breaking news
Committee Recommendations
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైద్య విద్య నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సులు
దేశంలో వైద్య విద్య ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల నుంచి లెసైన్స్‌ల పునరుద్ధరణ వరకు.. అన్నింటా సమూల మార్పులు జరిగే అవకాశముంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ నివేదిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్-2016 పేరుతో రూపొందించిన నివేదికలో కమిటీ కీలక సిఫార్సులు చేసింది. వివరాలు.. నాణ్యత ప్రమాణాల పెంపునకు దేశంలో వైద్య విద్యను ప్రక్షాళన చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ రంజిత్ రాయ్ చౌదరి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 92వ నివేదికలో వైద్య విద్య సంస్కరణలకు సిఫార్సులు చేసింది. సుప్రీంకోర్టు సైతం గత మేలో ఇచ్చిన తీర్పులో రంజిత్ రాయ్ కమిటీ సిఫార్సులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనల ఆధారంగా వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా నేతృత్వంలో పి.కె.మిశ్రా (ప్రధానమంత్రి అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ), అమితాబ్ కాంత్ (నీతి ఆయోగ్ సీఈవో), బి.పి.శర్మ (అప్పటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి) మొత్తం నలుగురు సభ్యుల కమిటీని మార్చిలో నియమించింది. ఇది దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, నిపుణులతో చర్చించి నివేదికను రూపొందించింది. ఎంసీఐ స్థానంలో ఎన్ఎంసీ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సు.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైద్య విద్య నియంత్రణ, పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను రద్దు చేయడం. దాని స్థానంలో కొత్తగా ద నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఏర్పాటవుతుంది. ఇందులో చైర్పర్సన్, సభ్య కార్యదర్శి, ఎనిమిది మంది ఎక్స్-అఫీషియో సభ్యులు, పది మంది పార్ట్‌టైం సభ్యులు ఉంటారు. దేశంలో వైద్య విద్య ప్రమాణాల పెంపులో ఎంసీఐ విఫలమవడం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాన్ని రద్దుచేసి, ఎన్ఎంసీను రూపొందించాలని సిఫార్సు చేస్తున్నట్లు కమిటీ పేర్కొంది. ఎన్ఎంసీ పరిధిలో నాలుగు బోర్డ్‌లు ఎన్ఎంసీ పరిధిలో నాలుగు బోర్డ్లను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అవి.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్. ఈవిధంగా ప్రత్యేక బోర్డ్లను ఏర్పాటు చేయడం వల్ల ఆయా విభాగాల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుపై నిరంతర పర్యవేక్షణకు ఆస్కారం ఉంటుందని, ఎప్పటికప్పుడు వైద్య విద్యను బలోపేతం చేయడానికి వీలవుతుందని కమిటీ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోని కోర్సులు, కరిక్యులం, ప్రవేశం, లెసైన్స్ వంటి వ్యవహారాలను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. పీజీ స్థాయిలో వ్యవహారాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్వహిస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు, అనుసరిస్తున్న విధానాలు, ప్రమాణాల పరంగా మూల్యాంకన వ్యవహారాలను మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. మెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ వంటి అంశాలను బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్ చూస్తుంది. ఫీజులపై నియంత్రణ పరిమితం కమిటీ సిఫార్సు ప్రకారం ఒక ప్రైవేటు కళాశాలలో గరిష్టంగా 40 శాతం సీట్ల మేరకే ఆ ఇన్స్టిట్యూట్ వసూలు చేసే ఫీజు విషయంలో ప్రభుత్వం లేదా ఎన్ఎంసీకి నియంత్రణ ఉంటుంది. మిగిలిన 60 శాతం సీట్ల విషయంలో సదరు ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సిఫార్సుల్లో ఆందోళన కలిగిస్తున్న మరో అంశం.. ప్రైవేటు మెడికల్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు లాభదాయక సంస్థలు (ఫర్ - ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్)ను సైతం ఆమోదించాలనేది. ఇప్పటివరకు లాభాపేక్షలేని (నాన్ - ప్రాఫిట్) సంస్థలు, ట్రస్ట్‌లకే మెడికల్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు అనుమతులు లభించేవి. దీనివల్ల కొత్త కళాశాలల సంఖ్య తక్కువగా ఉందని, వైద్య రంగంలో మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ గ్యాప్‌ను దృష్టిలో పెట్టుకుని ఫర్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లకు కూడా మెడికల్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం అవసరమని కమిటీ పేర్కొంది. సంస్థలకు రేటింగ్స్ ఇప్పటి వరకు మెడికల్ ఇన్స్టిట్యూట్స్ పరంగా ఎలాంటి ర్యాంకింగ్ లేదా రేటింగ్ వ్యవస్థ లేదు. నీతి ఆయోగ్ కమిటీ కొత్తగా ఈ వ్యవస్థకు రూపకల్పన చేస్తూ సిఫార్సు చేసింది. ప్రత్యేకంగా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ బోర్డ్ నిరంతరం మెడికల్ ఇన్స్టిట్యూట్లలో తనిఖీలు నిర్వహిస్తూ .. వాటి నాణ్యత, పాటిస్తున్న ప్రమాణాల ఆధారంగా రేటింగ్స్ ఇవ్వాలి. వాటిని నిర్దిష్ట వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలుస్తాయని పేర్కొంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కమిటీ సూచించింది. అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్ తదితర) కోర్సులు పూర్తిచేశాక, ప్రాక్టీస్ చేయాలనుకునే అభ్యర్థులకు లెసైన్సియేట్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని పేర్కొంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణతను పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. ద మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ వైద్య విద్యలో రూపొందించాల్సిన కొత్త విధానాలు, నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకోవాల్సిన చర్యలను సూచించేలా ప్రత్యేకంగా మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొంది. ఇందులో ప్రతి రాష్ర్టం ఒక వైద్య నిపుణుడిని సభ్యుడిగా నామినేట్ చేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఇద్దరు సభ్యులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నామినేట్ చేస్తుంది. ఈ కౌన్సిల్ ఏడాదికి కనీసం ఒకసారైనా సమావేశమై, వైద్యరంగంలో తాజా పరిస్థితులు, దానికి అనుగుణంగా వైద్య విద్యలో చేపట్టాల్సిన మార్పులపై సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సైతం నిరంతరం ద మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను సంప్రదిస్తూ కొత్తగా అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకోవాలని సూచించింది. సెర్చ్ కమిటీలు వివిధ కొత్త బోర్డ్‌ల రూపకల్పనకు సిఫార్సు చేసిన కమిటీ.. ఆయా బోర్డ్‌ల చైర్ పర్సన్లు, సభ్యుల నియామకాన్ని పారదర్శకంగా చేపట్టాలని, ప్రత్యేకంగా సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీల సిఫార్సుల మేరకు ఈ నియామకాలు ఖరారు చేయాలని సూచించింది. ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో కేబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ సీఈవో, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన వైద్య రంగ నిపుణుడు, మేనేజ్మెంట్/లా/ఎకనామిక్స్/సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుడు; ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సభ్యులుగా ప్రతిపాదించాలని పేర్కొంది. ఆగస్టు 31 వరకు అభిప్రాయ సేకరణ కొత్త చట్టం రూపకల్పనకు వివిధ సిఫార్సులతో రూపొందించిన బిల్లును నీతి ఆయోగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 31 వరకు అభిప్రాయాలు స్వీకరించి వాటి ఆధారంగా కమిటీ తుది సిఫార్సులు రూపొందించి, వాటిని కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. వైద్య విద్యా రంగంలో మార్పులపై నీతి ఆయోగ్ కమిటీ.. వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేకంగా బోర్డ్లను రూపొందించాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో.. ఆయా బోర్డుల్లో సభ్యులుగా వైద్య రంగానికి చెందిన నిపుణులకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆ బోర్డ్‌లు సమర్థంగా పని చేయగలుగుతాయి. ప్రస్తుతం ఎంసీఐ విధానంలో పలు కమిటీలు ఉన్నప్పటికీ వాటిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పం మంచిదే. అయితే లాభాపేక్ష గల సంస్థలను సైతం మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటుకు అనుమతించాలనే సిఫార్సులపై మరోసారి ఆలోచించాలి. - డా. పుట్టా శ్రీనివాస్, మాజీ డెరైక్టర్, టీఎస్ డీఎంఈ. కమిటీ సూచనలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్. ప్రైవేటు కళాశాలల్లో 60 శాతం సీట్ల ఫీజుపై యాజమాన్యాలకు స్వేచ్ఛ ప్రైవేటు మెడికల్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు లాభదాయక సంస్థలకు అనుమతి ప్రత్యేకంగా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఏర్పాటు వైద్య విద్యపై సలహాలకు మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్