breaking news
Avalanche checks
-
చెక్పోస్టులపై ఏసీబీ కొరడా
ఏక కాలంలో దాడులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం.. మధ్యవర్తుల ద్వారా వసూళ్లు చేస్తున్న సిబ్బంది పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు నెట్వర్క్: రాష్ట్ర సరిహద్దుల్లోని పలు చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెక్‌పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో దాడులు చేసి.. పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ప్రతీ చెక్‌పోస్టులో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగించారు. చెక్‌పోస్టుల సిబ్బంది వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మధ్యవర్తులను కూడా నియమించుకున్నట్లు ఈ దాడుల్లో వెల్లడైంది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఆర్టీఏ చెక్‌పోస్టు సిబ్బంది నుంచి రూ.31,760 పట్టుబడింది. గతేడాది డిసెంబర్ 19న ఇదే చెక్ పోస్టుపై దాడి చేయగా రూ.5 లక్షల నగదు లభించిందని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజా తెలిపారు. అలాగే, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద ఉన్న చెక్పోస్టులపై చేసిన దాడుల్లో లెక్కతేలని రూ.44వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్‌లోని రవాణాశాఖ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఏజెంట్ మగ్దూం నుంచి రూ. 25 వేలు, చెక్‌పోస్టులో ఉన్న రూ. 25,700ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ. 62,380, జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద రూ. 70 వేలు నగదు దొరికింది. ఈ దాడుల్లో వాణిజ్యపన్నులు, రవాణా శాఖలకు సంబంధించిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో తేలిన విషయాలను ఏసీబీ కమిషనర్‌కు నివేదిస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. -
ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు
పట్టణంలో పోలీసుల కార్డెన్‌సెర్చ్ కేశవరావుతోటలో ఆకస్మిక తనిఖీలు ఆందోళన చెందిన పలువురు కాలనీ వాసులు కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అది పట్టణంలోని ఆంధ్రా జాతీయ కళాశాల సమీపంలోనికేశవరావుతోట ప్రాంతం... సమయం మంగళవారం ఉదయం 5.30 గంటలు.. వాతావరణం నిర్మానుషంగా ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంది.. ఆ ప్రాంతంలో ఉద్యోగులతో పాటు ఏ రోజుకారోజు కాయకష్టం చేసుకునే కూలీలు ఉన్నారు.. గతంలో ఆ కాలనీ పలు వివాదాలతో పోలీస్‌స్టేషన్ రికార్డుల్లోకి ఎక్కిన సంఘటనలు ఉన్నాయి.. చిన్న చిన్న నేరాలు, ఘోరాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలో ఉండే కాలనీలో తెల్లవారుజామున 5.30 గంటలకు బూట్ల శబ్ధాలు కాలనీ వాసుల చెవినపడ్డాయి. ఖంగారుపడిన స్థానికులు చూడగా పోలీసు బృందాలు కుప్పలుతెప్పలుగా కాలనీలోకి పరుగులు పెడుతూ కనిపించాయి. దీంతో కాలనీ మొత్తం ఉలిక్కిపడింది. కాలనీలోకి పరుగులు పెట్టిన పోలీసు బృందాలు గుంపులు గుంపులుగా విడిపోయి ఆ ప్రాంతంలోని ఇళ్లల్లో విస్త్రృత సోదాలు చేశారు. నిద్రలో ఉన్న వారిని సైతం తట్టిలేపారు. కంగారులో నిద్ర లేచిన వారికి కళ్లెదుట పోలీసులు కనబడటంతో ఉలిక్కిపడ్దారు. కాలనీలోకి పోలీసులు ఎందుకు వచ్చారు.. ఎవరి కోసం వెతుకుతున్నారు.. ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు విషయమేంటి అనే మీమాంసలో ఆ ప్రాంత వాసులందరూ ఖిన్నులై మిన్నుకుండిపోయారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మరికొందరు స్థానికులు ఉరుకులు పరుగులు మీద రోడ్లపై వచ్చేశారు. కాలనీ మొత్తం పోలీసులు సోదాలు చేస్తుండటంతో అర్ధంకాని పలువురు అమాయకంగా పోలీసుల వైపు చూస్తుండటమే వంతుగా మిగిలింది. సోదాలు మొత్తం పూర్తి చేసుకున్న పోలీసులు అసలు విషయం చెప్పే వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అధికారులు అసలు విషయం చెప్పే సరికి హమ్మయ్య అనుకున్నారు. ఇది మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని కేశవరావుతోటలో జరిగిన ఘటన. విషయానికొస్తే మంగళవారం ఉదయం బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బందరు సబ్-డివిజన్ పరిధిలోని పోలీసులు కేశవరావుతోట ప్రాంతంలో నేర ప్రవృత్తి కలిగిన నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అందుకోసం డివిజన్ పరిధిలోని సుమారు 150 మంది పోలీసులు కాలనీపై ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. కాలనీలోని ఇంటింటిని సోదా చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నాయకత్వం వహించగా డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిసి కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. కేశవరావుతోట మొత్తం జల్లిడ పట్టిన పోలీసులు సుమారు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అలాగే కాలనీలో పత్రాలు, నెంబరు ప్లేట్లు సరిగా లేని 10 వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అయితే అదుపులోకి తీసుకున్న అనుమానితులు పలువురు తమ చిరునామాలను పోలీసులకు వివరించడంతో వారిని స్టేషన్ నుంచి పంపించివేశారు. మిగిలిన అనుమానితులను స్టేషన్లో విచారణ నిమిత్తం అట్టిపెట్టారు. అలాగే బైక్‌లకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నట్లు చూపించిన వారికి వారి బైక్‌లను అప్పగించేశారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో రూరల్ సీఐ వీఎస్‌ఎస్‌వీ మూర్తి, టౌన్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు అశోక్, నభీ, లోవరాజు, ఏ దుర్గారావు, అనిల్‌కుమార్, శ్రీహరికుమార్, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు. -
మంత్రి కొల్లు ఆకస్మిక తనిఖీలు
మచిలీపట్నం టౌన్ : రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని చేపల మార్కెట్ అంతా కలియతిరిగి పరిస్థితులను గమనించారు. చేపలను శుభ్రపరిచే స్థలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బేబీ సెంటర్‌ను సందర్శించి అక్కడి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసి పిల్లలతో ఉన్న బాలింతల గదిలో మూడు ఫ్యాన్లు తిరగనిస్థితిని ఆయన పరిశీలించారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యాధికారిణి గీతామణిని వివరాలడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రి ఆవరణంలో 150 బెడ్ల చిన్నపిల్లల ప్రత్యేక వైద్యశాల నిర్మాణం జరుగుతోందని, బేబీ సెంటర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కలిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్తో కలసి పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, బందరు జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులున్నారు.