breaking news
auto damaged
-
ఆటో.. జారితే ఎటో!
నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. ఒకటీ, రెండూ కాదు.. పదికి పైగా చెడిపోయిన ఆటోలను ఇలా తీసుకెళ్లారు. ఇందులో ఏ ఒక్కటన్నా పట్టుతప్పిందంటే అన్నీ బోల్తా కొట్టడం ఖాయం. అయినా సరే వీరెవరికీ ఆ విషయం పట్టలేదు.. ఆ మార్గంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం అడ్డుకోలేదు. శుక్రవారం కోఠి రోడ్డులో కనిపించిందీ దృశ్యం. ఫొటోలు: గడిగె బాలస్వామి -
నెత్తురోడిన జాతీయ రహదారి
ఆటోను ఢీకొన్న టిప్పర్.. ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం ఆదిలాబాద్ జిల్లా పోలంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్ సాక్షి, మంచిర్యాల/జైపూర్: ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి శుక్రవారం నెత్తురోడింది.. వేగంగా వస్తున్న టిప్పర్ ఓ ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సహా ఆరుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పోలంపల్లి మాంతమ్మ గుడి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన ఇద్దరు, జైపూర్ మండలం ఆరెపల్లికి చెందిన ముగ్గురు, మంచిర్యాల మండలం సీసీసీకి చెందిన ఒకరు ఉన్నారు. చెన్నూరుకు చెందిన ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చెన్నూర్ పట్టణానికి చెందిన నాగుల సురేశ్ (27), బత్తుల నరేశ్(28), సద్ది మధుకర్(24) ముగ్గురు స్నేహితులు. వారు ముగ్గురూ ఆటోడ్రైవర్లే. నాగుల సురేశ్‌కు మాత్రం సొంత ఆటో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సద్ది మధుకర్ తన కోసం ఆటో కొనుగోలు చేసేందుకు బత్తుల నరేశ్‌తో కలసి సురేష్ ఆటోలో మంచిర్యాలకు బయలుదేరారు. వారు మార్గమధ్యలో జైపూర్ మండలం భీమారం బస్టాండ్ వద్ద అదే మండలంలోని ఆరేపల్లికి చెందిన డేగ మహేందర్ (14), ఒడిపల్లి రమేష్ (16), అయిటిపాములమల్లయ్య(50), ఆయన వదిన అయిటిపాముల మల్లక్క(45)లను ఆటోలో ఎక్కించుకున్నారు. అలా భీమారం బస్టాండ్ నుంచి ఏడుగురితో ఆటో బయలుదేరింది. వారు జైపూర్ మండలం పోలంపల్లి మాంతమ్మ గుడి సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా తారులోడుతో వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొట్టి... సుమారు 40 మీటర్ల మేర లాక్కెళ్లింది. అక్కడున్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్నవారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోడ్రైవర్ నాగుల సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను జైపూర్, శ్రీరాంపూర్ పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీసి... పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, మంచిర్యాల ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద సాయం చేస్తామని ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం హామీ ఇచ్చారు. సీఎం సంతాపం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.