breaking news
best country rankings
-
పనితీరులో సింగపూర్ టాప్
బెర్లిన్: అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికా ప్రభ మరింతగా దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. బ్రిటన్ను అత్యుత్తమ దేశంగా అక్కడ ప్రజలు అనుకుంటారేమో కానీ జర్మనీకి చెందిన వర్జ్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో టాప్ –10 దేశాల్లో బ్రిటన్కు చోటు లభించలేదు. అత్యంత సమర్థంగా పని చేస్తున్న దేశాల జాబితాలో ఫిన్లాండ్ వంటి దేశాల తర్వాత 13వ స్థానంలో బ్రిటన్ నిలిస్తే, అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానంలో ఉంది. నిఫ్తీ పొలిటికల్ టూల్ సాయంతో 173 దేశాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్, స్కూళ్లు, ఆస్పత్రులు, పోలీసులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. డాక్టర్ దగ్గర వేచి చూసే సమయం దగ్గర్నుంచి విద్యుత్ సదుపాయం వరకు ప్రతీ రంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక అత్యుత్తమ పని తీరు కనబరిచిన దేశంగా సింగపూర్ అగ్రభాగంలో ఉంటే లిబియా అట్టడుగున నిలిచింది. సింగపూర్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఎస్తోనియా అగ్రభాగంలో ఉన్నాయి. భారత్ 110వ స్థానంలో ఉంది. -
టాప్-5 నుంచి అమెరికా అవుట్
ప్రపంచాధినేతగా.. టాప్ దేశాల్లో తామే ముందంజలో ఉంటామంటూ ఊదరగొట్టే అమెరికాకు మరోసారి షాక్ తగిలింది. ఉత్తమ దేశాల జాబితా నుంచి మరో మూడు స్థానాలు కిందకు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాస్ వార్టన్ స్కూల్ , గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్స్ బీఏఈ కన్సల్టింగ్ భాగస్వామ్యంలో ''బెస్ట్ కంట్రీస్'' ర్యాంకింగ్స్ జాబితాను అమెరికా న్యూస్, వరల్డ్ రిపోర్టు మంగళవారం విడుదలచేసింది. ఈ రిపోర్టులో ఉత్తమ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అమెరికా మరో మూడు స్థానాలు పడిపోయి ఏడవ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. స్విట్జర్లాండ్ తర్వాత రెండో స్థానంలో కెనడా, మూడు స్థానం బ్రిటన్ నిలిచాయి. అయితే మొత్తంగా ఆస్ట్రేలియా కంటే అమెరికా ముందజంలోనే ఉన్నప్పటికీ, జపాన్, స్వీడన్, జర్మనీల కంటే వెనుకంజలోకి పడిపోయింది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయినట్టు 75 శాతం మంది రెస్పాడెంట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అమెరికాపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న 2016 ర్యాంకింగ్స్ నుంచి కూడా పడిపోయినట్టు వెల్లడించింది. వ్యాపారాలు, పౌరసత్వం, విద్య, పారదర్శకత, సాహస పర్యాటకంలో అమెరికా వెనుకంజలో పడినట్టు తెలిపింది. 90 శాతం అమెరికా వెలుపల సర్వేలో పాల్గొన్న వారు 2016 అమెరికా ఎన్నికలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని భావించామని, కానీ అనూహ్యంగా ట్రంప్ గెలిచినట్టు చెప్పారు. 21వేల మంది బిజినెస్ లీడర్లు, సాధారణ ప్రజానీకం, పలు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో పలు అంశాలపై వారి వద్ద నుంచి ఈ సర్వే అభిప్రాయాలు సేకరించింది.