breaking news
Asadullah Akhtar alias Tabrez
-
భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు: తబ్రేజ్
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఎన్ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రయివేట్ ట్రావెల్స్‌లో మంగళూరు నుంచి వచ్చి రెక్కీ నిర్వహించేవారని తెలిపాడు. అబిడ్స్, మలక్‌పేట, దిల్సుఖ్ నగర్లో రెక్కీ నిర్వహించినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. మంగళూరులోని యూనిట్ హెల్త్‌కేర్ వద్ద ఓ వ్యక్తి రియాజ్ భక్తల్ పేరుతో కొంత పేలుడు సామాగ్రిని అందచేశాడని చెప్పాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, పేలుళ్లకు రెండు రోజుల ముందే బాంబులను పరీక్షించినట్లు పేర్కొన్నాడు. జుమారాత్బజార్, మలక్‌పేట్‌లలో పాత సైకిల్ విడిభాగాలు కొన్నామని... సేకరించిన విడిభాగాలతో రెండు సైకిళ్లు తయారు చేసినట్లు చెప్పాడు. పేలుళ్ల రోజు మలక్‌పేట రైల్వేస్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చినట్లు అసదుల్లా అక్తర్ తెలిపాడు. దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద ఓ సైకిల్‌ను వాఖత్ ఉంచగా, A1 మిర్చి సెంటర్ వద్ద తహసీన్ మరో సైకిల్ ఉంచినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. రియాజ్ భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు జరిగాయని, పేలుళ్లు జరిగిన రోజే బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలిపాడు. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లి అక్కడ నుంచి నేపాల్ చేరుకున్నట్లు చెప్పాడు. -
తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ హాదీ తబ్రేజ్‌ను 15 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 4 వరకు తబ్రేజ్‌ను కస్టడీలో విచారించొచ్చని, గడువు ముగిసిన తర్వాత వైద్యుల ధ్రువీకరణపత్రంతో అతన్ని 5న కోర్టులో హాజరుపర్చాలని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తబ్రేజ్‌ను పీటీ వారంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. అతనికి హైదరాబాద్‌లో ఆశ్రయమిచ్చిందెవరు? నిషేధిత పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇందుకు సహకరించిందెవరు? విధ్వంసం తర్వాత ఎవరి సహాయంతో తప్పించుకున్నారు? తదితర అంశాలపై తబ్రేజ్ నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని, అతన్ని కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో తబ్రేజ్‌ను రిమాండ్ నిమిత్తం ఎన్ఐఏ అధికారులు రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు ఒక కాన్వాయ్ జైలు వరకు పరిశీలనకు వెళ్లొచ్చింది. తీరా జైలు నిబంధనల ప్రకారం సమయం ముగిసిందని చెప్పి జైలు అధికారులు తబ్రేజ్‌ను వెనక్కి పంపించివేశారు. శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలులో హాజరుపరిచిన తరువాతే అతన్ని ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తండ్రి వైద్యుడు... కొడుకు ఉగ్రవాది! ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన యాసిన్ భత్కల్‌కు కుడి భుజంగా ఎదిగిన తబ్రేజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్. అతనికి జావేద్ అక్తర్, హడ్డీ, షకీర్, డానియల్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి బి.ఫార్మసీ పూర్తి చేశాడు. తబ్రేజ్ తండ్రి డాక్టర్ జావేద్ అక్తర్ ప్రముఖ వైద్యుడు. ఎముకల వైద్యు నిపుణుడిగా పేరొందిన అతను గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగానూ పోటీ చేశారు. 2008లో ఉద్యోగం కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి ఇంటికి రాలేదని అతడి కుటుంబీకులు చెప్తుంటారు. 2011లో ముంబై పేలుళ్లు, గత ఏడాది ఆగస్టు 1న పుణేలోని జేఎం రోడ్డు పేలుళ్లలో ఇతని పాత్ర స్పష్టం కావడంతో నిఘా వర్గాలు వేట ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, అబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత ఏడాది నలుగురు ఐఎం ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరిలో నగరంలో నివసించిన మగ్బూల్ కూడా ఒకరు. ఈ కేసు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. -
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
-
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. జంట పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఢిల్లీ కోర్టు అనుమతి పొందిన ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో యాసిన్ ,తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు 15 రోజులు కస్టడీ కోరారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే భత్కల్, తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్న విషయం తెలిసిందే.