breaking news
chilies
-
కారం పండుగ
పండుగకు తరచూ చేసుకునేది మిఠాయిలే కానీ ఇప్పుడు మార్కెట్లో పండుమిరపకాయలు బోలెడు దొరుకుతున్నాయి. అందుకే సరదాగా కారం పండుగ చేసుకుందాం పండు మిర్చి – గోంగూర కారం కావలసినవి: పండు మిర్చి – 500 గ్రా.; గోంగూర – 10 కట్టలు; వెల్లుల్లి రేకలు – 5; ధనియాలు – టేబుల్ స్పూను; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 10; సెనగ పప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఇంగువ – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; నూనె – 150 గ్రా.; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను తయారి: ∙ముందుగా గోంగూరను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ∙పండు మిర్చి తొడిమలు తీసి శుభ్రంగా కడిగి ఆరిన తరవాత, చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి ∙బాణలలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర వేసి పచ్చి పోయేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి పండు మిర్చి ముక్కలు, చింతపండు వేసి వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙మిక్సీలో ముందుగా గోంగూర, చింతపండు వేసి మెత్తగా చేయాలి ∙పండు మిరప ముక్కలు వేసి మరోమారు తిప్పాలి ∙తగినంత ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు జత చేసి బాగా కలిపి సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. పండు మిర్చి పచ్చడి కావలసినవి: పండు మిర్చి – 500 గ్రా.; చింతపండు – 150 గ్రా; ఉప్పు – తగినంత; పసుపు – టేబుల్ స్పూను; మెంతులు – టేబుల్ స్పూను (వేయించి మిక్సీలో వేసి పొడి చేయాలి) వెల్లుల్లి రేకలు – 50 గ్రా.; పోపు కోసం... నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సెనగ పప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు తయారి: ∙ముందుగా పండు మిర్చిని శుభ్రంగా కడిగి తడి పోయేవరకు ఆరబెట్టాలి ∙చింతపండులోని గింజలు, ఈనెలు తీసి పక్కన ఉంచాలి ∙ తొడిమలు తీసి, పండు మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి, ఉప్పు, పసుపు జత చేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙ ఒక పాత్రలో ముందుగా చింతపండు వేసి, ఆ పైన మిక్సీ పట్టిన పండు మిర్చి ముద్ద వేసి మూత పెట్టి మూడు రోజులు అలానే ఉంచాలి ∙మూడు రోజుల తరవాత మిశ్రమం అంతా బయటకు తీసి, మరోమారు మిక్సీలో వేసి అన్నీ కలిసేలా ఒకసారి మిక్సీ పట్టి తీసేయాలి ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేగాక తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో పోపు వేసి కలియబెట్టాలి ∙మెంతి పొడి, వెల్లుల్లి రేకలు వేసి మరోమారు కలిపి, వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది. పండు మిర్చి – చికెన్ కుర్మా కావలసినవి: గ్రేవీ కోసం... పండు మిర్చి – 6 (శుభ్రంగా కడిగి తొడిమలు తీసి ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టొమాటోలు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి) కూర కోసం... చికెన్ – అర కేజీ; పసుపు – పావు టీ స్పూను; నూనె – 4 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 3; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి); కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; చిక్కగా గిలకొట్టిన మజ్జిగ – అర కప్పు ; నీళ్లు – కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; కొత్తిమీర – పావు కప్పు (సన్నగా తరగాలి) గ్రేవీ తయారీ... మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి. కూర తయారి ∙చికెన్, పసుపు జత చేసి బాగా కలిపి సుమారు 20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి బాణలి వేడయ్యాక నూనె పోసి కాగనివ్వాలి ∙లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి మెత్తగా అయ్యేవరకు కలియబెట్టాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వాసన పోయేవరకు రెండు నిమిషాలు ఉడికించాలి ∙చికెన్ వేసి కలిపి, పైన ధనియాల పొడి, చిక్కటి మజ్జిగ, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ∙గ్రేవీ జత చేసి, కప్పుడు నీళ్లు, గరం మసాలా వేసి బాగా కలపాలి ∙గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి ∙కొత్తిమీర జత చేసి దింపేయాలి. పండు మిర్చి – టొమాటో – కొత్తిమీర చట్నీ కావలసినవి: పండు మిర్చి – 10; కొత్తిమీర – కప్పు; టొమాటో ముక్కలు – కప్పు; పచ్చి సెనగపప్పు – టీ స్పూను; ధనియాలు – టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారి: ∙ముందుగా బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, ధనియాలు వేసి వేయించాలి ∙వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు వేయించాలి ∙పండు మిర్చి, టొమాటో ముక్కలు జత చేసి బాగా కలపాలి ∙పదార్థాలన్నీ బాగా వేగిన తరవాత కొత్తిమీర జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙తగినంత ఉప్పు జత చే సి, బాగా కలపాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙మిక్సీ పట్టిన పచ్చడిని పోపులో వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపాలి. పండు మిర్చి స్పైసీ ఫిష్ కర్రీ కావలసినవి: చేపలు – 500 గ్రా.; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి); టొమాటోలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; అల్లం తరుగు – టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – 7 రెమ్మలు; పండు మిర్చి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు; చింతపండు రసం – అర కప్పు; సన్నగా తరిగిన కొత్తిమీర – అర కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – కప్పుడు పండు మిర్చి పేస్ట్ కోసం... పండు మిర్చి – 10; వేయించిన జీలకర్ర – టీ స్పూను; వేయించిన మెంతులు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 3; ఉప్పు – అర టీ స్పూను; నీళ్లు – మిక్సీలో గ్రైండ్ చేయడానికి సరిపడా; ఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తయారి: ∙చేపల మీద కొద్దిగా ఉప్పు రుద్ది, శుభ్రంగా కడగాలి ∙పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి ∙టొమాటో ముక్కలు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు వేయించాలి ∙పండు మిర్చి పేస్ట్ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చింతపండు రసం, ఉప్పు, కప్పుడు నీళ్లు వేసి మరోమారు బాగా కలపాలి ∙గ్రేవీ బాగా ఉడుకుతుండగా చేప ముక్కలు, కొత్తిమీర తరుగు, మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙మూత పెట్టి గంట తరవాత వడ్డించాలి. -
అమెరికా టు అనకాపల్లి... మిరపకాయ
తిండి గోల కొన్నివంటకాలను కొన్ని పదార్థాలు లేకపోయినా వండచ్చు. కానీ, కారం లేకుండా మాత్రం వండలేం. తెలుగువారి ఆహార సంస్కృతి చరిత్రను మిరపకాయల రాకకు ముందు యుగం, తరువాతి యుగం అని రెండుగా విభజించవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలో పోర్చుగీసులు మిరపకాయల్ని భారతదేశానికి తీసుకురాగా, తెలుగువారు వాటిని అందుకొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండే విధంగా మిరపకాయల్ని పండిస్తున్నారు భారతీయలు. మిరపకాయలు పరిచయం అయ్యేవరకు మనకు తెలిసిన కారపు ద్రవ్యాలు మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క.. వీటినే ఆహారంలో కారంగా వాడుకునేవారు. మిరియాల్ని సంస్కృతభాషలో ‘మరీచి’ అంటారు. మిరియంపు కాయలు అనే మాట మిరపకాయలుగా రూపొందిందని భాషావేత్తలు చెబుతారు. అలాగే, మరీచి పదం ‘మిర్చి’గా మారి ఉండవచ్చు. ఇండియాకి దారి కనుక్కోవడానికి బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా చేరినప్పుడు, మెక్సికో తీరంలో అతనికి ఈ కారపు కాయలు కన్పించాయట. అమెరికా నుంచి కొలంబస్ తెచ్చిన ఈ మిరపకాయల్ని పోర్చుగీసులు తెచ్చి భారతదేశానికి కారపు రుచిని అంటించారు. -
వలలేసి మిరపకాయలు పట్టుకుంటున్న రైతన్నలు
ఏటూరునాగారం: చేపలు పట్టుకోవడం విన్నాం... కానీ, రైతన్నలు మిరపకాయలను వలలేసి పట్టుకోవడం ఏంటి...? పట్టించుకునే నాథుడు లేక... రైతన్నల ధైన్య స్థితికి నిదర్శనమే ఇది. శనివారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని గయ్యాలవాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. వాగు దిగువన రైతులు ఎండు మిరపకాయలను ఆరబోసుకున్నారు. మేడారం, గోవిందరావుపేట ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో సుమారు 200 క్వింటాళ్ల మిరపకాయలు నీటిపాలయ్యాయి. అలాగే, 50 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. కాగా, విషయం తెలుసుకున్న రైతులు నీటిపై తేలుతూ కనిపిస్తున్న మిరపకాయలను సేకరించేందుకు చేపల వలలతో పాట్లు పడడం చూసేవారిని కదిలించింది. ఇంత జరిగినా ఉదయం 8 గంటల వరకు ఏ ఒక్క అధికారీ అటువైపు కన్నెత్తి చూడలేదు. -
పరుగులు పెట్టించిన అకాల వర్షం
నాదెండ్ల : బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా సోమవారం ఉదయం పడిన చిరుజల్లులు రైతులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. వ్యవసాయపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అకాల వర్షం రైతులకు కొంత నష్టాన్ని కలిగించింది. పత్తి పంట 70 శాతం వరకు చేతికందింది. చేలపై ఉన్న మిగిలిన పంట వర్షంతో తడిసింది.కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న పరదాలను తెచ్చి కప్పారు. పొలంలో 50 శాతంపైగా మిరపకాయలు పండి కోతకు వచ్చాయి. ఈ సమయంలో కురిసిన వర్షంతో తాలుకాయలు అయ్యి పంట రంగుమారి ధర పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిపంట కోతకు వచ్చి పొలాల్లోనే కుప్పలు పోశారు. వర్షంతో ధాన్యం రంగుమారే అవకాశం ఉందంటున్నారు. నూర్పిడి పూర్తై రైతులు పశుగ్రాసం ఇళ్లకు తెచ్చి ఉంచారు. వాములు వేయకముందే చిరుజల్లులు పడడంతో తడిసిపోకుండా పట్టలు కప్పారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రబీ రైతుల ఆందోళన చిలకలూరిపేటరూరల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ఇదేతరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా బర్లీ, బ్యారన్ పొగాకు పండించే రైతులు ఈ వర్షం కారణంగా దిగుబడిలో గ్రేడ్ రాదని పేర్కొంటున్నారు.పొలాల్లోనే బర్లీ పొగాకును ఆరబెట్టారు. అలాగే పత్తి, శనగ, మిర్చి తడిసినట్టు రైతులు తెలిపారు. తెనాలిలో అకాల వర్షం తెనాలిఅర్బన్ : తెనాలి పట్టణంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం కొద్దిసేపు హడావుడి చేసింది. ఒక్కసారిగా పెద్దగా వర్షం రావటంతో రోడ్డుపై ప్రజలు తలదాచుకునేందుకు సమీపంలోని షాపుల్లోకి పరుగులు పెట్టారు. నకరికల్లులో.. నకరికల్లు : ఆకాశంలో కారుమబ్బులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 1800 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇప్పటి వరకు కౌలురైతులు సుమారు రూ.30 వేలు, సొంతరైతులు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ప్రస్తుతం కోతకు వస్తోంది. ఈ తరుణంలో ఆకాశం మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తిపంట చేలోనే తడిసి పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాచర్లలో.. మాచర్లటౌన్ : ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది. సోమవారం ఉదయం ఆకాశం మబ్బులు పట్టి పట్టణ శివారులో వర్షం కురిసింది. మార్కెట్యార్డులోని సీసీఐ కేంద్రంలో నిల్వ ఉంచిన పత్తిబోరాలపై ఒక్కసారిగా వర్షం కురవటంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే పట్టలు కప్పేందుకు హడావుడి పడ్డారు. నెహ్రూనగర్, రాయవరం, కంభంపాడు గ్రామాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న మిర్చి దెబ్బతింటుందని ఆందోళన చెందిన రైతులు పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు మిర్చియార్డులో.. పాతగుంటూరు : గుంటూరులో సోమవారం తెల్లవారుజామున చిరుజల్లులు పడటంతో యార్డులో మిర్చి టిక్కీలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. వేమెన్స్ , కమీషన్ షాపుల వద్ద ఉన్న పట్టలను తెచ్చుకుని మిర్చిని కాపాడుకున్నారు. చిరుజల్లులతోనే వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది రైతులు వర్షం పెద్దదవుతుందేమోనని ఆందోళనతో మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీకి తరలించారు.