breaking news
Comedy Nights Bachao
-
నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్
బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి కమెడియన్ కృష్ణా అభిషేక్ క్షమాపణ చెప్పాడు. ‘కామెడీ నైట్స్ బచావో’ షోలో తన ఒంటిరంగును హేళన చేస్తూ జోకులు వేశారని తనిష్టా ఛటర్జీ ఆరోపించిన నేపథ్యంలో అభిషేక్ స్పందించాడు. ‘మా కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగిందని తనిష్టా ఛటర్జీ భావిస్తే మావైపు నుంచి ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఎవరినీ నొప్పించాలని, అవమానించాలని మేము అనుకోవడం లేదు. కామెడీ నైట్స్ బచావో షో రోస్ట్ ఫార్మాట్ లో సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన హాస్యం అందించాలన్నదే మా ఉద్దేశమ’ని అభిషేక్ అన్నాడు. తమ కార్యక్రమాన్ని చూసినవారంతా ఎంతో మెచ్చుకుంటున్నారని చెప్పాడు. షారూఖ్ ఖాన్, వరుణ ధావన్ లాంటి హీరోలు తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోకు వచ్చారని గుర్తు చేశాడు. ’తనిష్టా ఛటర్జీకి ఎందుకు బాధ కలిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను వచ్చాను. ఆమెను బాధ పెట్టివుంటే క్షమించమని అడుగుతున్నాను. ఇదంతా కావాలని చేసింది కాద’ని అభిషేక్ పేర్కొన్నాడు. -
కామెడీ షోలో ఆ నటిపై దారుణమైన జోక్స్!
మన టీవీల్లో వచ్చే కామెడీ షోల్లో దారుణమైన కుళ్లు జోకులు వేసి నవ్వించేందుకు కుప్పిగంతులు వేయడాన్ని మనం చూసే ఉంటాం. తాజాగా బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి ఇదేవిధమైన చేదు అనుభవం ఎదురైంది. గ్రామీణ స్త్రీల సమస్యలపై సాహసోపేతంగా తెరకెక్కిన ’పర్చెడ్’ సినిమాలో రాధికా ఆప్తేతో కలిసి ఆమె బోల్డ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకురాలు లీనా యాదవ్, సహనటి రాధికా ఆప్తేతో కలిసి ’కామెడీ నైట్స్ బచావో’ షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో 'రోస్ట్' (ఆరోగ్యకరమైన జోక్స్) పేరిట ఆమె నల్లగా ఉన్నదని హేళన చేశారు. 'మీకు చిన్నప్పటి నుంచి నల్లరేగడి పళ్లు ఇష్టమా? మీరు అవి బాగా తిని ఉంటారు కదా' అంటూ ఆమె ఒంటిరంగును హేళన చేస్తూ కుళ్లు జోకులు వేశారు. దీంతో కంగుతిన్న ఆమె వెంటనే నిరసన తెలిసింది. మనుషుల రూపురేఖలని చులకన చేసే వ్యాఖ్యలతో పరిహాసమాడటం ఏమీ బాగా లేదని ఆమె షో నుంచి వైదొలిగింది. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ఓ కామెడీ షోలో ఇంత దారుణంగా జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. అసభ్యకరమైన పరిహాసాలు చేసినందుకు కామెడీ షో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిరంగు కారణంగా మన దేశంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని, పెళ్లి ప్రకటనల్లోనూ శరీర ఛాయ ప్రధానపాత్ర పోషిస్తున్నదని, దేశంలోని కులవ్యవస్థ మూలాల్లోనే ఈ వర్ణ వివక్ష కూడా ఉందని ఆమె విశ్లేషించారు.