breaking news
Cinare
-
తెలుగు సాహిత్యంలో రారాజు సినారె
వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి(సినారె) రారాజు అని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన సినారె 87వ జయంతి, చివరి కవితా సంపుటి ‘కలం అలిగింది’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సినారె అభినవ శ్రీనాథుడు, అభినవ సోమనాథుడు అని అభివర్ణించారు. ఎన్టీఆర్ సినిమాలు అంతటి ప్రాచుర్యం పొందటానికి కారణం సినారె అని అన్నారు. ప్రజాకవి అంటే సినారెలా ఉండాలని, ఆయన అచ్చమైన తెలంగాణ కవి అని పేర్కొన్నారు. సినారె ఏకకాలంలో అన్ని వర్గాల ప్రజలను రంజింపచేసేవారని అన్నారు. ఇద్దరు ముఖ్యమం త్రులు తెలుగు భాషను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్లో సాహిత్యా నికి మాజీ ప్రధాని వాజ్‌పేయి, సినారె ప్రాముఖ్యత తెచ్చారని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాలకు సినారె చేసినంత సేవ మరెవరూ చేయలేరని చెప్పారు. 1953 నుంచి చనిపోయే వరకూ సినారె కవితలు రాస్తూ ఉండటం వల్లే సాహిత్యంలో ఆయన మకుటంలేని మహారాజు అయ్యారని కొనియాడారు. సినారె చిత్రపటాన్ని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరిం చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తాను సినారెకి ఏకలవ్య శిష్యుడినని అన్నారు. సినారె మనుమరాలు వరేణ్యా కవిత్వంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా కలం అలిగింది పుస్తకాన్ని, వంశీ విజ్ఞానపీఠం లోగోను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ గాయకురాలు శారద ఆకునూరి బృందం నిర్వహించిన మధుర భావాల సుమమాల సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి, అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కళాబ్రహ్మ, వంశీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
గో..గో.. తూ.గో.
- ముంపు గ్రామాల విలీనంతో భారీగా విస్తరించనున్న జిల్లా - ఏజెన్సీ వైపు మరో 80 కి.మీ. ముందుకు జరగనున్న సరిహద్దు - అటు ‘పశ్చిమ గోదావరి’తోనూ మారనున్న పొలిమేరలు సాక్షి, రాజమండ్రి : ‘ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగమొకటేనన్నా..’ తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి (సినారే) కలం నుంచి జాలువారిన తేనెమూటల్లాంటి సినిమా పాటల్లో ఒకానొక గీతంలోని పంక్తి ఇది. ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది’ అన్న ఆ పాటలో ఆయన ఆకాంక్షించింది తెలుగువారు ఎన్నటికీ ఒకటిగానే ఉండాలని. కారణాలు ఏవైనా..మూడుసీమల ముప్పేట వంటి రాష్ట్రం రెండు ముక్కలవుతోంది. సినారే పాట బాటలోనే.. ‘రాష్ట్రాలు వేరైనా.. మన రాగబంధం ఒకటేనన్నా’ అని రెండు ప్రాంతాల ప్రజలూ అనుకోగలిగినా సాంకేతికంగా విభజనరేఖలు తప్పవు. నిన్నటి వరకు ‘మన గడ్డ’ అన్న భావనతో స్వేచ్ఛగా తిరిగిన చోటే ఆంక్షలను చ వి చూడకతప్పదు. భద్రాద్రిలో కొలువైన కోదండరాముడు.. మనకు రేపు కూడా అంతే దూరంలో ఉంటా డు. అయితే.. ఆ రఘురాముడిని దర్శించుకోవడానికి ‘రాష్ట్ర సరిహద్దు’ను దాటి వెళ్లక తప్పదు. రాష్ట్ర విభజనతో తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల మధ్యను న్న ఏజెన్సీ ప్రాంతం అంతర్ రాష్ట్ర సరిహద్దుగా మారి పోతోంది. ముంపు గ్రామాల విలీనం అనంతరం కొత్త సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ రెండు సమీపిస్తున్నా ఇంకా ఆ కసరత్తు పూర్తికాలేదు. మారేడుమిల్లి నుంచి మరీ ముందుకు.. రాజమండ్రికి 80, కాకినాడకు 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి జిల్లాలో చివరి మం డలం. మారేడుమిల్లి తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని తులసిపాకలతో ఖమ్మం జిల్లా చింతూరు మం డలం మొదలవుతుంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోని (తులసిపాకలకు 10 కి.మీ. దూ రం) లక్కవరం సెంటర్ వద్ద వై.రామవరం మండ లం డొంకరాయి, మంగంపాడులతో పాటు, విశాఖ జిల్లా సీలేరు ప్రాంతాలకు వెళ్లే క్రాస్ రోడ్డు ఉంటుంది. అసలు గ్రామాలు ఉండని ఈ తావు వరకూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లా వాసులే ఎక్కువగా సంచరిస్తుంటారు. ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చింతూరు, కూనవరం, వర రామచంద్రపురంలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు ఆర్డినెన్స్ వచ్చింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా భద్రాచలం మండలాన్ని కూడా తూర్పుగోదారిలో కలిపేస్తున్నందున పాత సరిహద్దులు చెరిగిపోనున్నాయి. మన జిల్లా సరిహద్దులు విస్తరించనున్నాయి. ఇకపై భద్రాచలానికి ముందు తగిలే సీతారాంపురం వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిధి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి భద్రాచలం 117 కిలోమీటర్లు. ప్రస్తుతం మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముగిసిపోయే మన జిల్లా సరిహద్దు భద్రాచలానికి సుమారు ఏడు కిలోమీటర్ల ముందు వరకూ.. మారేడుమిల్లికి 110 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించనుంది. అంటే ఈవైపు మన జిల్లా అదనంగా మరో 80 కిలోమీటర్ల వరకూ విస్తరించనుందన్న మాట. అలాగే ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం కానున్నందున ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కూడా విస్తరించనుంది. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు ఎక్కడో? ముంపు గ్రామాల విలీ నంపై ఆర్డినెన్స్ ఆమోదం పొందక ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు దాటాక వచ్చే తులసిపాకలగా భావించారు. పాలనా సౌలభ్యం, భద్రతల రీత్యా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును మారేడుమిల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇది మన రాష్ట్రం తరపున తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు కలిపి ఉమ్మడి చెక్‌పోస్టు కాగలదు. కానీ కొత్త సరిహద్దుల ప్రకారం మన రాష్ట్ర చెక్‌పోస్టు చింతూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని చట్టి సెంటర్ వద్ద ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లకు ఉమ్మడిగా ఏర్పాటు చేయాలి. లేదంటే భద్రాచలం సమీపంలోని సీతారాంపురం, గూడాల, కానాపురం గ్రామ శివార్లలో ఏదో ఒక అనువైన ప్రాంతం ఎంచుకుని తనిఖీ కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రకారం విలీన గ్రామాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుది సరిహద్దులు ప్రకటించాల్సి ఉంది. జూన్ రెండున తెలంగాణ అపాయింటెడ్ డే కన్నా ముందే ఈ సరిహద్దులపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అందరిలోనూ ఏమవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.