breaking news
Airport runway
-
రాత్రి వేళ విమానాలు బంద్!
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదున్నర నెలలపాటు రాత్రి వేళ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆ సమయంలో పదకొండు గంటల పాటు విమానాల రాకపోకలు రద్దు కానున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నావికాదళం ఆధీనంలో ఉంది. నేవీ యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాలు కూడా ఐఎన్ఎస్ డేగా నియంత్రణలో ఉన్న ఈ రన్‌వే మీదుగానే ల్యాండింగ్, టేకాఫ్‌లు జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకోసారి తమ రన్‌వేలకు రీ–సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. ఈ ప్రక్రియలో రన్‌వేపై మూడు పొరలను తొలగించి మళ్లీ కొత్తగా వేస్తారు. ఇంకా అవసరమైన ఇతర పనులు చేపడతారు. ఐఎన్ఎస్ డేగాలో 2009లో రీ–సర్ఫేసింగ్ నిర్వహించారు. పదేళ్ల తర్వాత అంటే.. 2019లో మరోసారి నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటివరకు జరగలేదు. ఈ ఏడాది ఈ రీ–సర్ఫేసింగ్‌ను నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పనులను రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు చేపడతారు. అందువల్ల ఆ సమయంలో ఈ రన్‌వేను మూసివేస్తారు. దీంతో ఈ 11 గంటల్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. ఫలితంగా దాదాపు 12 విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. వీటిలో సింగపూర్ వెళ్లే ఏకై క అంతర్జాతీయ సర్వీసుతో పాటు ఢిల్లీ, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా విమానాలున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 30 టేకాఫ్‌లు, 30 ల్యాండింగులు జరుగుతున్నాయి. పర్యాటక సీజను వేళ ఏటా అక్టోబర్ నుంచి పర్యాటక సీజను ప్రారంభమవుతుంది. ఈ సీజనులో వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా ఐదారు నెలల పాటు విమానాలకు పర్యాటకుల రద్దీ కొనసాగుతుంది. సాధారణంగా వింటర్ సీజనులో పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను పెంచుతుంటాయి. కానీ ఈ ఏడాది వింటర్ పీక్ సీజనులో రీ–సర్ఫేసింగ్ మొదలవుతుండడంతో రాత్రి పూట విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. అదనపు షెడ్యూళ్లు పెంచడానికి బదులు తగ్గే అవకాశాలున్నాయి. నేవీ రీ–సర్ఫేసింగ్ దృష్ట్యా తమ సర్వీసుల షెడ్యూల్ వేళల్లో తగిన మార్పులు చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత విమానయాన సంస్థలకు సూచిస్తున్నారు. మూసివేత సమయం తగ్గించాలని కోరాం.. రీ–సర్ఫేసింగ్‌లో భాగంగా ఐఎన్ఎస్ డేగా రన్‌వేను నవంబరు 15 నుంచి మార్చి ఆఖరు వరకు రాత్రి వేళ 11 గంటల సేపు మూసివేయనున్నట్టు నేవీ నుంచి సమాచారం అందింది. దీనివల్ల రాత్రి 9 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల మధ్య విమానాల రాకపోకలు సాగించే వీలుండదు. ఆ సమయంలో 12 ముఖ్య విమాన సర్వీసులు రద్దవుతాయి. అందువల్ల రాత్రి 10.30 నుంచి మర్నాడు 6.30 గంటల వరకు (8 గంటలు) రన్‌వే మూసివేత సడలించాలని నేవీ ఉన్నతాధికారులను కోరాం. దానిపై ఇంకా ఏ సమాచారం లేదు. నేవీ రీ–సర్ఫేసింగ్ విషయాన్ని మా ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రధాన కార్యాలయానికి నివేదించాం. అలాగే రీ–సర్ఫేసింగ్ నేపథ్యంలో షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవాలని విమానయాన సంస్థలకు సూచించాం. – ఎస్.రాజారెడ్డి, డైరెక్టర్, -
రన్‌వేపై.. వదల బొమ్మాళీ.. వదల..
అమెరికాలోని సవన్నా నగరంలోని ఎయిర్పోర్ట్.. ఇక్కడి రన్‌వేపై రిచర్డ్, క్యాథరీన్ డాట్సన్ సమాధులుంటాయి.. ఫొటోలోని వృత్తంలో చూశారుగా.. అవే! సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టేటప్పుడు అవసరమైతే తగు పరిహారం ఇచ్చి ప్రైవేటు ఆస్తులను కూడా తీసుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో అప్పట్లో ఇక్కడ చిన్నస్థాయి సైనిక ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిన అమెరికా ప్రభుత్వం.. ఇందుకోసం డాట్సన్ కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమిని కూడా తీసుకుంది. అయితే, ఆ భూమిలోనే వీరి కుటుంబ సభ్యులు, వారి బానిసలకు చెందిన వందలాది సమాధులు ఉన్నాయి. దీంతో సైనికులు ఓ నాలుగు తప్ప మిగిలిన సమాధులను తవ్వి, వాటిని సమీపంలోని మరో శ్మశానానికి తరలించారు. అప్పట్లో వీటి వల్ల పెద్ద ఇబ్బంది లేకపోవడంతో వదిలేశారు. తదనంతర కాలంలో ఇది పౌర విమానాశ్రయంగా మారింది. 1970ల్లో రన్‌వేలను విస్తరించాలని నిర్ణయించారు. అయితే, రిచర్డ్, క్యాథరీన్ సమాధులు ఓ రన్‌వేకు మధ్యలో వచ్చేలా ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం వారి సంబంధీకులు ఒప్పుకుంటే తప్ప.. సమాధులను వేరే ప్రాంతానికి తరలించకూడదు. డాట్సన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో అవి ఉంటుండగానే.. రన్‌వే నిర్మాణం కానిచ్చేశారు.. దీంతో అవిలా రన్‌వే మధ్యలో మిగిలిపోయాయి. అలాగే అమెరికాలోని మాథిస్ ఎయిర్‌పోర్టు(ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు) కూడా.. ఇక్కడైతే.. ఓ 20 మందివి ఉంటాయి. 1960ల్లో రన్‌వే కట్టినప్పుడు చనిపోయినవాళ్ల సంబంధీకులు వాటిని అలాగే ఉంచేయాలని కోరడంతో వాటి మీదుగానే రన్‌వే నిర్మించేశారు. -
విమానమొచ్చింది.. గేటేయండి..!
మన వద్ద రైలు రాగానే రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఈ రైల్వే గేట్లు మనకు కామనే. ఇదే సీన్ విమానానికి ఎదురైతే.. విమానమొస్తుందంటూ వాహనాలు రాకుండా రెండు వైపులా గేట్లు వేస్తే ఎలాగుంటుంది. ఇలాంటి చిత్రమైన సన్నివేశం చూడాలంటే జిబ్రాల్టర్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎయిర్‌పోర్టు రన్‌వే.. నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంటుంది. దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి.. వాహనాలను నిలిపేస్తారు. విమానం వెళ్లగానే.. మళ్లీ వాహనాలు యధావిధిగా వెళ్లిపోతాయి. ఈ ఎయిర్‌పోర్టుకు స్థలం తక్కువగా ఉండటం.. సమతలంగా ఉన్న భూమి లేకపోవడంతో చివరికి ఇలా రోడ్డు మధ్యలో రన్‌వేను నిర్మించాల్సి వచ్చింది.