cash crisis
-
తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణంలో ఒక్కోఖాతాదారుడిదీ ఒక్కోదీన గాధ. పండుగ సందర్భంలో కుటుంబాలతో సంతోషంగా ఎలా గడపాలంటూ బాధిత ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల కుంభకోణం వెలుగు చూడటంతో ఆర్బీఐ పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెయ్యి రూపాయలకు మించి ఏ ఖాతాదారుడు నగదు తీసుకోవడానికి వీల్లేదని పరిమితులు విధించింది. ఆ తరువాత బాధితుల ఆందోళనతో ఈ లిమిట్‌ను 25వేలకు పెంచింది. అయినప్పటికీ ఉన్నట్టుండీ తమ ఖాతాల్లోని నగదు స్తంభించిపోవడంతో... కూతురి పెళ్లి ఎలా అని, అమ్మాయి ఫీజు ఎలా కట్టాలి, అమ్మా నాన్న, వైద్య ఖర్చులు..ఇలా ఒక్కొక్కరూ వర్ణించనలవి కాని ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళనకు దిగారు. తాజాగా ముంబైలోని బీజేపీ కార్యాలయం ముందు వందలాదిమంది నిరసనకు దిగారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు మీడియా సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆందోళనకారులు ఆమెను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని ను కోరారు. ప్రధానంగా టీవీ నటి నూపుర్ అలంకార్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిజంగా సినిమా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. అమ్మ ఆక్సిజన్‌పై చావుబతుకులమధ్య ఉన్నారు. మామగారు ఈ మధ్యనే ఆపరేషన్ అయింది.. దానికి సంబంధించిన బకాయిలు కట్టాల్సి వుందని నూపుర్ మీడియాతో వాపోయారు. తన ఖాతా స్థంభించిపోవడంతో నగలు అమ్మాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే.. ఇక ఇంట్లో వస్తువుల్ని కూడా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పీఎంపీ కుంభకోణం వ్యవహారంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థికమంత్రిగా తానేమీ చేయలేననీ, రెగ్యలేటరీ అయిన ఆర్బీఐ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. అయితే ఖాతాదారులు, ఆందోళనను అర్థం చేసుకోగలమని, వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్‌ను కోరనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ (గురువారం) సాయంత్రం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. అలాగే పరిస్థితిపై వివరంగా అధ్యయనం చేయమని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కోరాననీ, ఇందులో ఆర్బిఐ ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. అంతేకాదు అవసరమైతే, సంబంధిత చట్టాలను సవరించాల్సిన మార్గాలను అన్వేషించమని ఆదేశించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. TV Actor Nupur Alankar on PMC Bank collapse:My mother is on oxygen&father-in-law underwent a surgery recently. I had to plead&borrow from people.Our accounts are frozen&payment cards aren't working.I had to sell my jewellery.If it is not sorted, I'll have to sell household items. pic.twitter.com/LDDAxq8jhJ — ANI (@ANI) October 10, 2019 -
బ్యాంకు అధికారులపై అల్లరిమూకల దాడి
-
బ్యాంకు అధికారులను చితక్కొట్టారు
అలహాబాద్ : బ్యాంకు అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలహాబాద్ బ్యాంకు శాఖ బయట రోడ్డుపైనే అధికారులు, ప్రజలు ఒక్కరినొక్కరూ కుమ్ములాడుకున్నారు. ఇద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులను తీవ్రంగా చితక్కొట్టారు. డబ్బులు ఇవ్వకుండా పదేపదే తిప్పించుకుంటున్నారని ఆగ్రహంతో ప్రజలు మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వాగ్వాద వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పాత నోట్లు రద్దైన దగ్గర్నుంచి ప్రజలు బ్యాంకుల ఎదుటే రోజుల తరబడి వేచిచూడటం, తీరా తమవద్దకు వచ్చే సరికి బ్యాంకుల్లో నగదు అయిపోయినట్టు అధికారులు చెప్పడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. గంటల కొద్దీ నిరీక్షణకు ఫలితం దక్కకపోవడంతో ప్రజలు బ్యాంకు అధికారులపై దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాల్దా శాఖను ప్రజలు ధ్వంసం చేశారు. అక్కడక్కడా బ్యాంకు శాఖ వద్ద ప్రజలు నిరసనలకు కూడా దిగుతున్నారు. -
వెనిజులాలో ‘నోట్ల’ కష్టాలు మనకన్నా దారుణం
కారకాస్: మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టయింది వెనిజులా ప్రజల పరిస్థితి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక బిడ్డలను సైతం వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు నికోలస్ మడురో వంద బోలివర్ నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం వారి బతుకులను మరింత అగాతంలో పడేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా వంద బోలివర్ నోట్లను కొత్త కరెన్సీతో మార్చుకోవాలని దేశాధ్యక్షుడు గడువు విధించినా శుక్రవారం నాటికి కూడా కొత్త కరెన్సీ మెజారిటీ బ్యాంకులకు చేరుకోలేదు. పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక తినడానికి తిండిలేక అలమటిస్తున్నామని బ్యాంకుల ముందు చాంతాడంతా క్యూల్లో నిలబడిన పేదలు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. కొన్ని ఏటీఎంలలో ఇప్పటికీ కూడా పాత వంద నోట్లే వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో వంద బోలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు గత ఆదివారం నాడు దేశాధ్యక్షుడు నికోలస్ హఠాత్తుగా రేడియోలో ప్రకటించారు. గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు 500 నుంచి 20,000 బోలివర్ నోట్లు ఆరు డినామినేషన్లలో చేరుకుంటాయని, అప్పటి నుంచి 72 గంటల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని గడువు విధించారు. బుధవారం రాత్రి నుంచే బ్యాంకుల ముందు క్యూలు కట్టినా దేశంలోని చాలా బ్యాంకులకు డబ్బులురాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కరెన్సీ ముద్రణా సంస్థలు కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ‘నా ఆరేళ్ల పాపను సాదుకునేందుకు ఎవరికైనా ఇచ్చేస్తాను. గత అక్టోబర్‌లోనే మా పక్కింటి వాళ్లను అడిగాం. వారికి కుదరదని చెప్పారు. మా మామకు వచ్చే ఆరు డాలర్లకు సమానమైన పింఛనుపై పాపతో సహా నలుగురం బతుకుతున్నాం. కష్టమవుతోంది. మా దగ్గరుండి ఆకలితో చనిపోవడమో లేదా వ్యభిచారిగా మారడమో కాకుండా కాస్త డబ్బున్నవాళ్లు పెంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నాం’ అని 43 ఏళ్ల నిరుద్యోగ మహిళ జులే పుల్గర్ వాపోయారు. ఇప్పుడు ఇలాంటి వాళ్లు వెనిజులాలో ఎందరో ఉన్నారు. ఇలా రోజుకు తమ పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిందిగా డజనుకుపైగా తల్లిదండ్రులు తమ సంస్థ వద్దకు వస్తున్నారని కరిరుబానా అనే సాంఘిక సేవా సంస్థ తెలియజేసింది. మరికొంత మంది తల్లిదండ్రులు తమను సంప్రతించకుండానే తెల్లవారక ముందే తమ కార్యాలయం ముందు పిల్లలను వదిలేసి వెళుతున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో కొంత మంది పేద తల్లులు తమ పిల్లలను వదిలేసి వెళుతున్నారని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. భారత్‌లోలాగా వెనిజులా కూడా బ్యాంక్ ఖాతాలుండే వారు చాలా తక్కువ. వ్యాపార వర్గాల మధ్య కూడా ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. చమురు విలువలు అపారంగా ఉన్న దేశంలో కూడా నోట్ల కష్టాలు తప్పడం లేదు. -
ఆస్పత్రుల పెద్దమనసు
పాత నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు గానీ, వంద రూపాయల నోట్లు గానీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రోగులు, వాళ్ల బంధువులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కోల్‌కతా ఆస్పత్రులు పెద్దమనసు చేసుకున్నాయి. బిల్లులు చెల్లించేందుకు చెక్కులు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను కూడా తాము ఆమోదిస్తామని ప్రకటించాయి. అత్యవసర కేసుల విషయంలో అయితే.. తర్వాత చెల్లిస్తామన్న ఒప్పందం మీద కూడా కొన్ని ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నారు. నగరంలోని చాలావరకు ఆస్పత్రులలో చెక్కులను కూడా ఆమోదిస్తున్నారు. స్థానికులతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి వచ్చిన రోగుల వద్ద కూడా చెక్కులు తీసుకుంటున్నారు. రోగులకు చికిత్స అందించడం తమ బాధ్యత అని, అందుకే పేషెంట్లు తమను సంప్రదించేందుకు వీలుగా ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటుచేశామని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైస్ చైర్మన్, కార్డియాక్ సర్జన్ డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. మరీ అత్యవసరమైతే రోగుల నుంచి తర్వాత చెల్లిస్తామన్న అండర్‌టేకింగ్ కూడా తీసుకుంటున్నామన్నారు. స్థానిక గ్యారంటర్ ఒకరిని తీసుకురావాలని బయటి వారికి చెబుతున్నామన్నారు. తమ ఆస్పత్రిలో చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ఏఎంఆర్ఐ గ్రూపు ఆస్పత్రుల సీఈఓ రూపక్ బారువా తెలిపారు. ఆపరేషన్లు ఉంటే దానికి రెండు మూడు రోజుల ముందే చెక్కులు అడుగుతున్నామని, దానివల్ల ఆ సమయానికి చెక్కు చెల్లిందో లేదో తెలిసిపోతుందని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రజలకు వీలైనంతగా సాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులన్నీ ప్రయత్నిస్తున్నాయని నారాయణ హెల్త్ నెట్వర్క్ జోనల్ డైరెక్టర్ ఆర్. వెంకటేశ్ తెలిపారు. అపోలో ఆస్పత్రులలో కూడా చెక్కులు అంగీకరిస్తున్నారు. చాలావరకు పేషెంట్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనే చెల్లింపులు చేస్తున్నందున పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, అవి లేనివాళ్లు చెక్కులు ఇస్తామన్నా తాము సరేనంటున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.