breaking news
asvita
-
ఫీజు రీయింబర్స్.. హాం ఫట్
► విద్యార్థిని ఫీజురీయింబర్స్ కాజేసిన అనిత ఇంజినీరింగ్ కాలేజ్ ► కళాశాల చైర్మెన్ అరెస్ట్ కుషాయిగూడ: విద్యార్థిని పేర నకిలీ పత్రాలను సృష్టించి ఫీజు రీయింబర్స్మెంట్ కాజేసిన ఓ కాలేజీ యాజమాన్యం పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అశ్విత ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్‌తో కలిసి సోమవారం విలేకరులకు వివరించారు. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామానికి చెందిన గుగులోతు అనిత అనే వివాహిత అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో 2013–14 విద్యా సంవత్సరంలో ఎంటెక్ అడ్మిషన్ తీసుకుంది. ఎస్టీ సామాజికవర్గం కావడంతో ఆమె ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అన్ని పత్రాలు జతపరిచి రంగారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. కొద్ది రోజులు కళాశాలకు వెళ్లిన అనిత గర్భవతి కావడంతో కళాశాలకు వెళ్లలేక పోయింది. తనను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సిబ్బందిని కోరగా కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ. 5,500 ఫీజు చెల్లిస్తే అనుమతిస్తామన్నారు. ఆమెకు ఫీజు చెల్లించడం వీలు కాకపోవడంతో పరీక్షలు రాయలేదు. తరువాత చదువుకోవడం వీలుపడక పోవడంతో టీసీ కోసం కళాశాలకు వెళ్లింది. సెకెండ్ ఇయర్ ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. అయితే అనిత మొదటి సంవత్సరం కళాశాలకు హాజరైనట్లు, పరీక్షలు రాసినట్లు నకిలీ పత్రాలు, మెమోలను తయారు చేసిన కళాశాల యాజమాన్యం సెకండ్ ఇయర్‌కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసింది. అందుకు సంబంధించి అనిత అకౌంట్లోకి వచ్చిన రూ. 57 వేలు రీయింబర్స్మెంట్ డబ్బును అప్పటికే డ్రా చేసుకుంది. తిరిగి డబ్బులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని బుకాయించారు. ఇదిలా ఉండగా ఆమె అకౌంట్లో హాస్టల్ ఫీజుకు సంబంధించిన రూ. 6,400 జమయ్యాయి. అనుమానం కలిగిన అనిత ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా సెకండ్ ఇయర్‌కు కూడా రీయింబర్స్మెంట్ డబ్బు మంజూరైనట్లు తెలిసింది. తన వేలి ముద్రలు లేకుండా ఏ విధంగా అప్రూవల్ చేశారంటూ అధికారులను నిలదీసి కళాశాల యజమాన్యంపై కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులకు వాస్తవాలు వెలుగులోకి రావడంతో కళాశాల చైర్మన్ వసంత తరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు. ట్రైబల్ వేల్పేర్ అధికారులపై కూడా విచారణ చేపడతామన్నారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటుఅట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కీసర, కుషాయిగూడ ఇన్స్పెక్టర్లు గురువారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆహారం కలుషితం
=26 మంది విద్యార్థినులకు అస్వస్థత = ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం = ఉడికీఉడకని కిచిడీనే కారణం = గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స =వార్డెన్, వంటమనిషి సస్పెన్షన్ బడుగు, బలహీనవర్గాల పిల్లలు ... అమ్మానాన్నలకు దూరంగా సర్కారు వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అన్నీ తానై చూసుకోవాల్సిన పర్యవేక్షకులు నిర్లక్ష్యం వహించినా.. అన్నం వండేవాళ్లు.. వడ్డించేవాళ్లు ఛీత్కారాలకు దిగినా ఏమీ అనలేని అచేతనం. తనకు నచ్చనిది ఇంట్లో పెడితే అమ్మ ముందు మారాం చేసే ఈ చిన్నారులు ఇక్కడ మాత్రం ఇష్టాలను మదిలోనే చిదిమేసి, బాధను పంటి బిగువునే దిగ‘మింగు’కుంటున్నారు. దీన్ని అలుసుగా చేసుకున్న వసతిగృహ సిబ్బంది నోటి దగ్గరి కూడును లాగేసి అర్ధాకలికే పరిమితం చేసి అనారోగ్యంపాలు చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసే అధికారగణం తదనంతర చర్యలవైపు దృష్టిసారించకపోవడంతో విద్యార్థుల మోముపై కన్నీటిచారికలు ఎగతాళి చేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలతో వెక్కిరిస్తూనే ఉన్నాయి. కిచిడీ ఉడకలేదు.. విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గోంగూర పచ్చడితో భోజనం చేశారు. మంగళవారం రాత్రి జావగారిన అన్నంలో పప్పు సొరకాయ, రసంతో తిన్నారు. బుధవారం ఉదయాన్నే సరిగా ఉడకకుండానే కిచిడీని వడ్డించారు. వరుసగా ఆహారంలో వచ్చిన తేడా కారణంగానే పిల్లలు కడుపునొప్పితో బాధపడ్డారని వైద్యులు చెబుతున్నారు. విద్యార్థినులకు అందించే ఆహారంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర కడుపునొప్పికి కారణమైందని తెలుస్తోంది. దీనికితోడు రెండు రోజులుగా సరైన ఆహారం లేకపోవడం కూడా ఈ నొప్పి తీవ్రతకు దోహదపడింది. మంగళవారం సాయంత్రమే అర్చన, ఎమేలియమ్మ, కూచిపూడి దీపిక కడుపునొప్పితో బాధపడగా వార్డెను గుడివాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో పదో తరగతి విద్యార్థినులు ముందుగా కిచిడీ తిని వెళ్లిపోయారు. తర్వాత మిగిలినవారమంతా తిన్నామని ఎనిమిదో తరగతి విద్యార్థిని అశ్విత చెబుతోంది. పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు తొలుత కడుపునొప్పితో బాధపడ్డారని, వెంటనే పాఠశాలలో బల్లలపై పడుకోబెట్టామని ఉపాధ్యాయులు వివరించారు. వసతీ గృహానికి చెందిన విద్యార్థులంతా ఒక్కొక్కరుగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో భయపడిన ఉపాధ్యాయులు 108 వాహనం ద్వారా గుడివాడ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. 26 మందికి ఇన్చార్జి సూపరింటెండెంట్ సురేష్‌బాబు వైద్యపరీక్షలు చేసి సెలైన్లు ఎక్కించారు. హాస్టల్లో 80 మంది విద్యార్థినులు ఉంటున్నారు. కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పరుగుపరుగున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కళ్లముందే తల్లడిల్లిపోతున్న కన్నపేగులను చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఎఎస్డబ్ల్యూవో ఎ.శేషుకుమారి, సమీప హాస్టళ్ల వార్డెన్లు అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన చేరుకున్న సాంఘిక సంక్షేమశాఖ డీడీ విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ బి.మధుసూదనరావు హుటాహుటిన గుడివాడ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన గురించి ఆరా తీశారు. మంగళవారమే విద్యార్థినులు అస్వస్థతకు గురయితే కనీసం ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ వార్డెన్‌పై మండిపడ్డారు. కిచిడీ ఉడకకుండా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ సంఘటనలో హెచ్‌డబ్ల్యూవో ఎంఎస్ రోజాతోపాటు వంటిమనిషి వి.రాధాబాయమ్మలను కారకులుగా భావించి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం సాయంత్రానికి పిల్లలు కోలుకున్నారని వైద్యులు వివరించారు. ఆందోళనకరంగా నలుగురు బాలికలు - విజయవాడ ఆస్పత్రికి తరలింపు గుడివాడ, న్యూస్‌లైన్ : అస్వస్థతకు గురైన 26 మందిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో గుడివాడ ఏరియా ఆస్పత్రి నుంచి విజయవాడకు 108 వాహనంలో వారిని తరలించారు. విజయవాడ తరలించిన వారిలో పదో తరగతి చదువుతున్న కె.అర్చన, తొమ్మిదో తరగతి విద్యార్థినులు సీహెచ్.నాగచైతన్య, బత్తుల పావని, కె.ఎమేలియమ్మ ఉన్నారు. వీరందరికీ శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు 108 ద్వారా తరలించారు. వీరిలో కె.అర్చనది గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామం కాగా, సీహెచ్.నాగచైతన్యది సిద్ధాంతం గ్రామం, బత్తుల పావనిది గుడివాడ పట్టణం, కె.ఎమేలియమ్మది గుడివాడ రూరల్ మండలం గుంటాకోడూరు గ్రామం అని అధికారులు చెప్పారు. ఇకపై మరింత పకడ్బందీగా ఉంటాం.. గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : ఇకపై వసతి గృహాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా మరింత పకడ్బందీగా ఉంటామని జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సమావేశాల్లో పిల్లలను మంచిగా చూడండి.. అని చెబుతున్నా హాస్టళ్లలో ఉండే సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదన్నారు. ఈరోజు జరిగిన ఘటనకు కారకులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ గృహాల్లో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.