కెట్‌యార్డు సూపర్వైజర్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో బయ్యర్లు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యుల నుంచి ఆస్తుల వివరాలు, వారి కుటుంబ నేపధ్యాన్ని నమోదు చేసుకున్నారు. గుంటూరులోని రాష్ట్ర సీసీఐ కార్యాలయానికి చేరుకుని మేనేజరు జయకుమార్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయపాటి పూర్ణచంద్రరావు, డి.రాజశేఖర్‌రెడ్డి, వరణ్ఘ్రువర్రెడ్డి అనే ముగ్గురు బయ్యర్లు, గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శి రామ్మోహనరెడ్డి, పదవీ విరమణ చేసిన కార్యదర్శి హరినారాయణ నివాసాలకు వెళ్లి తనిఖీలు చేశారు. అమరావతి మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో బయ్యరు రాయపాటి పూర్ణచంద్రరావు నివాసానికి ఉదయం 9 గంటలకు రెండు కార్లలో వచ్చి సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే సమయంలో పూర్ణచంద్రరావు ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆస్తుల, అదాయ వివరాలు, కొనుగోలు చేసిన వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు. కృష్ణాజిల్లా నందిగామ, పెదనందిపాడు కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జిగా వ్వవహరించిన డి.వెంకటేశ్వరరెడ్డి నివాసాల్లో తనిఖీలు చేశారు. నందిగామ మార్కెట్ యార్డు కార్యాలయం నుంచి పత్తి కొనుగోలుకు చెందిన హార్డ్‌డిస్క్, గేట్పాస్బుక్లను తీసుకువెళ్లారు. కృష్ణాజిల్లా మైలవరం కొనుగోలు కేంద్రం ఇన్చార్జిగా వ్యవహరించిన వరణ్ రఘువర్రెడ్డి గుంటూరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఉన్నారు. గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి, పదవీ విరమణ చేసిన సెక్రటరీ హరినారాయణలకు చెందిన గుంటూరులోని నివాసాల్లో తనిఖీ చేశారు.