breaking news
Colonel Officer
-
రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..
న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్ ఎలా ముందుకు సాగారంటే.... ఇండియన్ ఆర్మీ 16 బిహార్ బెటాలియన్‌కు సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్ బాబు, చైనా కమాండింగ్ ఆఫీసర్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్ స్వయంగా గల్వాన్ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్ సంతోష్ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి. చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు. -
భర్త బాటలో... సైన్యంలో...
స్ఫూర్తి ప్రియా సెమ్వల్ని సైనిక దుస్తుల్లో చూడగానే బంధువులు, స్నేహితులు.. సంతోషంతోపాటు ఒకింత గర్వంగా భావించారు. తోటి సైనికులు మాత్రం ఆమెలో నాయక్ అమిత్ శర్మను చూసుకుని ఆనందపడ్డారు. ‘‘అమిత్ శర్మ తన భార్య ప్రియ చదువు గురించి చెప్పినప్పుడల్లా ‘ఆమెను కూడా సైనికురాలిని చెయ్యాలి నువ్వు’ అనే వాడిని. బిడ్డను చదివించే మగాళ్లుంటారు కానీ అంతే ఇష్టంతో భార్యను చదివించడం అరుదు కదా! అమిత్ స్థానాన్ని ప్రియ భర్తీ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియా సెమ్వల్లో అమిత్‌ని చూసుకుంటాం’’ కల్నల్ ఆఫీసర్ అగర్వాల్ అన్న ఆ మాటలు ప్రియ కళ్లనే కాదు...ఆమెతోపాటు నిలబడ్డ 194మంది జవాన్ల కళ్లనూ చెమ్మగిల్లేలా చేశాయి. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర తవాంగ్ కొండప్రాంతంలో పనిచేస్తున్న అమిత్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అమిత్ శర్మ భార్య ప్రియా సెమ్వల్ని భారత సైనికదళంలో షార్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా నియమించడం సైనికవిభాగాన్నే కాదు సామాన్యుల్ని కూడా ఆశ్చర్యపరచింది. మొదటిసారి ఓ అమరవీరుని భార్యకు సైనిక ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించడంతో అందరి దృష్టి ప్రియపై పడింది. చిన్న వయసులోనే... ఇరవై ఆరేళ్ళ వయసుకే భర్తను కోల్పోవడం అంటే చిన్న కష్టం కాదు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రియా సెమ్వల్కి అమిత్ శర్మతో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత భార్య ఇష్టాన్ని గౌరవించి పై చదువులు చదివించాడు అమిత్. గణితంలో ిపీజీ పూర్తిచేసిన ప్రియా ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ మంచి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుండగా భర్త మరణవార్త చెవిన పడింది. ‘‘పాతికేళ్ల అమ్మాయి భర్తలేడన్న వార్తని ఎలా జీర్ణించుకోగలదు. మా చెల్లి మామూలు మనిషి కావడానికి చాన్నాళ్లు పట్టింది. భర్తను తలచుకుని ఆరేళ్ల బిడ్డను చూసుకుంటూ బాధపడుతున్న ప్రియకు భారత సైనికవిభాగం నుంచి పిలుపువచ్చింది. అమిత్ స్థానంలో ప్రియకు ఉద్యోగం ఇప్పిస్తామన్న కబురు వినగానే మేమంతా చాలా సంతోషించాం. మొదట్లో కొద్దిగా భయపడ్డా...ప్రియలోని ధైర్యం మమ్మల్ని గర్వపడేలా చేసింది’’ అని చెప్పాడు ప్రియ అన్న ప్రవేశ్ సెమ్వల్. కాశ్మీర్ పరిధిలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సైనిక విభాగంలో పనిచేయడానికి గత నెలలో వెళ్లిన ప్రియా ప్రస్తుతం తన విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మన దేశ 62వ మహిళా జవానుగా, ఓ సైనికుని భార్యగా ప్రియ అందిస్తోన్న సైనిక సేవలు మహిళలకే కాదు మగవారికీ స్ఫూర్తిదాయకమే!