breaking news
Bandaru Shankar
-
మాదిగలను విస్మరించడం దారుణం
అనంతపురం న్యూటౌన్ : అధికారం రాగానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కృషి చేసి పెద్దమాదిగనవుతానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మాదిగలను విస్మరించడం దారుణమని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ విమర్శించారు. ఆదివారం నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంఈఎఫ్ (మాదిగ ఉద్యోగుల సమాఖ్య) కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంఈఎఫ్ నాయకులు డాక్టర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బండారు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకుందామని, ఉద్యమానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబరు 23 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సమాయత్త సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబరు 20న హైదరాబాదులో మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభకు మాదిగలందరూ కుటుంబ సమేతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు అమర్నాథ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, సాకే నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల వేధింపుపై ఎంఈఎఫ్ నిరసన
అనంతపురం రూరల్ : అనవసరంగా మాదిగ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తే సహించబోమని మాదిగ ఉద్యోగుల సమాఖ్య(ఎంఈఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ తెలిపారు. వేధింపులకు నిరసనగా ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన ఆమట్లాడుతూ అధికారుల వేధింపులకు హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పద్మరేఖను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నానా దుర్భాషలాడి వేరే ప్రాంతానికి పంపారన్నారు. అదే శాఖలో పనిచేస్తున్న హెల్త్‌ఎడ్యుకేటర్ రామలక్ష్మికి అనవసరంగా మెమో ఇచ్చారన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలిపెట్టిన డీఎంహెచ్ఓ కిందిస్థాయి ఉద్యోగులపై జులుం చేస్తున్నారని ఆరోపించారు. డీఈఓ మధుసూదన్‌రావు ఎంసీ నాగరాజు, బ్రహ్మయ్య, సుధాకర్ అనే ఉద్యోగులకు జీతపు బకాయిలను చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి మాట్లాడుతూ ఉద్యోగులపై వివక్ష సరికాదన్నారు. అన్ని వర్గాలను సమ న్యాయంతో చూడాలన్నారు. కులం పేరుతో ఎవరు దూషించినా దానిని పూర్తిగా వ్యతిరేకిస్తామన్నారు. ఎంఈఎఫ్ రాష్ట్ర నేతలు గంగాధర్, అమర్నాథ్ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ, డీఈఓ మాదిగ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు నిఘా ఉంచాలన్నారు. ఈ విషయాన్ని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం ఆర్డీఓ హుస్సేన్‌సాబ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయరామప్ప, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ తిరుపాల్, జగదీష్, తదితర ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ నరసింహులు పాల్గొన్నారు.