పారిపోండ్రోయ్..!!
ఇస్లామాబాద్: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్ స్థావరం మీదా భారత్ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరాతీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది.