breaking news
biranpally
-
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
96 శవాల చుట్టు మహిళలతో బతుకమ్మ
దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బానిస సంకెళ్లతో మగ్గిపోయారు. అప్పటి నిజాం హయాంలోని రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం భయంగా బతికారు. ఈ బానిస బతుకుల విముక్తి కోసం కొనసాగిన మహత్తర రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ విమోచనోద్యమానికి పురుడుపోసిన నేలగా ఉమ్మడి మెదక్ జిల్లా నిలిచింది. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట తదితర గ్రామాల్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న లొంగుబాటు ప్రకటన చేశాడు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... మద్దూరు(హుస్నాబాద్) : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా కూడా తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం రజాకార్ల ఆగడలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా బైరాన్‌పల్లి కీర్తి గడించిన ఘనత దక్కించుకుంది. అంతే కాదు రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. ముస్లింలు అధికంగా ఉన్న మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాలు కీలక పాత్ర పోషించాయి. (రంగు మారిన పవన్ రాజకీయం) గ్రామ రక్షక దళాలు రజాకార్ల అరచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డాయి. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల్లో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పికొట్టేవి. దీంతో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసిదొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగులబెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడ్డి, మురళీధర్‌రావు, ముకుందర్ రెడ్డి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు.అంతే కాకుండా లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నారు. (అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని) కూటిగల్‌పై దాడి బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సఆయ సహకారులు అందించడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వాత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుకొచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైసాచిక ఆనందం పొందారు. ఊరంతా దిగ్బంధం బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు ఆగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడుసార్లు దాడులు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుంచి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2గంటల ప్రాంతంలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజాము 3గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామగ్రితో 12వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకెళ్లారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తూ రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దీంతో బురుజుపై ఉన్న కాపలదారుడు నగార మోగించారు. దీంతో రజాకార్లు కాల్పులు ప్రారంభించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీంతో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఇలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96 మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు. శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు బురుజు వద్ద అనేక మందిని పట్టుకొని చంపుతుంటే భయంతో పరుగులు పెడుతున్న మహిళలను వివస్త్రలను చేసి శవాల చుట్టూ బతుకమ్మ ఆట ఆడించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు మహిళలు పారి పోతుంటే పట్టుకొని అత్యాచారం చేశారు. మహిళలు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. –ఓజమ్మ స్వాతంత్య్ర సమరయోధురాలు, బైరాన్‌పల్లి లెంకలు కట్టి చంపినారు బైరాన్‌పల్లిలో దాడి కొనసాగుతుండగానే కూటిగల్‌పై దాడి చేసి కొందరిని బంధీగా పట్టుకొని బురుజుపై ఉన్న వారికి కిందకు దింపి వాగు ఒడ్డుకు ఉన్న తూటల మర్ర వద్దకు తీసుకెళ్ళి లెంకలు కట్టి చంపారు. నా కాలుకు తూటా తగిలిని తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాను. –వంగపల్లి బాలయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, కూటిగల్ -
'బైరాన్‌పల్లి అమరవీరుల ఆశయాలు పూర్తి కాలేదు'
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్వామి పరిపూర్ణానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ... బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరిచి పోలేనిదని, అక్కడి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. వారి త్యాగాలను, ఆశయాలను వృధా పోనివ్వకుండా చూస్తామని తెలిపారు. అప్పటి నిజాం సేనలు బైరాన్‌పల్లిలో వందలమందిని కాల్చి చంపితే ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గు లేకుండా నిజాంను పొగుడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల సాధన కోసం బీజేపీ ఎప్పటికి పాటు పడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో కాషాయజెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉందని స్వామి పరిపూర్ణానంద వెల్లడించారు. ఒకేరోజులో 118మంది బైరాన్‌పల్లి వాసులను నిజాం రజాకార్లు బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేను యదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానంటే తనను రాష్ట్రం నుంచి బహిష్కరించిన కేసీఆర్‌ను సంవత్సరం తిరగకముందే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి బొమ్మలను బహిష్కరించారని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణలో పలుచోట్ల వడగళ్లవాన..
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని మద్దురు మండలం బైరాన్‌పల్లిలో వడగళ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లాలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మర్రిగూడ మండలం నర్సింహాపురంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో వాతావరణం చల్లబడినట్టుగా కనిపిస్తోంది. నగరంలో పలుచోట్ల ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.