breaking news
briliant
-
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
Viral Video: హనుమాన్ సాంగ్ అద్భుతంగా పాడిన 4 ఏళ్ల చిన్నారి..!
-
యువెల్డన్
తగరపువలస : పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత తొత్తడి యువల్కు అతికినట్టు సరిపోతుంది. ఆరేళ్ల ఎనిమిది నెలల వయసు గల యువల్ శంకరమఠం వద్ద శ్రీకష్ణ విద్యామందిర్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. రామాయణ, మహాభారతాలలో పాత్రల పేర్లు అతడికి కొట్టిన పిండి. అంతేనా జనరల్ నాలెడ్జ్‌లో కూడా పోటీపరీక్షల విద్యార్థులకు దీటుగా సమాధానాలు చెప్పగలుగుతున్నాడు. స్థానిక గీతా ప్రచార సమితి మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో యువల్ ప్రతిభ ప్రదర్శించాడు. ఏడు నిమషాలలో మహాభారతం నుంచి తయారు చేసిన 110 ప్రశ్నలకు గుక్కతిప్పుకోకుండా సమాధానాలిచ్చాడు. వెనువెంటనే మూడు నిముషాల వ్యవధిలో రామాయణంలోని 50 ప్రశ్నాలకు జవాబు చెప్పాడు. ఇక జనరల్ నాలెడ్జ్‌లో అయితే ప్రపంచ దేశాల్లో రాజధానులు, కరెన్సీలు, మంత్రులు, ఓడరేవులు, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొని నిర్వాహకులను అబ్బురపరిచాడు. కేవలం రెండు మాసాల్లోనే ఈ ఘనత.. గత వేసవి సెలవులలో యువల్ టీవీకి అతుక్కుపోకుండా ఉండేందుకు బీఎస్సీ,బీఈడీ పూర్తిచేసిన తల్లి దుర్గ ఆలోచనే పురాణ,ఇతిహాసాలపై యువల్కు ఆసక్తి పెంపొందించగలిగింది. చిన్నపిల్లలకు ఇష్టమైన కార్టూన్ నెట్వర్క్, యానిమేషన్ చిత్రాల ద్వారా వీటిపై అవగాహన కలిగించగలిగింది. ప్రశ్నల రూపంలోనే కాకుండా కథల రూపంలో కూడా రామాయణ,మహాభారతాలను వివరించగలిగింది. దీంతో పాటు ప్రస్తుతం సాయంత్రం వేళల్లో కొంతసమయం జనరల్ నాలెడ్జ్ కోసం కేటాయించడం ద్వారా యువల్ బాలమేధావిగా పలువురి మన్ననలు పొందగలుగుతున్నాడు. యువల్ ప్రతిభను పరీక్షించిన గీతాప్రచారసమితి అధ్యక్షుడు సీహెచ్.అప్పలనాయుడు, ఉపాధ్యాయులు పోతిన సత్యనారాయణ, యాగాటి వెంకటరమణ, ఆర్యవైశ్య మహిళ అధ్యక్షురాలు పలివెల లలిత తదితరులు యువల్ను, అతని తల్లిదండ్రులు శివస్మరణ్,దుర్గలను అభినందించారు. ఇండియన్ బుక్ రికార్డ్స్‌కు.. యువల్లో ప్రతిభను నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఇండియన్ బుక్ రికార్డ్స్, తెలుగు బుక్ రికార్డ్స్‌కు వీడియోలు పంపించారు. త్వరలో వీటిలో యువల్ పేరు నమోదయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.