breaking news
Consensus resolution
-
దేశ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రక్షణ, ఇంధనం, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు సహా వేర్వేరు రంగాల్లో భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సమర్థతను ఆయన కొనియాడారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనీ, దీనిపై అమెరికా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న పాంపియో ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. మాకోసం భారత్ చాలా చేసింది పాంపియోతో భేటీ సందర్భంగా జైశంకర్ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. ‘రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది. భారత్‌కు రష్యా సహా పలుదేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అమెరికా వీటిని గౌరవించాలి’ అని సూచించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వెంటనే పాంపియో స్పందిస్తూ..‘మా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్, వెనిజులా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ వెనక్కుతగ్గింది. ఇది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇండియాకు ఇంధన కొరత రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరానే దాడిచేసింది. ఈ విషయంలో అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్–అమెరికాలు నిర్ణయించాయి’ అని పేర్కొన్నారు. వాణిజ్యంపై ఏకాభిప్రాయం అవసరం అమెరికా, భారత్‌ల మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధంపై పాంపియో మాట్లాడారు. ‘పరస్పర సుంకాలను విధించుకోవడంపై భారత్–అమెరికాలు ఓ అంగీకారానికి రాగలవు. కానీ మనం కూడా అవతలివారి కోణం నుంచి ఆలోచించినప్పుడు బంధాలు బలపడతాయి. భారత్ తన సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు, రక్షణ అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. వాణిజ్యం విషయంలో భారత్–అమెరికాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని జైశంకర్ కూడా అంగీకరించారు. వాణిజ్య భాగస్వాములు అన్నాక పరిష్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నారు. మతస్వేచ్ఛ లేకుంటే వినాశనమే.. మతస్వేచ్ఛను కాలరాస్తే ప్రపంచం దారుణంగా తయారవుతుందని మైక్ పాంపియో హెచ్చరించారు. భారత్‌లో ఇటీవలికాలంలో మైనారిటీలపై హిందుత్వ మూకల దాడులు పెరిగిపోయిన విషయాన్ని పాంపియో పరోక్షంగా ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలకు భారత్ పుట్టినిల్లు. కాబట్టి మతస్వేచ్ఛకు అందరం మరోసారి కంకణబద్ధులం అవుదాం. జైషే అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు అంతర్జాతీయ వేదికలపై భారత్ మద్దతు పలుకుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి అమెరికా కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. మరోవైపు జపాన్‌లోని ఒసాకాలో జూన్28–29 తేదీల్లో జరిగే జీ–20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. భేటీ సందర్భంగా పాంపియోతో జైశంకర్ కరచాలనం -
రాష్ట్రాన్ని విపత్తుల ప్రాంతంగా గుర్తించాలి
ఏపీ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విపత్తుల కేంద్రంగా గుర్తించి తీర్మానం చేయాలని శనివారం శాసనమండలిలో సభ్యులు తీర్మానించారు. హుద్‌హుద్ తుపాను నష్టంపై సంక్షిప్త చర్చలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తరచూ తుపాను తాకిడికి గురవుతున్న ఏపీని విపత్తుల ప్రాంతంగా పరిగణించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం పంపాలని ప్రతిపాదించగా అన్ని పార్టీలకు చెందిన సభ్యు లు మద్దతు పలికారు. అనంతరం మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ తుపాను నష్టంపై ప్రభుత్వం ముందుగా అంచనా వేయటంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సాయం చేస్తామన్న కేంద్రం మొండి చెయ్యి చూపితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన సభ్యుడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. 125 ఏళ్లలో రాష్ట్రంలో 77 పెద్ద తుపానులు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయని ఇప్పటికైనా శాశ్వత పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తుపాను బాధితులకు పంపిణీ చేయాల్సిన నిత్యావసర సరుకులను కూడా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడం దురదృష్టకరమన్నారు. మడ అడవుల్లో కలపను అక్రమంగా తరలించడం వల్లే తుపాను విశాఖపై ప్రభావం చూపిందని ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి హుద్హుద్పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్ర పునర్నిర్మాణానికి పూర్తి తోడ్పాటు అందించాలని, హుద్‌హుద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. విరాళాలు ఇచ్చిన దాతలు, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపింది. ఈమేరకు హోం మంత్రి చినరాజప్ప ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తుపాను బీభత్సం సమాచారం అందిన వెంటనే స్పందించి తక్షణమే సందర్శించి కేంద్ర బృందాన్ని పంపిన ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ హోం మంత్రి-ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని శాసనసభ ఆమోదించింది.