breaking news
AMIC
-
అపరాలే బెస్ట్
సాక్షి, అమరావతి: రైతులు విత్తు నాటుకునేటప్పుడే కోత సమయంలో తమ పంట ఉత్పత్తులకు ఎంత ధర లభిస్తుందో తెలిస్తే వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందో తెలిస్తే ఆ పంటలనే సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు కోతకొచ్చే సమయంలో మార్కెట్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఏఎంఐసీ) అంచనా వేస్తోంది. విత్తుకునే సమయంలో ఉండే ధరలు కోతకొచ్చేవేళ ఉండకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2019లో ఏఎంఐసీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా సీజన్ల వారీగా నిర్దేశించిన పంటల సాగు లక్ష్యం, సాధారణ వాతావరణ పరిస్థితులు, దిగుబడులు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, వివిధ మార్కెట్ సర్వేల సమాచారం, 25–30 ఏళ్ల మార్కెట్ ధరల హెచ్చుతగ్గులను శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. సమగ్ర కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్యాకేజీల ద్వారా శాస్త్రీయంగా మూల్యంకనం చేస్తున్నారు. వీటితోపాటు విశ్వవిద్యాలయ గణాంక విభాగ నిపుణులు లోతైన అధ్యయనం చేశాక ఖచ్చితమైన ప్రమాణాల ఆధారంగా పంట ఉత్పత్తులకు ముందస్తు మార్కెట్ ధరలను ఏఎంఐసీ అంచనా వేస్తోంది. తేజా మిరపకే విదేశాల్లో గిరాకీ ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిర్చి విషయానికి వస్తే అధిక ఉత్పత్తి ఫలితంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఏఎంఐసీ అంచనా వేసింది. తేజా రకం మిరపకు మాత్రమే ఎగుమతి రకంగా డిమాండ్ ఉంది. మిగిలిన రకాలకు పెద్దగా ధర లభించే అవకాశాలు ఉండవని అంచనా. ప్రస్తుతం అంచనా వేసిన ముందస్తు ధరలు పంట కోత సమయంలో మద్దతు ధరకు దగ్గరగా లేదా హెచ్చుగా ఉంటాయని ఏఐఎంసీ తెలిపింది. ఇప్పటివరకు విడుదల చేసిన అంచనా ధరల వివరాలను www.angrau.ac.in లో పొందుపర్చింది. వీటిపై విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంలోనూ సంప్రదించొచ్చు. అయితే వాతావరణంలో అసాధారణ మార్పులు, వరదలు, అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అంచనా ధరల హెచ్చుతగ్గుల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఏఎంఐసీ ప్రకటించింది.ఈ ఉత్పత్తులకు మంచి ధరలు ఖరీఫ్–2024–25 సీజన్ ఊపందుకుంటోంది. 149.32 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగవుతాయని అంచనా వేశారు. ఏఎంఐసీ అంచనా ప్రకారం.. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తితో పోలిస్తే అపరాలు, మిరప, పసుపు, వేరుశనగ పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తాయి. ముఖ్యంగా కందులు, మినుములు, పెసలు రైతులకు మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, స్థిరమైన దేశీయ గిరాకీ, డిమాండ్ కారణంగా ఈ పంటల రైతులు మంచి రాబడిని పొందే వీలుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సన్నబియ్యం ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా ఈ రకాలు సాగు చేసే రైతులకు మంచి ధర లభిస్తుంది. మిగిలిన వరి రకాల ధరలు కూడా స్థిరంగానే ఉండనున్నాయని ఏఎంఐసీ అంచనా వేసింది. అలాగే బంగ్లాదేశ్, చైనా, వియత్నాం దేశాలకు గణనీయంగా మెరుగుపడిన ఎగుమతుల ద్వారా పత్తి ధరలు లాభదాయకంగా ఉంటాయని అంచనా. ఎగుమతులు పెరగడం, తక్కువ ఉత్పత్తి కారణంగా పసుపు ధరలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నాయి.విత్తుకునే ముందు రైతులకు సమాచారం ప్రధాన పంట ఉత్పత్తులకు ముందస్తు ధరలను నిర్ణయించేటప్పుడు పంట నిల్వలు, సాగు విస్తీర్ణం, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారుల అంచనాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఏటా రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంట ఉత్పత్తుల ముందస్తు అంచనా ధరలను అంచనా వేసి విత్తుకునే ముందు రైతులకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నాం. విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలను సంప్రదించి పంటసాగు నిర్ణయాలను తీసుకునేలా ఏఎంఐసీ రైతులకు అవసరమైన తోడ్పాటునందిస్తోంది. – డాక్టర్ జి.రఘునాథ్‌రెడ్డి, ప్రధాన పరిశోధకులు, వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ కచ్చితమైన సమాచారంతోనే రైతుకు మేలు ప్రస్తుతం పంటల మార్కెట్ ధరలు.. డిమాండ్ సరఫరా సూత్రంతో పాటు స్థానికత, దేశ అవసరాలు, విదేశాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. రైతులకు సకాలంలో ఖచి్చతమైన మార్కెట్ సమాచారాన్ని అందించడం కీలకం. పంటల ఉత్పత్తి సరఫరా కంటే మార్కెట్ ఆధారిత డిమాండ్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగినప్పటికీ.. మెజార్టీ రైతులకు నేటికీ నికర ఆదాయం దక్కని పరిస్థితి నెలకొంది. ఏపీ తరహాలోనే ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అగ్రికల్చర్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను కలిగి ఉండాలి. ఖచి్చతమైన సమాచారంతో పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది.. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. – డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
పత్తికి మళ్లీ నిరాశే
తెనాలి: గత ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెరిగినా ధరలు నిరాశ కలిగించాయి. రానున్న సీజనులోనూ ఇంతకుమించి పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. ముఖ్యంగా జిల్లాలో పత్తి సాగుచేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. పత్తి సాగు విస్తీర్ణం తగ్గించకపోతే ధర లేక మళ్లీ ఇబ్బందులు పడే ప్రమాదముంది. ఇవన్నీ మార్కెట్ వ్యాపారులు మాట్లాడుకునే మాటలు కాదు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రికల్చరల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ (ఏఎంఐసీ) 2015-2016 ఖరీఫ్ పంటల కోత సమయానికి మార్కెట్లో ఉండే ధరల అంచనా నివేదికలోని అంశాలివి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఈ కేంద్రంలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించే 12 రకాల పంటల ధరలు కోత సమయానికి ఏ విధంగా ఉంటాయనేది వివిధ మార్కెట్ల అధ్యయనం ఆధారంగా అంచనా వేసి నివేదికను విడుదల చేస్తారు. కరవు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మరోసారి అంచనాలోకి దిగుతారు. ఫలితాలను‘ఇఫ్కో’ కిసాన్ కాల్ సెంటర్ ద్వారా 6.5 లక్షల రైతులకు సంక్షిప్త సందేశం పంపుతుంటారు. దీనివల్ల రైతులకు పంటల సరళి, కోత సమ యాల్లో నిల్వ చేయాలా? అమ్ముకోవాలా? అనేది నిర్ణయించుకోగలుగుతారు. 2010 నుంచి అయిదేళ్లుగా ఈ కేంద్రం నిర్ణయించిన ధరల అంచనాలు 82-92 శాతం కచ్చితత్వాన్ని కలిగి వున్నట్టు ఏఎంఐసీ-లాం ఫారం వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్త డాక్టర్ ఎం.చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం... తాజాగా విడుదల చేసిన 2015-2016 ఖరీఫ్‌కు సంబంధించిన నివేదిక ప్రకారం జిల్లాలో రైతులు అధికంగా పండించే పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పంటల్లో పసుపు, మిర్చి, అపరాలు మినహా మిగిలిన పంటల ధరలు ఆశాజనకంగా ఉండే అవకాశం లే దు. చైనాకు ఎగుమతులు తగ్గిపోవటంతో గత సీజనులో పత్తి సాగుచేసి రైతులు చేదు అనుభవాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మద్దతు ధర క్వింటాలుకు రూ.4050 ఉండగా, వాస్తవంలో మార్కెట్ ధర రూ.1800-3000లకు మించి లేదు. ఏఎంఐసీ శాస్త్రవేత్తలు గత 14 సంవత్సరాల సరాసరి ధరల ఆధారంగా చేసిన విశ్లేషణ ప్రకారం పత్తి పంట కోత సమయానికి (అక్టోబరు-2015 నాటికి) క్వింటాలు రూ.4000 వరకు మాత్రమే ధర ఉంటుందని డాక్టర్ చంద్రశేఖరరెడ్డి చెప్పారు. పత్తి సాగు చేసే రైతులు ఈ సీజనుకు ప్రత్యామ్నాయం చూసుకుని విస్తీర్ణం తగ్గించుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయన సూచించారు. మద్దతు ధరల నిర్ణయం కాని మిరప, పసుపు పంటలకు ధరలు ఫరవాలేదు. 2016 జనవరి, ఫిబ్రవరి నాటికి మిర్చి ధర క్వింటాలు రూ.6500-7000 వరకు ఉంటాయి. ప్రస్తుత సీజనులో క్వింటాలు దాదాపు ఇదే ధరల్లో అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం క్వింటాలు రూ.6500 సగటున అమ్మకాలు జరుగుతున్న పసుపు 2016 జనవరి నాటికి రూ.7200-7500 వరకు ధర పలుకుతుందన్న సమాచారం సంతోషం కలిగించేదిగా ఉంది. ఇదేవిధంగా మొక్కజొన్న క్వింటాలు రూ.1200-1300, పెసలు రూ.5500-6000, కందులు రూ.5300-5500 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో ఖరీఫ్ సీజనులో ఈ పంటల సాగు విస్తీర్ణం బహు తక్కువనే విషయం తెలిసిందే.