breaking news
chanda kocar
-
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు..భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే, ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ప్రైవేట్ రంగంలోనే చాలా వేగంగా వృద్ధి చెందుతోన్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో నిలిచారు. కాగా, అరుంధతీ భట్టాచార్య మొండి బకాయిల సమస్యకు పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియలో ఈమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. విలీనం అనంతరం ఎస్బీఐ ఆసియాలో ఒక అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడింది. రఘురామ్ రాజన్ పదవీ విరమణ తర్వాత భట్టాచార్య ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, బ్యాంకు డిజిటలైజేషన్‌కు విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వృద్ధిలో శిఖా శర్మ పాత్ర అనిర్వచనీయమని ఫార్చ్యూన్ తెలిపింది. -
ఐసీఐసీఐ అకాడమీ నుంచిలక్ష మందికి శిక్షణ: కొచర్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ అకాడమీ తరఫున 2017 మార్చి నాటికి లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్ తెలిపారు. నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. మానవ వనరుల లభ్యత, ఉపాధి అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఆమె ఈ అంశంపై మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంచుకుంటే... ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నారు. ‘ప్రపంచంలో యువశక్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 62 శాతం జనాభా పనిచేసే వారు ఉంటే, అందులో 54 శాతం 25 ఏళ్లలోపు వారే. ఈ సానుకూలతను ప్రయోజనకరంగా మలచుకోవాలంటే... ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా యువతీ యువకుల్లో నైపుణ్య వృద్ధికి తోడ్పడాలి. దీంతో దేశాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించే శక్తి వారే అవుతారు’ అని చందాకొచ్చర్ వివరించారు. ఐసీఐసీఐ అకాడమీ నిరుద్యోగులకు వివిధ రకాల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. శిక్షణ అనంతరం ఉద్యోగాల కల్పనకు 800 కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది.