కబ్జాదారుల జాబితా విడుదల చేస్తాం
బెంగళూరు (బనశంకరి): నగరంలో రాజ కాలువలు, బఫర్‌జోన్ ఆక్రమణకు పాల్పడిన వారి పేర్లను విడుదల చేస్తామని నగర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ఆర్.రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిజమైన అక్రమణదారులను రక్షిస్తూ మధ్యతరగతి, పేద వర్గానికి చెందిన వారిని బలి చేస్తోందని, దీంతో తాము రాజకాలువలు ఆక్రమించిన నేతలు, అధికారుల పేర్లను త్వరలో విడుదల చేయాలని తీర్మానించామన్నారు.
ఇప్పటికే 2300 మందికి పైగా బిల్డర్ల జాబితాను సిద్ధం చేశామని, ఇలాంటి బిల్డర్లకు కొందరు రాజకీయ నేతల అండ ఉందన్నారు. మరికొందరు బీబీఎంపీ అధికారులు బిల్డర్లతో చేతులు కలిపి అక్రమాలు బయటకు రాకుండా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమణ దారుల పేర్లను వెబ్సైట్లో ప్రకటిస్తామని సీఎం. సిద్దరామయ్య తెలిపారని, అయితే వెబ్సైట్లో ప్రకటించిన వ్యక్తులు అమాయకులైతే ప్రయోజనంలేదన్నారు. తాము ఇక మూడు రోజులు వేచి చూస్తామని నిజమైన కబ్జాదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించకపోతే బుధవారం తామే అక్రమణదారుల బండారం బయట పెడతామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.