పోలీసు బాస్‌లను వీపునేసుకొని ఉప్పు బస్తాట
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో పోలీసులకు పోలీసులే చుక్కలు చూపిస్తున్నారు. ఫిట్ నెస్ పరీక్షల పేరిట వారికి విచిత్ర పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని చూస్తూ కొందరు పోలీసులు నవ్వుకుంటుంటే మరికొందరు ఇవేం పరీక్షలు బాబూ అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొందరైతే, ఉద్యోగానికి ముందు పరీక్షల్లో నెగ్గాంగానీ ఇలాంటి పరీక్షల్లో ఎలా నెగ్గాలా అని మదనపడిపోతున్నారు.
డిపార్ట్ మెంటల్ శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్‌లోని కొందరు పోలీసు కానిస్టేబుల్లను రుద్రాపూర్ పోలీస్ గ్రౌండ్స్‌కు రప్పించారు. అనంతరం వారందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరినీ.. బరువులు తూచే వెయింగ్ మిషన్ ఎక్కించారు. ఆ తర్వాత గ్రౌండ్లో ఓ సర్కిల్ చుట్టూ రౌండ్లు కొట్టించారు. అది సింగిల్ గా కాదండోయ్.. ఓ పోలీసు ఉన్నతాధికారిని తన వీపుపై ఎక్కించుకొని ఉప్పుబస్తాట ఆడినట్లుగా ఎత్తుకొని గ్రౌండ్ చుట్టూ పరుగెత్తి రావాలి.. ఈ పరీక్షలకు హాజరైన పోలీసులు పైకి మాత్రం ఉన్నతాధికారుల ముందు తమ చిరాకును వెళ్లగక్కలేక ముఖాన నవ్వులు పూయిస్తున్నా.. లోపల మాత్రం తెగ బాధపడిపోతున్నారట.