breaking news
Chai-Wala
-
ఆహా ఏమి‘టీ’
సాక్షి, ఆలేరు : ఆంగ్లేయుల నుంచి వలస వచ్చిన టీ అలవాటు మనకు జీవితంలో ఒక భాగమైంది. టీ తాగనిదే పొద్దు గడవదు. చాయ్.. చటుక్కున్న తాగరా బాయ్.. అంటూ ఓ చిత్రంలో కథనాయకుడు టీ పుట్టుపుర్వోత్తారాలను అసక్తిగా చెబుతాడు. అలనాడు టీ తాగిన బ్రహ్మ అనాటి నుంచి ఈనాటి వరకు విశ్రాంతి లేకుండా సృష్టిని కొనసాగిస్తునే ఉన్నాడంటూ టీ మహత్తును గమ్మత్తుగా వర్ణించాడు. నిజ జీవితంలో తేనెటి ఘుమఘుమలతోనే దీనచర్య ప్రారంభమయ్యే వారు ఎందరో. నేడు అన్ని వేళల్లో టీ తాగడం సర్వసాధారణమైంది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరు టీని సేవిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులుగా మొదటగా మర్యాదాగా అందించేది టీ తోనే. ఈ రోజే ఎదుకంటే ? ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని ప్రచారం చేసేందుకు పలుమార్లు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ఇందులో భారత్ సహా పలు దేశాలు పాల్గొని ఈ దినోత్సవ ఏర్పాటుకు చొరవ చూపాయి. 2005 డిసెంబర్ 15న టీ వినియోగం గుర్తించి మనదేశంలో టీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా క్రమేనా అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ప్రదాయిని.. టీ తాగడం కూడా ఆరోగ్యమే. మానసిక ఉత్తేజం కల్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్గిస్తుంది. రక్తంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని నానాటికి ఆదరణ పెరుగుతోంది. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం, మసాలా, బాదం టీలు ఈ జాబితాలో ఉన్నాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు తెలంగాణలో కూడా వివి«ధ రకాల టీలను సేవిస్తున్నారు. ఇరానీ, అస్సాం, ఫ్లెవర్, చాక్లెట్, మసాలా, హెర్బల్, ఇలాచీ, బిస్కెట్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం టీకి ఒక్కో రకం ప్రత్యేకత ఉంటుంది. పెరిగిన టీ ధర టీ ధర పేద ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. రూ. 6 నుంచి 10 వరకు అమ్ముతున్నారు. కూలీ నాలీ చేసే సామాన్యులు సైతం దీనచర్యను చాయ్‌తోనే మొదలుపెడుతారు. చాయ్ తయారుచేయడానికి అవసరమయ్యే అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం వల్ల చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీకొట్టుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎందరికో ఉపాధి ఛాయే కదా అని అనుకుంటాం.. కానీ ఎంతో మందికి టీ అమ్మకాలు ఉపాధిని కల్పిస్తుంది. డబ్బా కొట్టు నుండి 5 నక్షత్రాల హోటళ్ల వరకు వివిధ స్థాయిలో టీ లభ్యమౌతుంది. టీ దొరకని ప్రాంతాలుండవు. కొన్ని వందల మైళ్ల దూరంలోని రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వలసవచ్చి మరి టీ కొట్టులు పెట్టుకుని బతుకుతున్న వారు ఎందరో. సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణ సముదాయాల్లో, ఫ్యాక్టరీలలో, కళాశాలలు, పార్కులు, జన సంచారం ఉన్న ప్రదేశాల్లో టీని విక్రయిస్తుంటారు. చిన్న కప్పుల్లో సాగే టీ వ్యాపారం రూపాయలు కోట్లలోనే సాగుతుందంటే ఆశ్చర్యమనిపించక మానదు. -
స్ఫూర్తిదాత.. విద్యాప్రదాత.. చాయ్ వాలా!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు. అనుకున్నది సాధించాలన్న తపన, బలమైన కోరిక ఉండాలే గానీ అందుకు వయసు, డబ్బు, చదువుతో సంబంధం ఉండదని నిరూపించాడా వృద్ధుడు. ఒడిషాకు చెందిన డి. ప్రకాశ్ రావు చాయ్‌వాలాగా జీవితాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రదాతగా... స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడదన్నదే ప్రకాష్ ఆకాంక్ష.. అందుకే చాయ్ వాలాగా ఉంటూ విద్యాప్రదాతగా మారాడు. కపటం లేని, సంతోషకరమైన జీవితం గడపడంతో పాటు.. తాను చదువుకు దూరమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు. చిన్నతనంలో చదువుపై అత్యంత మక్కువ చూపిస్తున్నా తండ్రి స్కూల్లో చేర్పించకపోవడంతో ఏమాత్రం చదువుకోలేకపోయాడు. తనకు ఎంతగానో ఇష్టమైన చదువు మురికివాడల్లోని పిల్లలకు దూరం కాకూడదన్నదే ధ్యేయంగా నడుం బిగించాడు. ప్రకాష్‌ను.. అతడి తండ్రి ఓ చాయ్ దుకాణంలో చేర్పించాడు. 1976 నుంచే ప్రకాష్ రావు టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. కానీ అతడిలో చదువు నేర్చుకోవాలన్న తపన చావలేదు. స్కూలు చదువునైనా పూర్తి చేయాలన్నఅతడి కోరిక.. పట్టుదల అతడ్ని ఓ పాఠశాల నడిపించే స్థాయికి చేర్చింది. ఉదయం చాయ్ దుకాణంలో పనిచేస్తూనే ఆ డబ్బుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకూ ఉండే 70 మంది పేద పిల్లలతో పాఠశాల నడుపుతున్నాడు. మూడో క్లాస్ తర్వాత తన స్కూలునుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాళ్లు చదువుకు దూరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారిలో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి వారికి బిస్కెట్లు, పాలు అందిస్తున్నాడు. ప్రకాష్ రావుకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ కూడా తన స్కూల్లోనే మూడోతరగతి వరకూ చదివారని చెబుతుంటే అతడి కళ్లు మెరుస్తాయి. తాను చదువు చెప్పలేకపోయినా, అనుకున్నది సాధించాడు. చాయ్ వాలా స్ఫూర్తిదాయక జీవనంపై మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడొచ్చు.