breaking news
Antoine Leiris
-
నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు!
పారిస్: 'శుక్రవారం రాత్రి మీరు ఓ విశేషమైన వ్యక్తి విలువైన ప్రాణాలను బలిగొన్నారు. నా జీవిత సర్వస్వాన్ని దూరం చేశారు. ఓ కొడుకుకు తల్లిని దూరం చేశారు. అయినా మీమీద నాకు ద్వేషం కలుగడం లేదు. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు చనిపోయిన ఆత్మలన్న విషయాన్ని నేను తెలుసుకోవాలనుకోవడం లేదు'.. ఇది ఆంటోనీ లీరిస్ ఆవేదన. పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆయన భార్య ప్రాణాలు కోల్పోయింది. అయినా 129 మందిని పొట్టనబెట్టుకున్న ఈ నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తనకు ద్వేషం కలుగడం లేదని ఆయన పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నది. 'మీకు ద్వేషం అనే బహుమతిని నేను ఇవ్వబోను. మీ పట్ల ద్వేషం వ్యక్తమవుతుండొచ్చు. కానీ ద్వేషం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అజ్హానమే. ఆ అజ్ఞానమే మిమ్మల్ని ఇలా తయారుచేసింది. నన్ను భయపెట్టాలని నువ్వు చూశావు. సాటి నా దేశవాసులను అనుమానంతో నేను చూసేలా చూడాలనుకున్నావు. భద్రత కోసం నా స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టాలని భావించావు. కానీ నువ్వు ఓడిపోయావు. మేము ఇంకా దృఢంగానే ఉన్నాం' అని ఆయన ఈ ఫేస్బుక్ పోస్టులో ఉగ్రవాదులను ఉద్దేశించి పేర్కొన్నారు. శుక్రవారం పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్, జాతీయ క్రీడా మైదానం వద్ద ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ మారణహోమంలో బాటాక్లాన్ థియేటర్ వద్ద చనిపోయిన 86 మందిలో లీరిస్ భార్య కూడా ఉన్నారు. విగతజీవిగా పడి ఉన్న ఆమెను చూసి.. తాను ఎంతగా ఛిన్నాభిన్నమయ్యాడో ఆయన వివరించాడు. ' ఆమెను నేను ఈ రోజు ఉదయం చూశాను. కొన్ని రాత్రులు, పగళ్ల ఎడతెగని ఎదురుచూపుల అనంతరం ఆఖరికీ చూశాను. తను శుక్రవారం ఇంటినుంచి వెళ్లేటప్పుడు ఎంత అందంగా ఉందో.. అలాగే ఉంది. 12 ఏళ్ల కింద ఆమెతో ప్రేమలో పడి తొలిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. నిజమే ఆమెను చూసి నేను బాధతో కుప్పకులాను. ఓ చిన్న విజయాన్ని మీకు అందించాను. కానీ అది ఎంతోకాలం నిలువబోదు. ప్రతిరోజు ఆమె మాతోనే ఉంటుంది. స్వేచ్ఛయుత ఆత్మలతో ఒకరోజు స్వర్గంలో మేము కలుసుకుంటాం. కానీ అలాంటి స్వర్గం మీకెన్నడు సాధ్యపడబోదు' అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని సైన్యాలన్నింటికన్నా బలంగా తాను, తన కొడుకు జీవితంలో ముందుకు సాగుతామని, 17 నెలల తన కొడుకును నిద్రనుంచి లేపి.. జాగృత పరిచి, స్వేచ్ఛయుత, ఆనందదాయక జీవితం గడిపేలా తీర్చిదిద్దుతామని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు. -
'అయినా.. నన్ను భయపెట్టలేకపోయారు'
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. పారిస్ ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ బాధితుడు ఆంటోనీ లీరిస్. ఈ ఘటనను జీర్ణించుకోలేని ఆ వ్యక్తి 'మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్లు చచ్చిన శవాలు' అని పేర్కొంటూ చేసిన ఫేస్బుక్ పోస్ట్ అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారని, నా జీవితాన్ని నాకు దూరం చేశారని పేర్కొన్నాడు. ఇన్నీ చేసినా మీరు నన్ను భయపెట్టలేక పోయారు. 'నా స్వేచ్ఛకు భంగం కలిగించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేటి ఉదయం కూడా నేను ఆమెను చూశాను.12 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాను. బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో 89 మందికి పైగా చనిపోయారు. కానీ, ఇది ఉగ్రవాదుల స్వల్ప విజయం' అని భార్య మృతదేహాన్ని చూస్తూ ఈ విషయాలను పోస్ట్ ద్వారా వివరించాడు. 'నేను, నా బాబు(17 నెలలు) ప్రపంచంలోని అన్ని ఆర్మీల కంటే ధృడంగా ఉన్నాం. మీ గురించి ఆలోచిస్తూ టైం వృథా చేసుకోను. నా బాబును సంతోషంగా, దైర్యంగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తుంటాను. మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు' అంటూ ఉద్వేగభరితంగా తన మనసులోని బాధను ఆంటోనీ లీరిస్ బయటపెట్టాడు.