breaking news
child lifting rumours
-
పిల్లల్ని ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో..
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ధూలే జిల్లాలోని ఓ గ్రామంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వారనే అనుమానంతో గ్రామస్తులు ఐదుగురు వ్యక్తులను కొట్టిచంపారు. గిరిజన గూడెం రైన్‌పాదలో రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సులో దిగిన ఐదుగుని స్ధానికులు చితకబాదారు. ఓ బాలికతో మాట్లాడేందుకు వారు ప్రయత్నించగా, పిల్లల్ని ఎత్తుకుపోయే బృందంగా అనుమానిస్తూ అక్కడ గుమికూడిన గ్రామస్తులు వారిపై దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో పిల్లల్ని ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గ్రామస్తులు వారిని చితకబాదడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని తెలిపారు. మృతదేహాలను సమీప పింపల్నేర్ ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఈ తరహా ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. నాలుగు రోజుల కిందట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకువెళుతుందనే అనుమానంతో ఓ యాచకురాలిని కొట్టిచంపారు. బాధితురాలిని సర్ధార్‌నగర్‌కు చెందిన శాంతాదేవిగా గుర్తించారు. ఇదే ఘటనలో అశుదేవి నాథ్, లీలాదేవి నాథ్, అనసి నాథ్‌లకు గాయాలయ్యాయి. అహ్మదాబాద్‌లోని వదాజ్ ప్రాంతం మీదుగా బాధితులు ఆటోలో వెళుతుండగా స్ధానికులు వారిని అటకాయించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు గత వారం చత్తీస్‌గఢ్‌లో పిల్లల్ని ఎత్తుకువెళతాడని అనుమానిస్తూ ఓ వ్యక్తిని చావబాదారు. -
వాట్సప్ రూమర్లతో.. ఏడుగురి హత్య!
జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సప్‌లో వదంతులు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్తులు కొంతమందిని పట్టుకుని చితక్కొట్టారు. దాంతో ఏడుగురు మరణించారు. ఈ కేసులో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని పోలీసులు అంటున్నారు. వికాస్ కుమార్‌వర్మ, గౌతమ్ కుమార్ వర్మ, గంగేష్ గుప్తా అనే ముగ్గురినీ నగాడి అనే ప్రాంతంలో గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి ప్రాణాలు తీసేశారు. వికాస్, గౌతమ్‌ల నాయనమ్మపై కూడా దారుణంగా దాడి జరిగింది. ఇక రాజానగర్‌లో కూడా నలుగురు వ్యక్తులను సొసొమౌలి గ్రామస్తులు పట్టుకుని వాళ్లు కిడ్నాపింగ్ గ్యాంగ్ సభ్యులన్న అనుమానంతో కొట్టి చంపేశారు. కొంతమంది వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేసి, వాళ్ల శరీర భాగాలను అమ్మేస్తున్నారంటూ వాట్సప్‌లో రూమర్లు వ్యాపించాయి. దాంతో అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఏడుగురినీ గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి మరీ ప్రాణాలు బలిగొన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా శాంతంగా ఉంటారని, అయితే రూమర్ల కారణంగా వారిలో భయం పుట్టి అదే ఇలాంటి ఘటనలకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికరులు అంటున్నారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని వాళ్లను అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంగా చేసిన దాడిలో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు వేసుకొచ్చిన కార్లు, జీపులను కూడా తగలబెట్టేశారు. ఏడుగురి హత్యలు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జంషెడ్పూర్ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్తులు పోలీసులతో గొడవపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది.