breaking news
beef row
-
కన్ఫామ్: బీజేపీ కార్యకర్త తీసుకెళ్లింది బీఫ్
నాగ్‌పూర్: గోవు మాంసం (బీఫ్) తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తను స్థానికులు చితకబాదిన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్త సలీమ్ షాహ(34) తన వెంట తీసుకెళ్తున్నది బీఫ్ అని ఫోరెన్సిక్ పరీక్షలలో శనివారం తేలింది. ఈ విషయాన్ని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ శైలేష్ బాల్క్వాడే వెల్లడించారు. గత బుధవారం నాగ్‌పూర్‌లోని భార్‌సింగీలో బైక్‌పై వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు అడ్డగించి బీఫ్ ఎందుకు తీసుకెళ్తున్నావ్ అంటూ కొందరు చితకబాదారు. బీఫ్ కాదని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ వ్యక్తులు బీజేపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. సలీమ్ ఫిర్యాదు మేరకు అతడిపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు ఇదివరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్ద ఉన్న మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి టెస్ట్ చేయగా బీఫ్ అని తేలింది. చట్ట ప్రకారం గోమాంసంపై నిషేధం ఉన్నందున, ప్రస్తుతం చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త సలీమ్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శైలేష్ తెలిపారు. ఈ వివాదంపై నాగ్‌పూర్ రూరల్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ పొట్డార్ స్పందించారు. మా పార్టీ కార్యకర్త సలీమ్ బీఫ్ ను రవాణా చేస్తున్నాడని తెలిసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటారు. పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడే అవకాశం ఉందన్నారు. అయితే బీఫ్ కలిగిఉన్న వారిపై ఫిర్యాదు చేస్తే చాలని, ప్రజలు అనవసరంగా దాడులకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కేసుల్లో ఇరుక్కుంటారని పేర్కొన్నారు. -
అది బీఫ్ కాదు.. బర్రె మాంసం!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్ లో గోమాంసం వండివడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదంపై కేరళ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజీ థామస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ భవన్ క్యాంటీన్ లో ఆవు మాంసం వండటం లేదని, కేవలం బర్రె మాంసం మాత్రమే అందిస్తున్నామని వివరించారు. అనుమతి లేకుండా భవనంలోకి చొరబడి, ఆందోళసృష్టించిన శ్రీరామ్ సేన కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదుచేశామన్నారు. మరోవైపు క్యాంటీన్ అధికారులు మెనూ నుంచి బీఫ్ పదాన్ని తొలిగించారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కూడా ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని కేరళ భవన్ ఉద్యోగులు వచ్చే రెండుమూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వివాదం ఎలా మొదలైందంటే.. అన్ని రాష్ట్రాలకు ఉన్నట్లే కేరళకూ ఢిల్లీలో కేరళ భవన్ ఉంది. జంతర్ మంతర్ కు అతి సమీపంలో ఉండే ఈ భవన్ క్యాంటీన్ మెనూలో.. బీఫ్ కూడా ఉండటం వివాదానికి ప్రధాన కారణం. అన్ని ఆహార పదార్థాల పేర్లు ఇంగ్లీషులో ఉండి, ఒక్క బీఫ్ మాత్రం మలయాళంలో రాసి ఉండటం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ్ సేన సంస్థన కార్యకర్తలు.. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భవన్ క్యాంటీన్ లోకి చొరబడి బీఫ్ వండకూడదంటూ ఆందోళన చేశారు. భయాందోళనకు గురైన సిబ్బంది.. పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. ఆ తరువాత కొద్దిసేపటికే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి 20 మంది పోలీసులు కేరళ హౌస్ కు చేరుకున్నారు. అప్పుడే అసలు కథ మొదలైంది.. ఖాకీలు వచ్చేసరికే శ్రీరాంసేన కార్యకర్తలు పారిపోయారు. దాడి ఎలా జరిగిందో వివరాలు సేకరించిన పోలీసులు.. నేరుగా కిచెన్ లోకి వెళ్లి వంట పాత్రలను పరిశీలించారు! రాజకీయ దుమారం దాద్రి ఘటనలోనూ బీఫ్ వండారా లేదా అని పోలీసులు దర్యాప్తు చేసిన దరిమిలా ఢిల్లీ పోలీసుల తీరుపై పలు రాజకీయ పక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక అడుగు ముందుకేసి ఢిల్లీ పోలీసులు బీజేపీ సేనగా వ్యవహరిస్తున్నారని, ఒక రాష్ట్రానికి సంబంధించిన భవనంలోకి చొరబడే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఢిల్లీ పోలీసుల తీరున ఖండించారు. పార్టీలకు అతీతంగా కేరళ ఎంపీలందరూ ఈ రోజు సాయంత్రం భవన్ ముందు ఆందోళన నిర్వహించనున్నారు. 'ఇది సున్నితమైన అంశం కాబట్టే బీఫ్ వండారో లేదో తేల్చుకోవాలనుకున్నాం అందుకే వంట పాత్రలు పరిశీలించాం' అని పోలీస్ అధికారులు వివరన ఇచ్చుకున్నారు.