పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి లాభమెంత?
                  
	2016 మార్చి నాటికి రూ.500, 1,000 నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు
	♦ ఇందులో బ్యాంకులకు చేరనివి రూ.3.5 లక్షల కోట్లు
	♦ మార్పిడి, డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరే ఈ మొత్తం ఆర్బీఐ
	    నుంచి డివిడెండ్ రూపంలో కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం
	
	బిజినెస్ డెస్క్
	‘పెద్ద నోట్లను ఉపసంహరించడంతో సంపద ధ్వంసం కాదు.. సంపద బదిలీ అవుతుంది’ ఇదీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియం గత వారం చెప్పిన మాటలు. ఆయన అభిప్రా యంతో కొందరు ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ప్పటికీ, నోట్ల రద్దుతో ప్రభుత్వానికి భారీ ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు మార్పిడికి, డిపా జిట్లకు రాని డబ్బంతా రదై్దన నోట్ల రూపంలో ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చేరుతుం దన్నదే ఆ అంచనాల సారాంశం. అదేలా అంటే..
	
	► చెలామణీలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల విలువ 2016 మార్చి నాటికి రూ. 14.18 లక్షల కోట్లు ఉంది. మొత్తం కరెన్సీ నోట్లలో ఈ పెద్ద నోట్ల విలువ 80 శాతం వరకూ ఉంటుంది. మిగిలినవన్నీ చిన్న నోట్లే.
	► సుమారు రూ.14 లక్షల కోట్ల విలువైన ఈ పెద్ద నోట్లలో దాదాపు 25 శాతం బ్యాంకుల వద్దకు చేరవని అంచనా. అంటే ఈ మొత్తం దాదాపు రూ.3.5 లక్షల కోట్లు.
	►  ఇలా బ్యాంకుల వద్దకు మార్పిడి, డిపాజిట్ కోసం చేరని రూ.3.5 లక్షల కోట్లు రిజర్వుబ్యాంక్కు వచ్చిన లాభంగా పరిగణిస్తారు.
	►  రద్దయిన నోట్ల స్థానంలో ఇప్పుడు రిజర్వుబ్యాంకు కొత్తగా రూ.500, రూ.2,000 నోట్లను ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల వద్దకు మార్పిడి కోసం, డిపాజిట్ల రూపంలో వచ్చిన పాత నోట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయి. కానీ బ్యాంకుల వద్ద జమకాని రూ.3.5 లక్షల కోట్ల విలువైన పాత నోట్లకు బదులుగా కూడా రిజర్వుబ్యాంక్ అంతే మొత్తం కొత్త నోట్లను అదనంగా ముద్రిస్తుంది.
	►  ప్రతీ ఏడాది రిజర్వుబ్యాంక్కు వివిధ కార్యకలాపాల ద్వారా వచ్చిన లాభాన్ని డివిడెండు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇదే ప్రక్రియలో భాగంగా కేంద్రానికి ఈ రూ. 3.5 లక్షల కోట్లు బదిలీ అవుతాయి.
	
	ఈ డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుంది?
	నిధుల సమస్యలతో వివిధ రంగాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవు తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రో సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలకు కోత విధిస్తోంది కూడా. ఇటువంటి సమయంలో హఠాత్తుగా సమకూరిన ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఏ రూపంలోనైనా వినియోగిం చుకోవచ్చు. అవి.. ఏమిటంటే..
	►  అదనంగా వచ్చిన ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దాదాపు రూ.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
	►  మొండి బకాయిలతో మూలధనం కోసం అర్రులుచాస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధనాన్ని సమకూర్చవచ్చు.
	► మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయవచ్చు.
	►  సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించవచ్చు.