breaking news
ant biting
-
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘెరావ్
విజయవాడ: విజయవాడలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మరణించడంపై ప్రజా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను ఘెరావ్ చేశారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. పసికందు మృతికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యత వహించి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఆస్పత్రిలో చీమలు కుట్టి.. పసికందు మృతి
మొన్నామధ్య గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరిచి 21 రోజుల బాలుడు మరణించగా.. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. కానీ సోమవారం తెల్లవారుజామున లేచి చూడగా.. శిశువు ఛాతీ, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే శిశువు మరణించాడు. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన అంజయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడు. అతడి భార్య లక్ష్మికి నెలలు నిండటంతో, ప్రభుత్వాస్పత్రిలో అయితే క్షేమంగా ప్రసవం జరుగుతుందని విజయవాడ తీసుకొచ్చారు. కానీ నాలుగు రోజుల తర్వాత తెల్లారి లేచి చూసేసరికి బాబు చనిపోయి ఉన్నాడని వాపోతున్నారు. పిల్లాడిని మొత్తం చీమలు కుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని, అందుకే మరణించాడని వైద్యులు చెబుతున్నారు. తెల్లవారి 5.40 గంటలకు కూడా బిడ్డ బతికే ఉన్నాడని, తర్వాతే ఇదంతా జరిగిందని బాధితుల బంధువులు అంటున్నారు. అయితే ఆ తర్వాత బాలుడి తరఫు వాళ్లే అతడిని తీసుకెళ్లారని, అందువల్ల ఈ మరణంతో తమకు సంబంధం లేదని డాక్టర్ అన్నారు. వార్డులో మిగిలిన పిల్లలను చీమలు ఎందుకు కుట్టలేదని ఎదురు ప్రశ్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. కావాలని బాలుడి బంధువులే తీసుకెళ్లి చీమల పుట్టలో పడుకోబెడతారా అని వైద్యులను ప్రశ్నించారు. పార్టీ నాయకుడు నివాస్‌రెడ్డితో కలిసి ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లిన పార్థసారథి.. ఈ వ్యవహారంపై నిలదీశారు.