breaking news
baktha prahaladha
-
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
తొలి తెలుగు బాల నటుడు
మాస్టర్ రాము... మాస్టర్ కుందు... మాస్టర్ విశ్వం... మాస్టర్ హరికృష్ణ... మాస్టర్ బాలకృష్ణ... మాస్టర్ మహేశ్... ఇలా వందలాది మంది బాలనటుల్ని చూశాం మనం. అసలు ఈ బాలనటులకు ఆద్యుడెవరో తెలుసా? సింధూరి కృష్ణారావు. 1932 ఫిబ్రవరి 6న విడుదలైన మన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’లో టైటిల్ రోల్ పోషించాడు. ఆ లెక్కన మన తొలి తెలుగు కథానాయకుడు కూడా అతనే. ఈ సినిమా చేసే సమయానికి కృష్ణారావు వయసు ఎనిమిదేళ్లు. ఖమ్మంలో సురభి కళాకారుల కుటుంబంలో పుట్టిన కృష్ణారావు రెండేళ్ల వయసు నుంచే సురభి నాటకాల్లో బాలకృష్ణుడిగా, కనకసేనుడిగా చిన్న చిన్న వేషాలు వేస్తుండేవాడు. దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి ‘భక్త ప్రహ్లాద’ సినిమా కోసం సురభి బృందాన్ని సంప్రదించి అయిదుగురు పిల్లల్ని ఎంపిక చేసుకుని బొంబాయి తీసుకు వెళ్లారు. కృష్ణారావుతో ప్రహ్లాదుడి పాత్ర చేయించారు. 400 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత కృష్ణారావు మళ్లీ సినిమా ఫీల్డ్కి వెళ్లలేదు. అప్పట్లో బొంబాయిలో మత కలహాలు చెలరేగడంతో ఇంట్లోవాళ్లు భయపడి తమ ఊరికి తీసుకువెళ్లిపోయారు. ఆ తర్వాత సురభి నాటక సమాజంలో హార్మోనిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. అసలే పెద్ద కుటుంబం. చాలీచాలని పారితోషికాలు. దాంతో పోషణకు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్నాళ్లు తణుకు సమీపంలోని ఉండ్రాజవరంలో చిన్న కిరాణాకొట్టు పెట్టుకుని బతికారు. ఇంకొన్నాళ్లు కూలి పని కూడా చేశారు. చివరి దశలో గోదావరిఖని సురభి కంపెనీలో కేసియో ప్లేయర్‌గా పనిచేశారు. ఓ పత్రికలో వార్త చదివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌వారు హైదరాబాద్ పిలిపించి ఆయన్ను సత్కరించారు. 2004 చివర్లో కృష్ణారావు కన్నుమూశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా మన తొలి తెలుగు బాలనటుడి జీవితం అజ్ఞాతంగానే ముగిసిపోయింది.