breaking news
Anand Grover
-
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్‌కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు.