breaking news
attack on sakshi reporters
-
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి
పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది. -
సాక్షి రిపోర్టర్‌పై హత్యాయత్నం
-
‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం
కోవెలకుంట్ల : కర్నూలు జిల్లా సంజామల మండల ‘సాక్షి’ విలేకరి వెంకటేశ్వర్లుపై గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హత్యాయత్నం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశాడన్న కారణంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గని దస్తగిరిరెడ్డి, గని రమణారెడ్డికి విలేకరి వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సంజామల శివారులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి బంధువుల వివాహం ఉండటంతో వెంకటేశ్వర్లు అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ అనుచరులైన నాగిశెట్టి, హజరత్, శ్రీనివాసులును విలేకరిపై దాడికి ఉసిగొల్పారు. వారు కత్తి, రాళ్లతో ఆయనపై దాడి చేశారు. రెండుసార్లు కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా కత్తిపోట్ల నుంచి వెంకటేశ్వర్లు తప్పించుకున్నారు. ఆ వెంటనే బండరాయితో తలపై బలంగా కొట్టడంతో విలేకరి కింద పడ్డాడు. పక్కన ఉన్న రాళ్లతో మళ్లీ దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. అలాగే విలేకరి వెంట ఉన్న గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహేష్‌పైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ప్రదేశంలో గొడవ జరుగుతున్నట్టు భావించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న నెపంతోనే విలేకరిని హత్య చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం
నలుగురు రైతులపై దాడి సీఆర్డీఏ కార్యాలయంలో ‘సాక్షి’ బృందాన్ని నిర్బంధించిన తమ్ముళ్లు ఏ ఆధారాలతో వార్తలిచ్చారో చూపించాలంటూ దౌర్జన్యం పక్కా రికార్డులు చూపించడంతో సీఆర్డీఏపైకి నెట్టేసిన వైనం సాక్షి, అమరావతి బ్యూరో: అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు పచ్చ తమ్ముళ్లు కొందరు దౌర్జన్యానికి దిగారు. మద్యం సేవించి మరీ ఏపీ రాజధాని పరిధిలోని అనంతవరం గ్రామానికి చెందిన నలుగురు రైతులపై దాడికి తెగబడ్డారు. రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లిన సాక్షి బృందాన్ని స్థానిక సీఆర్డీఏ కార్యాలయంలో నిర్బంధించారు. ఏ ఆధారాలతో వార్తలు రాశారో చూపించనిదే ఇక్కడి నుంచి వెళ్లడానికి లేదని అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధులు తమ వద్ద ఉన్న పక్కా రికార్డులను తెచ్చి చూపించడంతో చేసిన తప్పును సీఆర్డీఏ అధికారులపై నెట్టేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, టీడీపీలోని మరో వర్గం 'సాక్షి'కి అండగా నిలిచింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్రమార్కులు పత్తాలేకుండా పోయారు. దాడిలో గాయాలపాలైన గురజాల రామ్మోహన్రావు.. టీడీపీ నేత పారా కిషోర్‌పై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారా కిషోర్‌పై 506, 509, 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని రైతుల భూములను ఆక్రమించుకుని రికార్డులు తారుమారుచేసిన వైనంపై 'సాక్షి' పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అక్రమాలు వెలుగులోకి రావటంతో ఉలిక్కిపడ్డ స్థానిక టీడీపీ నేతలు, కొందరు సీఆర్డీఏ అధికారులు తారుమారు చేసిన రికార్డులను మళ్లీ మార్చేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఇద్దరి పేర్లు మార్చి పాత రికార్డులుగా సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ విషయం కూడా 'సాక్షి' బయటపెట్టడంతో ఇరకాటంలో పడిన టీడీపీ నేతలు.. రకరకాల ఫోన్ల నుంచి సాక్షి ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి మద్యం తాగి రైతులపై దాడి భూములు మాయం చేసిన ఆధారాలు 'సాక్షి'కి ఎలా వచ్చాయని టీడీపీ నాయకులు విచారించారు. రైతులే 'సాక్షి'కి ఉప్పందిస్తున్నారని అనుమానం వచ్చిన వారిపై దాడిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక కొందరు మద్యం తాగి అనంతవరం గ్రామంలో దౌర్జన్యం చేశారు. గురజాల రామ్మోహన్రావు, తరిగోపుల నరసింహరావుపై దాడిచేసి గాయపరిచారు. మంగళవారం ఉదయం బండ్ల బసవయ్యపై దాడిచేశారు. సాక్షికి ఇంటర్వ్యూలు ఇచ్చిన రైతులు, సాక్షి ప్రతినిధులను కొట్టాలని పథకం వేశారు. అందుకు ఓ 40 మంది గ్రూపుగా ఏర్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలియడంతో సాక్షి బృందం మంగళవారం అనంతవరానికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పచ్చనేతలు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకొని.. అక్కడ ఉన్న రైతులను బయటకు పంపి సాక్షి బృందాన్ని కార్యాలయంలోకి పిలిచి నిర్బంధించారు. తమపై ఏ ఆధారాలతో కథనాలు రాశారో చూపించే వరకు కదలడానికి లేదని దౌర్జన్యం చేశారు. ఒకానొక సమయంలో సాక్షి బృందంపై దాడికి యత్నించారు. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, తెప్పిస్తామని చెప్పడంతో కొంత సమయం ఓపిక పట్టారు. రికార్డులను తీసుకొచ్చి పచ్చనేతలకు చూపించటంతో అందులో భూములు ఎలా వచ్చాయో తమకు తెలియదని, అంతా సీఆర్డీఏ అధికారులు చేశారని బుకాయించారు. అయితే పత్రికలో చూపించిన భూమిని ఇవ్వాలని, లేకపోతే కౌలు చెల్లించాలని సాక్షి బృందాన్ని డిమాండ్ చేశారు. నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా తుళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇక తమ ఆటలు సాగవని గ్రహించిన అక్రమార్కులు పోలీసులు గ్రామానికి చేరేలోపు పత్తాలేకుండా పోయారు.