breaking news
anandiben offers
-
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
-
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
అహ్మాదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ అనూహ్యరీతిలో రాజీనామాకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఆమె సోమవారం బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో దళితులపై దాడులను నివారించడంలో ఆనందిబెన్ సర్కారు విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తనకు వయస్సు మీద పడుతున్నదని, ఈ నేపథ్యంలో తనను సీఎం పదవి నుంచి తప్పించాలని ఆనందిబేన్ తన ఫేస్బుక్ పేజీలో బీజేపీ అధినాయకత్వాన్ని కోరారు. ఆనందిబెన్ వచ్చే నవంబర్‌లో 75వ ఏట అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశమంతటా ప్రచారం చేసి నరేంద్రమోదీ ప్రధానిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ ప్రమాణం స్వీకరించారు. ఆనందిబెన్ హయాంలోనే పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన గుజరాత్‌ను కుదిపేసింది. దీనికితోడు గుజరాత్ ఉనాలో దళిత యువకులపై జరిగిన దాడి దేశమంతటా గగ్గోలు రేపింది. ఈ నేపథ్యంలో ఆనందిబెన్ రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం.