breaking news
Cavery Water Distribution
-
కావేరీ నీటి వాటా: కర్ణాటక నిర్ణయాన్ని ఖండించిన సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటా విడుదలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ ఖండించారు. ఆయన మంగళవారం కావేరీ జలాల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని తప్పుపట్టారు.‘కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటాను విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని కోరుతున్నాం’ అని తెలిపారు.ఇక.. కర్ణాటక ప్రభుత్వం కేవలం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్లీ కావేరీ జలాల వివాదం తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది.నిన్న(సోమవారం) కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం అనంతరం తమిళనాడు కావేరీ నీటి పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘మేము ప్రతిరోజు ఒక టీఎంసీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయలేం. కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు. -
నీళ్లా.. కన్నీళ్లా?
♦ కావేరిపై పాత ఒప్పందాలు చెల్లవు ♦ తమిళనాడు వాటా ప్రశ్నేలేదు ♦ సుప్రీం కోర్టులో కర్ణాటక వాదన ♦ 15 రోజులపాటూ తుది విచారణ ♦ రైతన్నల్లో ఆందోళన కావేరి జలాల పంపిణీపై సుమారు వందేళ్ల క్రితం జరిగిన ఒప్పందాలు తమను కట్టడి చేయలేవని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. తమిళనాడుకు వాటా జలాల మాటే లేదని సుప్రీం కోర్టులో స్పష్టంచేసింది. కావేరి ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అప్పీలు పిటిషన్‌పై కర్ణాటక ప్రభుత్వం తన తుది వాదనను మంగళవారం ప్రారంభించింది. దీనిపై విచారణ 15 రోజులపాటూ ప్రతిరోజూ సాగుతుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : కావేరి జలాల వాటాకు సంబంధించి సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణపై తమిళనాడు రైతుల్లో ఆందోళన నెలకొంది. కావేరి నదీజలాల వాటా కేసులో ట్రిబ్యునల్ కోర్టు 2007లో తుది తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీలుచేశాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమిత్రాయ్, ఏఎమ్ కన్విల్గర్‌తో కూడిన బెంచ్ విచారణ ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 21వ తేదీ విచారణకు వచ్చినపుడు, కావేరికి సంబంధించిన అన్ని కేసులు, పిటిషన్లను జూలై 11వ తేదీ నుంచి 15 రోజులపాటూ మంగళ, బుధ, గురువారాల్లో తుది విచారణ జరపాలని, ఈ 15 రోజుల్లో పిటిషన్‌దారులంతా తమ వాదనను పూర్తిచేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అంతేగాక ఈ కేసులో తుది తీర్పు వెలువడేవరకు సెకనుకు రెండువేల ఘనపుటడుగుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తుదిదశ విచారణ ఈనెల 11వ తేదీన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రారంభం కాగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల న్యాయవాదులు హాజరయ్యారు. కర్ణాటక న్యాయవాదులు తమ వాదనలో.. ‘‘కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అస్థిరమైనది, చట్టానికి వ్యతిరేకమైనది. 1882, 1924లో మైసూరు, మద్రాసు రాష్ట్రాలకు మధ్య జరిగిన ఒప్పందాన్ని కావేరి నది వాటా జలాలతో ముడిపెట్టేందుకు వీలులేదు. అప్పటి మద్రాసుతో చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పటి మైసూరుపై ప్రయోగించేందుకు వీలులేదు. అలాగే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 తరువాత అంతకు ముందు చేసుకున్న ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకు వీలులేదు. 1956లో కర్ణాటక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత గతంలో చేసుకున్న ఒప్పందాలపై కర్ణాటకను ఏమాత్రం కట్టుబాటు చేయలేరు. ఆయా కారణాల వల్ల సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కేవలం సుప్రీంకోర్టు అభిప్రాయంగానే పరిగణిస్తున్నాం. ట్రిబ్యునల్ సైతం ఇదే విషయాన్ని తన తీర్పులో స్పష్టం చేసింది’’అని కర్ణాటక న్యాయవాదులు తమ వాదనలో పేర్కొన్నారు. తమిళ రైతుల్లో ఆందోళన కావేరి వాటా జలాలపై ఆశలు పెట్టుకున్న తమిళనాడు రైతులకు కర్ణాటక ప్రభుత్వ వాదనతో న్యాయం చేకూరేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. 15 రోజుల్లో తుది విచారణ పూర్తయిన తరువాత వెంటనే తీర్పు వెలువడేనా, ఈ తీర్పు తమిళనాడుకు అనుకూలమా, ప్రతికూలమా అనే మీమాంస రాష్ట్రంలో నెలకొంది.