ఆ పేరు పెట్టుకుని రాంలీలాలో నటిస్తావా?
బదానా: ఉడీ ఉగ్రదాడిపై స్పందించని కారణంగా ఇండియాలోని పాకిస్థానీ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన శివసేన.. ఇప్పుడు స్వదేశీ నటులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ రాంలీలా నాటకంలో నటించడానికి వీలులేదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ లోని బదానాలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారి దీపక్ కుమార్ మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే..
నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన స్వగ్రామం బదానా(ముజఫర్ నగర్ జిల్లాలో ఉందీఊరు)లో నవరాత్రుల సందర్భంగా ప్రదర్శించే రాంలీలా నటకంలో మారీచుడి పాత్ర ధరించాలనుకున్నాడు. బదానాలో రాంలీలా ప్రదర్శనకు గొప్ప పేరుంది. దాదాపు 100 ఏళ్ల నుంచి నవరాత్రుల సందర్భంగా అక్కడ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్నప్పటి నుంచి దానిని చూస్తూ పెరిగిన నవాజుద్దీన్ ఏనాటికైనా నాటకంలో ఏదోఒక పాత్ర పోశించాలనుకున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన ఆయన.. నాటక నిర్వాహకులను కలిసి తనకో పాత్ర ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అలా గురువారం జరిగిన ప్రదర్శనలో ఆయనకు మారీచుడి వేషం దక్కింది. దీంతో స్టార్ నటుణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
అయితే ప్రదర్శన ప్రారంభానికి రెండు గంటల ముందు నాటకంలో నవాజుద్దీన్ నటించడంలేదంటూ నిర్వాహకులు ప్రకటించారు. శివసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రాంలీలాలో నటించకూడదని హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 'నవాజుద్దీన్ సిద్దిఖీ అనే పేరు పెట్టుకుని రాంలీలాలో ఎలా నటిస్తావ్?'అని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. వ్యతిరేకత నేపథ్యంలో సొంత ఊరి నుంచి ముంబై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నవాజుద్దీన్.. 'గ్రామంలో ఉద్రిక్తత తలెత్తడం నాకు ఇష్టం లేదు. అందుకే నటించకూడదని నిర్ణయించుకున్నా'అని మీడియాకు చెప్పారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. నటీనటులకు మత బేధాలు ఉండవని, టాలెంట్ మాత్రమే ఉంటుందని, ఆందోళనకారులు ఈ సంగతి గుర్తెరగాలని అన్నారు.