breaking news
CBI Joint Director
-
'ఉన్నావ్' నువ్వు తోడుగా
‘ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయండి’ అని నినదిస్తోంది మహిళాలోకం. ‘ఇలాంటి మృగాలు సమాజంలో బతకకూడదు’ అని కుల్దీప్ దిష్టిబొమ్మను తగులబెడుతోంది యువత. ‘న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అంటున్నాయి బాధితురాలి ఉచ్వాసనిశ్వాసలు. ఇలాంటప్పుడే... సరిగ్గా ఇలాంటప్పుడే... దుష్టశిక్షణ... శిష్ట రక్షణ కోసం ఒకరు రావాలి. అలా వచ్చినవారే... సీబీఐ జాయింట్ డైరెక్టర్సంపత్ మీనా. సంపత్ మీనా లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడామె దేశాన్ని కుదిపేసిన ‘ఉన్నావ్’ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు చేపట్టి 45 రోజుల్లో పూర్తి చేయవలసిందిగా సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి కేసును సమర్థంగా దర్యాప్తు చేయగలిగిన అధికారి కోసం దృష్టి సారించిన సీబీఐకి సంపత్ మీనా అయితేనే కేసుకు న్యాయం జరుగుతుందనే భరోసా కలిగింది. ఫలితంగా ఉన్నావ్ కేçసును ఆమె చేతుల్లో పెట్టింది. సంపత్ మీనా కేసు దర్యాప్తు బాధ్యత చేపట్టడంతో న్యాయపోరాటం చేస్తున్న బాధిత యువతికి అధికారం, సమర్థత కలిగిన మహిళ ఆసరాగా వచ్చినట్లైంది. ఉన్నావ్ ఘటనతో ఏడాదికి పైగా నిరసనలు, ర్యాలీలతో అట్టుడిగిన దేశం ఇప్పుడు ‘హమ్మయ్య... బాధితురాలికి న్యాయం జరగబోతోంది’ అని ఊపిరి పీల్చుకుంటోంది. దేశ ప్రజలు ఆమెను సినిమాలో సీబీఐ ఆఫీసర్‌ను తెర మీద చూసినట్లు చూస్తున్నారు. కొన్ని సాహసోపేతమైన సంఘటనలు, మరికొన్ని సవాళ్లతో చట్టాన్ని పరిరక్షిస్తుందనే దృఢ నమ్మకం వారిది. సంపత్ మీనా మీద అంత నమ్మకాన్ని పెట్టుకోవడానికి కారణం గతంలో ఆమె సాధించిన విజయాలే. కుల్దీప్ సింగ్ సెంగార్ దిష్టిబొమ్మను తగల బెడుతున్న యువత ఆపరేషన్ ముస్కాన్ సంపత్ మీనా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్. హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఆఫీసర్. జార్ఖండ్ రాజధాని రాంచితోపాటు ధన్‌బాద్, జమ్తారా, ధమ్కా, దేవ్‌ఘర్, పాకుర్ జిల్లాల్లో ఎస్పీగా తన మార్కు చూపించారామె. చోటా నాగ్‌పూర్‌లో డీఐజీగా క్రియాశీలకంగా పనిచేశారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అనే కాన్సెప్ట్ ఆమె మానస పుత్రిక. జార్ఖండ్‌లోనే ఆమె ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు సంపత్ మీనా. తప్పిపోయిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, అక్రమ రవాణా కారణంగా తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను వెతికి పట్టుకుని, వాళ్లను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే కార్యక్రమం అది. ముస్కాన్ అంటే చిరునవ్వు. తల్లిదండ్రులకు దూరమయ్యి, నవ్వును మర్చిపోయిన బాల్యంలో తిరిగి నవ్వులు పూయించే కార్యక్రమం. ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో ఒక్క జార్ఖండ్‌లోనే ఏడు వందల మందికి పైగా పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు సంపత్మీనా. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని పిల్లలకు ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో వసతి కల్పిస్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఐజీగా సంపత్మీనా పర్యవేక్షణలో ఆపరేషన్ ముస్కాన్ దేశవ్యాప్తంగా ఆశించిన ఫలితాలనిచ్చింది. లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్కంటే ముందు ఆమె న్యూఢిల్లీలో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరోలో ఐజీ(ఇన్స్పెక్టర్ జనరల్). అప్పుడు కూడా పిల్లల అక్రమ రవాణా కేసులను ఛేదించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆమెకు మహిళల సమస్యలు, మానవ హక్కుల కోసం ఆమె ప్రత్యేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. జార్ఖండ్ రాజధాని రాంచిలో ‘సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్’ అయిన తొలి మహిళ సంపత్ మీనా. సీఐడీ ఐజీగా, రైల్వేస్ ఐజీగా కూడా మంచి సేవలందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థంగా పని చేశారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు న్యాయరక్షణే లక్ష్యంగా సాగాలంటే సంపత్ మీనా వల్లనే సాధ్యమవుతుందని నమ్మకం కలగడానికి ఇవన్నీ కారణాలే. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం కోసం గళమెత్తిన మహిళలు బెస్ట్ పోలీస్ సంపత్ మీనా విశిష్ట సేవలకు గాను ‘2008 చీఫ్ మినిస్టర్ మెడల్’, 2013 రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు. పోలీస్ ట్రైనింగ్‌లో కూడా పై అధికారులకు సంపత్ మీనా ప్రత్యేకమైన పోలీస్ అధికారి అవుతుందనే నమ్మకం కలిగేది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో బెస్ట్ అథ్లెట్స్ ట్రోఫీ అందుకున్నారు. ఇటలీలో పోలీస్ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేశారామె. సీనియర్ లెవెల్ ప్రోగ్రామ్‌లో అమెరికాలో శిక్షణ పొందారు. రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా, పక్షపాతరహితంగా దర్యాప్తు జరగాలంటే సంపత్ మీనా ఒక్కరే బెస్ట్ అని ఇప్పుడు దేశమంతా నమ్ముతోంది. ‘ఉన్నావ్’ బాధితురాలికి న్యాయం జరగాలంటే సంపత్ మీనా లాంటి ఆఫీసరే అండగా నిలవాలని న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కరడు గట్టిన మృగాహంకారి కుల్దీప్ సింగ్ సెంగార్‌కు, అతడి బృందానికి గుణపాఠం చెప్పగలిగిన పోలీస్ ఆఫీసర్ సంపత్ మీనా. కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ పట్టణంలో నివసిస్తుండేవాడు. ఉన్నావ్ పట్టణం జిల్లా కేంద్రం కూడా. అతడు మొదట 2002లో ఉన్నావ్ నియోజకవర్గం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. తర్వాత 2007, 2014 లలో సమాజ్‌వాది పార్టీ తరఫున బంగేర్‌మావ్, భగవంత్ నగర్ల నుంచి గెలిచాడు. ఆ తర్వాత 2017 నాటికి బిజెపిలో చేరి బంగేర్‌మావ్ నుంచి గెలిచాడు. ఉద్యోగం కోసం వెళ్లిన పదిహేడేళ్ల అమ్మాయి మీద లైంగిక అఘాయిత్యానికి పాల్పడి ఇప్పుడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. మౌనసాక్షి... ఉన్నావ్ ఈ ఏడాది జూలై నెల 28వ తేదీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ నుంచి ఒక కారు రాయ్‌బరేలీ వైపు వెళ్తోంది. రాయ్‌బరేలీకి చేరేలోపే ఒక ట్రక్కు భూతంగా వచ్చి కారుకు గుద్దింది. చూడడానికది ఊహించని ప్రమాదంగానే కనిపిస్తోంది, కానీ నిజానికి అది వ్యూహాత్మక ప్రమాదం. కారులో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా బతికి బట్టకట్టకూడదనేటంత క్రౌర్యంతో పన్నిన పన్నాగం. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మహిళల ప్రాణాలు పోయాయి. ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఓ మగ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డారు. అంతకంటే ముందు... గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉన్నావ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, బంగేర్‌మావ్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ప్రశ్నించిన తర్వాత అతడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారం రోజులు జుడీషియల్కస్టడీని విధించింది అలహాబాద్ హైకోర్టు.అంతకు ముందు కూతురికి జరిగిన అన్యాయం మీద న్యాయపోరాటం చేస్తున్న ఓ తండ్రిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీ విధించడమైంది. తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేని అతడి కూతురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మత్యాగానికి సిద్ధమైంది. ఇంత భావోద్వేగాలతో అట్టుడిగిపోతున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ తండ్రిని చనిపోయేవరకు చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. కూతురి కోసం తండ్రి న్యాయ పోరాటం ఒకవైపు, తండ్రి ప్రాణాలు కాపాడ్డం కోసం కూతురి ఆవేదన పోరాటం మరో వైపు. ఇంత హృదయవిదారకమైన పరిస్థితికి దారి తీసిన దురాగతం 2017, జూన్ నాలుగవ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజు ఉన్నావ్‌లోని కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి ఉద్యోగం ఇప్పించమని వెళ్లింది ఓ పదిహేడేళ్ల అమ్మాయి. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ మృగాహంకారానికి బలయింది. మైనారిటీ తీరని అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన కుల్దీప్ సింగ్‌ను పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడతడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. అతడి కేసు విచారణకు వస్తే శిక్ష పడడం ఖాయమని తెలిసిన కుల్దీప్... అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులను చేయడానికి తెగపడ్డాడు. బాధితురాలి తండ్రిని జైల్లో చిత్రహింసలకు గురి చేసి చంపించాడు. తండ్రి పోయిన తర్వాత కూడా బాధితురాలు న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో గుద్దించి హత్యాప్రయత్నం చేశాడు కుల్దీప్. ఆ ప్రమాదంలో గాయపడిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఆమె లాయరు (జూలై 31వ తేదీన) తమకు రక్షణ కల్పించి, కేసును విచారించి తగు న్యాయం చేయవలసిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు ఉత్తరం రాశారు. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ కేసును సత్వరమే విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనాకు బాధ్యతలకు అప్పగించింది.– వాకా మంజులారెడ్డి -
'లాలూ పెద్ద నటుడు.. నన్ను ముప్పుతిప్పలు'
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద నటుడని దాణా కుంభకోణం కేసును విచారించిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉపెన్ విశ్వాస్ చెప్పారు. ఆయన నాటకాలు ఎవరూ కనిపెట్టలేరని చెప్పారు. కేసు విచారణ సమయంలో తనను ఆయన ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది ఇంటి వద్దే ఉంటున్న ఉపెన్ విశ్వాస్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు తెలిపారు. లాలూ కేసు విషయంలో వచ్చిన ఒత్తిడిలను తట్టుకోలేక చివరకు తాను బౌద్ధమతం స్వీకరించినట్లు తెలిపారు. మొట్టమొదటిసారి లాలూ కేసు విచారణ చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే బిహార్ సీఎస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అయితే, మాట్లాడింది మాత్రం లాలూనే అని చెప్పారు. ఈ కేసు విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించాలని, తన ఇమేజ్‌కు దెబ్బతగలకుండా ఉండాలని లాలూ కోరినట్లు కూడా ఆయన వివరించారు. తాను అగ్ర కులస్తుడిని కాదని సానుభూతి పొందే యత్నం కూడా చేశారన్నారు. ముఖ్యంగా విచారణ సమయంలో తనను పట్నాలో విచారించాలని, తర్వాత ఢిల్లీలో అని, కోల్‌కతాలో అని ఇలా రకరకాలుగా ఇబ్బందుల పెట్టారని చెప్పారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్వంటి నేతలు మాత్రమే కాకుండా ఆఖరికి సీబీఐ డైరెక్టర్ నుంచి కూడా ఒత్తిడిలు వచ్చాయని, ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తన వంతు బాధ్యతగా విచారణ పూర్తి చేశానని, ఆఖరికి అరెస్టు చేసేందుకు అనుమతి కోరితే తమ పైఅధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని, కనీసం ఆరోజు ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. ఓ న్యాయకోవిధుడి సలహా తీసుకొని మిలిటరీ అధికారుల సహాయంతో ఆయనను అరెస్టు చేద్దామనుకున్నానని, అయినా వారు కూడా అందుకు అంగీకరించలేదని, చివరకు తనకు పై అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయని చెప్పారు. దాంతో తనను ఆ కేసులో నుంచి తప్పించాలనుకుంటున్నారని అర్ధమైందని, కేసు విచారణ పూర్తి చేసి సీబీఐకి అప్పగించానని తెలిపారు. -
సీబీఐ జేడీగా అర్చన నియామకం అక్రమం
తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు కేంద్రం నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది న్యూఢిల్లీ: సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరాన్ని నియమించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ప్రాథమిక ఆధారాలను అనుసరించి ఆమె నియామకం అక్రమం, చట్టవిరుద్ధమని శుక్రవారం తేల్చిచెప్పింది. ఆమె పేరును సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించకపోయినా ఎలా నియమించారంటూ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. ఒకసారి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని అమలుచేయాలని కేంద్రానికి చెప్పింది. అదే న్యాయమని, దానిని పాటించాలని పేర్కొంది. కేంద్ర నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని, సీబీఐ నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం తెలిపింది. ఎస్పీ ఆపై ర్యాంకుల నియామకాలకు సంబంధించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఆమె నియామకాన్ని చేపట్టారనేది పిటిషనర్ అందించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి అవగతమవుతోందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వరకు అదనపు డెరైక్టర్‌గా ఆమెను విధుల్లో చేరకుండా నిరోధించాలని సీబీఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14కు వాయిదావేసింది. అర్చన నియామకం ఏకపక్షం గా తీసుకున్న నిర్ణయమని, గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును విస్మరించారని జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పైఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్.. ఎంపిక కమిటీ కొంతమందితో కూడిన ప్యానల్ పేర్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కపేరే ఇచ్చిందని తెలిపారు. ఆమె నియామక పత్రాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా, 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనా సుందరం సీబీఐ డీఐజీగా విధులు నిర్వహించారు. తర్వాత తొలి మహిళా జాయింట్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అయితే విధుల్లో చేరిన రోజే తమిళనాడు ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.